Breaking News

చెడిన మైత్రి…. మైత్రి సంఘాల మాటే కరువు… ప్రేండ్లీ పోలీసులు ఏ మేరకు…?

బాన్సువాడ, డిసెంబర్‌20

పోలీసు ప్రవర్తన నియమావళి తిరోగమనం దిశగా సాగుతోంది. భాషాప్రయోగం కాఠిన్యమైంది. మైత్రి సంఘాలు మరుగున పడ్డాయి. కళాజాతలు కనుమరగయ్యాయి. సామాజిక కార్యక్రమాలు పూజ్యమయ్యాయి. బోధన్‌ డివిజన్‌లో దశాబ్ధం కింద పోలీసు శాఖ ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టి సామాన్యులకుచేరువైంది.

గ్రామాల్లో మైత్రీ సంఘాలు విరివిగా ఏర్పాటుచేసి సమాచార వ్యవస్థను పెంచుకుంది. దీంతో చిన్నచిన్న నేరాలు జరిగినపుడు వాస్తవాలను ప్రజలనుంచి రాబట్టి బాధితులకు సత్వరంన్యాయం చేయగలిగారు. మైత్రీ సంఘాల ఆధ్వర్యంలో గ్రామసభలు పెట్టి సామాజిక సమస్యలను తెలుసుకుంది.ఆయా ప్రభుత్వ శాఖలకు నివేదించి సత్వర పరిష్కారానికి పాటుపడింది.

పోలీసు శాఖ కృషితోనే అప్పట్లో పలు గ్రామాలకు రహదారులు, తాగునీటి, విద్యుత్‌, రవాణాసౌకర్యాలు మెరుగయ్యాయి. కొన్నిచోట్ల అభివృద్ధిపనులకు పోలీసులే ముందుండి చేపట్టారు. ముఖ్యంగా తీవ్రవాద ప్రాబల్యంగల ప్రాంతాలుగా పేరొందిన బాన్సువాడ, నిజాంసాగర్‌,వర్ని, బిచ్కుంద ప్రాంతాల్లో పోలీసులు పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు.

బాన్సువాడ మండలం హన్మాజీపేట వద్ద 2లక్షలతో శివారు ప్రాంంతంలోని హన్మాన్‌ మందిరం వరకు రహదారిని నిర్మించారు. అప్పటి బోధన్‌డిఎస్పీ సీతారాంరెడ్డి రైతులను ఒప్పించి పొలాల మధ్యనుంచి రహదారి వేయించారు. ప్రస్తుతం ఇదిరైతులకు ఎంతో ఉపయోగపడుతోంది. ఇదే ప్రాంతంలోని ఖానాపూర్‌లో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. తాండాలో పారిశుభ్రతపై అవగాహన సదస్సులు ఏర్పాటుచేసి పండ్లు, సబ్బులు,దుస్తులు పంపిణీచేశారు.

మూఢనమ్మకాలు, జూదం, తీవ్రవాద అంశాలపై కళాజాత ప్రదర్శనలు నిర్వహించి గిరిజనుల్లో అవగాహన పెంచారు. సామాజిక పనులతో పాటు యువతకు క్రీడాపోటీలు నిర్వహించారు. ప్రమాదాలక నివారణకు పాఠశాలల విద్యార్థులతో అంకుల్‌ జాగ్రత్త అనే కార్యక్రమంనిర్వహించి ఆలోచనలను రకెత్తించారు. మత విభేదాలను రూపుమాపడానికి కృషిచేసింది. పలుచోట్ల దళితవాడల్లో వినాయక మండళ్లను ఏర్పాటుచేయించారు. సహపంక్తి భోజనాలను పెట్టించారు.

వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రతిభప్రాతిపదికన బహుమతులుఇచ్చారు. పోలీసుల చరవతోనే అప్పట్లో కొన్ని గ్రామాల వారు నక్సల్స్‌ను తమ గ్రామాలకు రాకుండా అడ్డుకున్నారు.

తారు మారు…..

ప్రజాహిత కార్యక్రమాలతో ప్రజలకు చేరువైన పోలీసుశాఖ మళ్లీ తిరోగమన వైపు సాగుతోంది. సామాజిక కార్యక్రమాలు మరుగునపడ్డాయి. మైత్రీ సంఘాలు ఉనికిలేకుండా పోయాయి. సన్నిహిత కేంద్రాలు అలంకార ప్రాయమయ్యాయి. రాజకీయ ప్రభావంపోలీసు శాఖను ప్రభావితంచేస్తోంది. పైరవీల వ్యవస్థ కేసులను శాసిస్తోంది. ముఖ్యంగా బోధన్‌ డివిజన్‌లో ఇసుక అక్రమ రవాణా పోలీసు శాఖకు కాసులు కురిపిస్తున్నాయి. అందుకే కొందరు అధికారులు ఇక్కడ తిష్టవేసందుకు ఇష్టపడుతున్నారు. బదివలీపై వెళ్లేందుకు ససెమిరా అంటున్నారు. ఇటీవల డిఎస్పీల బదిలీ వివాదం ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రస్తుతం కొన్నాళ్లుగా ఫ్రెండ్లీపోలీసు పేరుతో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నా ఆశించిన ఫలితం కానరావడంలేదు. పలుచోట్ల ఆశాఖ అవవాదును మూటగట్టుకుంటోంది.

Check Also

రైతును రాజు చేయాల‌న్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే ఖరీఫ్‌ సీసన్‌లో వ్యవసాయంపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *