Breaking News

పునాదుల్లో అంత అవినీతే… హౌసింగ్‌లో అక్రమాల చిట్టా… ముగ్గురు అధికారులతో కదులుతున్న డొంక

నిజామాబాద్‌ ప్రతినిధి, డిసెంబరు 16 ;

‘చేసిన పాపం ఎన్నటికి విడువదు’ అన్నట్లు గృహా నిర్మాణ సంస్థలో పని చేసిన ఉద్యోగుల పాపం ఇప్పుడు పండుతుంది. అప్పట్లో పునాదుల్లో కప్పెసిన అవినీతిని సిఐడి అధికారులు తవ్వి తీసి కారకులను అరెస్టు చేస్తుండటం ఇప్పుడు హట్‌ టాపిక్‌గా మారింది. అక్రమాలకు పునాది వేసిన నేతలంతా ఇప్పుడు అధికారం లేక ఇళ్లలో ఉంటే విధుల్లో ఉన్న ఉద్యోగులకు చెరసాల తప్పడం లేదు. అవును మరి ‘తిల పాపం తల పిడికెడు’ అన్నట్లు పాపం పంచుకునేది ఎవరనే అధికారులు ఎదురు చూపులు చూస్తున్నారు.

టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో రాగానే హౌసింగ్‌లో అవినీతి చీడ వోలుస్తానని కెసిఆర్‌ ప్రకటన చేసినట్లే, ఈ పథకాన్ని ఏకంగా విచారణ కోసం సిబిసిఐడికి ఇచ్చిన సంగతి తెలిసిందే. గత ఆరుమాసాలుగా జిల్లాలో విచారణ చేస్తున్న అధికారులు ఏకంగా సంబంధిత అధికారులపై పోలీసు చర్యలు దిగింది. దీంతో కాంగ్రెస్‌ హాయంలో అవినీతిలో కూడుకుపోయిన అవినీతి జలగాలకు ఇప్పుడు భయం పట్టుకుంది. ఏకంగా బోధన్‌ పోలీసులు కలెక్టరేట్‌ సాక్షిగా ముగ్గురు అధికారులను అరెస్టు చేసి తరలించడంతో గృహా నిర్మాణ శాఖలోని అధికారుల్లో గుబులు మొదలైంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు అప్పుడు అధికారంలో ఉన్న పెద్దలు(కాంగ్రెస్‌ నేతలు)అండ ఉండటంతో అధికారులు సైతం అందినకాడికి దండుకొని, అంతులేని అక్రమాలకు పునాదులు వేసారు. అప్పట్లో బోధన్‌ మండలం ఊట్‌పల్లి, అమ్దాపూర్‌ గ్రామాలు, కోటగిరి కొత్తపల్లితో పాటు మరో రెండు గ్రామాల్లో జరిగిన అవినీతి రాష్ట్ర స్థాయిలోని చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో అప్పటి మంత్రి, స్థానిక ఎమ్మేల్యేలు సైతం కలుగజేసుకొని అసలు విషయం బయటకు రాకుండా చూసారు.

ఇది అరెస్టు తంతు…

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌ కార్పొరేషన్‌ కార్యాలయం, ఐకేపీలో పనిచేసే ముగ్గురు ఉద్యోగులను సోమవారం బోధన్‌ పోలీసులు అరెస్టు చేశారు. 2009లో కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో ఇందిరామ్మ ఇండ్ల నిర్మాణాలలో అవినీతి జరిగిందని సీబీసీఐడీ విచారణలో తేలింది. 244 ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రూ.44.64 లక్షల రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం స్పందించి విచారణ జరిపించాలని కలెక్టర్‌ రొనాల్డ్‌ రోస్‌ను ఆదేశించింది. ఆయన తగిన చర్యలు తీసుకోవాలని కోటగిరి పోలీసులకు సూచించారు. అవినీతి జరిగిందంటున్న సమయంలో బోధన్‌ డివిజన్‌ హౌసింగ్‌ డీఈగా రాజేశ్వర్‌, కోటగిరి మండల ఏఈగా రాజన్న, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లుగా విశ్వనాథం, నయీమ్‌లు పని చేసారు. విచారణ అనంతరం డీఈ రాజేశ్వర్‌ను సర్వీస్‌ నుంచి తొలగించగా,మిగతా ముగ్గురిని అక్కడి నుంచి బదిలీ చేశారు. సోమవారం సాయంత్రం బోధన్‌ రూరల్‌ సీఐ దామోదర్‌రెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకుని ప్రగతిభవన్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌లో పని చేస్తున్న ఏఈ రాజన్న, ఐకేపీలో పనిచేస్తున్న సీసీలు విశ్వనాథం, నయీమ్‌లను అరెస్టు చేసి బోధన్‌కు తీసుకెళ్లారు.

హౌసింగ్‌ సిబ్బందిలో కలకలం…

గృహ నిర్మాణ శాఖకు చెందిన ముగ్గురు ఉద్యోగులును బోధన్‌ పోలీసులు అరెస్టు చేయడంతో సిబ్బందిలో కలవరం మొదలైంది.ఈ పథకంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, బోగస్‌ బిల్లులతో డబ్బులు కాజేశారని ఆరోపణలు వచ్చాయి. ఇందులో నిజానిజాలు తేల్చేందుకు సీనియార్‌ అధికారి చారుసిన్హా నేతృత్వంలో తెలంగాణ సర్కారు సీబీసీఐడీ విచారణకు ఆదేశించింది. సీబీసీఐడీ సీఐ శ్రీనివాస్‌, ఇతర అధికారులు 2009 లో కోటగిరి మండలంలో కొత్తపల్లి గ్రామంలో జరిగిన అవకతవకపై అవినీతి జరిగినట్లు గుర్తించి ప్రభుత్వానికి నివేదికను అందజేశారు. ఆ తరువాత కలెక్టర్‌ ఆదేశాల మేరకు పోలీసులు కూడా విచారణ జరిపారు. అవినీతి వాస్తవేమని తేలడంతో మొదటగా ముగ్గురిని అరెస్టు చేశారు. సీబీసీఐడీ విచారణ జరిపిన మిగతా గ్రామాలలోనూ అక్రమార్కులపై కేసులు పెట్టి,అరెస్టు చేసేందుకు అధికారులు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలిసింది.

Check Also

ఆర్థిక ప్యాకేజీతో అన్ని వర్గాల‌కు ఊరట…

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ నగర శాఖ ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *