Breaking News

చారిత్రక ఘనత వహించిన నాటి ఇంద్రపురి వైభవం

నిజామాబాద్ న్యూస్ ప్రత్యేకం

ఎస్. శర్మ

 

నిజామాబాద్‌ జిల్లా చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్న అనేక పర్యాటక విశేషాలను పాఠకుల సౌలభ్యం కోసం అందజేసే సంకల్పంతో మీ ముందుకు వస్తున్నాం. జిల్లా ఇంద్రపురిగా అవతరించి కాలక్రమంలో నిజామాబాద్‌గా మార్పు చెందిన చారిత్రక కథనం ఇది.

కామారెడ్డి: బోధన్‌ ఒకప్పటి భారత గాథలో బకాసుర వధ వృత్తాంతాన్ని తెలియజేసే ఏకచక్రపురంగా ద్వాపార యుగం నుంచి వీటి ఆనవాళ్లు కలిగి వుంది.

చోళులు, బాదామి చాళుక్యులు పాలనల ద్వారా శ్రావణ బెళగోలలో నెలకొల్పిన బాహుబలిని పోలిన విగ్రహం బోధన్‌లో వెలుగులోకి వచ్చి ఈ చారిత్రక నేపథ్యాన్ని జైన తీర్థాంకరుల స్థావరంగా పేర్కొనదగినది. నవనాథ గురువుల ఆనవాళ్లతో ఆర్మూర్‌ ప్రాంతం సైతం జైన మత వ్యాప్తిలో పేరుగాంచినది. పైఠానపురం బోధన్‌గా మార్పు చెంది వేల ఏళ్ల చారిత్రక నేపథ్యాన్ని జిల్లాకు అందిస్తుంది. జిల్లాలో నిజాం సంస్థానానికి పూర్వం ఇంద్రపురి అనే పేరుతో నిజామాబాద్‌ జిల్లా పిలవబడింది. బాదామి చాళుక్యుల్లో ఇంద్రుడు అనే రాజు పరిపాలించిన ప్రాంతంగా ఈ ప్రాంతానికి ఇంద్రపురి క్రమంగా ఇందూరుగా ప్రశస్తికెక్కింది.

క్రీస్తుశకం 7 నుంచి పదవ శతాబ్దం వరకు అనేక శిలా శాసనాలు బోధన్‌ చారిత్రక అవశేషాలుగా పురావస్తుశాఖ సేకరించగలిగింది. నాటి శాసనాలు, తామ్రపత్రాలు అనేకం చారిత్రక నేపథ్యాన్ని వెలుగులోకి తెచ్చాయి. అయితే అప్పటి పైశాచిక బాష ఈ ప్రాంతంలో విస్తృతంగా ప్రచారంలో వుండేది. ఆ భాష పూర్వ హలగన్నడ లిపిని పోలి వుండడంతో అది మార్పు చేర్పులకు లోనై నేటి ప్రాకృత భాషకు మూలమైంది.

కన్నడ తొలి రచయిత పంపడు ఈ ప్రాంతంలోనే తన రచనను పూర్తి చేసినట్లు ఆ శాసనాల వల్ల బహిర్గతమైంది. తదనంతరం కన్నడ భాష విస్తృతితో పాటు తొలి తెలుగు భాష రూపుదాల్చింది. సింహాసన ద్వాత్రిసంషిక గ్రంథ రచనతో కొరవి గోపరాజు అనే కవి భీమునిగల్లు (భీంగల్‌) చేసిన విద్ధసాల భంజికల వృత్తాంతం నాటి విక్రమార్కుని కథనాన్ని కండ్లకు రక్తి కట్టిస్తుంది.

19వ శతాబ్దంలో దోమకొండ సంస్థానంలో జనతా కళాశాల అధ్యాపకునిగా అభినవ పోతన బిరుదాంకితులు వానమామలై వరదాచార్యులు అనేక రచనా కుసుమాలను అందించి ఈ ప్రాంత వైశిష్ట్యాన్ని వెలుగులోకి తెచ్చారు.

17 నుంచి 19వ శతాబ్దం వరకు దోమకొండ సంస్థానంలో ఉర్దూ, పారశీ, అరబీ భాషల్లో అనేక గ్రంథాలు, రచనలు కవులను ఒక స్వర్ణయుగంలో నడిపించింది. ఆయా భాషల్లో నిఘంటువులను రూపొందించి అప్పటి శాసన రచనకు బీజం వేసింది. దోమకొండ సంస్థానంలో కామినేని మల్లారెడ్డి అనే కవి పద్మపురాణం వంటి అనేక శైవ గ్రంథాలను రచించి గణతికెక్కారు.

అప్పటి రచనలు హైదరాబాద్‌లో కేంద్ర గ్రంథాలయంలో మద్రాసు, లండన్‌ లైబ్రరీలలో చోటు చేసుకోవడం విశేషం. జిల్లా చారిత్రక నేపథ్యం అసబ్‌జాహిల కాలంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది.

అసబ్‌జాహి-2 నేతృత్వంలో ఇందూరును 18వ శతాబ్దంలో నిజామాబాద్‌గా మార్పు చేశారు. ఇందూరు ఫిర్కాలో వున్న బాన్సువాడ, కామారెడ్డి, బోధన్‌, నాందేడ్‌, నిర్మల్‌, దెగ్లూర్‌, బైంసా ప్రాంతాలతో వుండేది. ఈ ప్రాంతాన్ని నిజామాబాద్‌గా రూపాంతరం చేశారు. నిజం అసబ్‌జా పేరుమీద నిజామాబాద్‌గా మారింది.

జిల్లాలో తమ పాలనకు నిదర్శనంగా నిజాం పేరుమీద పట్టణాన్ని ఏర్పాటు చేయడంతో పాటు నిజాంసాగర్‌, అలీసాగర్‌ వంటి జలాశయాలను నిర్మించి ఈ ప్రాంతంలో వ్యవసాయిక అభివృద్ధికి పునాది వేశారు. అదే కాలంలో హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ మీదుగా మన్మాడ్‌ వరకు రైల్వే లైన్‌ నిర్మించి రవాణా అనుసంధానం జరిగింది.

అదే దశలో హైదారాబాద్‌ నుంచి నాగ్‌పూర్‌ వరకు రోడ్డు మార్గం అభివృద్ధి చేశారు. నిజామాబాద్‌ అప్పట్లోనే వ్యవసాయికంగా అభివృద్ధి సాధించి స్వావలంబన దిశకు ఎదిగింది. నాటి నిజాం సంస్థానంతో పాటు స్థానిక సంస్థానాల్లో ప్రముఖంగా చెప్పుకోదగింది దోమకొండ, సిర్నాపల్లి గడి, కౌలాస్‌ కోటల్లో జమీందారీ వ్యవస్థ ద్వారా భూస్వామ్య విధానం అమలైంది. వందల కొలది ఎకరాలు సాగులోకి వచ్చి పంట సంస్థానాదీశులు, జమీందారీల సొత్తుగా మారింది.

ఈ దశలో సామాన్య వ్యవసాయ కూలీల సంఘటితమై నూతన వ్యవసాయ విప్లవానికి నాంది పలికారు. ఈ వ్యవసాయిక విప్లవం చివరికి దున్నేవాడికే భూమి అనే నినాదం వైపు వెళ్లింది. జమీందారీల ఆధీనంలో వున్న భూమిపై హక్కుల సాధన కోసం గ్రామాల్లో చైతన్యం వెల్లివిరిసింది. ఇందుకు నాటి రచనలు కూడా దోహదమయ్యాయి.

నాడు జమీందారీలు తమ పంట పొలాలు వృద్ధి చెందేందుకు నిర్మించుకున్న చిన్న నీటి వనరులు మధ్యతరహ నీటి పథకాలు చెరువులు, కుంటలు వ్యవసాయికంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పర్చింది. కానీ సామాన్యులు వెట్టి కూలీలుగా మిగిలిపోవడం వీరిని కలచివేసింది. వెట్టిని నిరాకరించిన గ్రామాలపై బహిష్కరణల వేటుతో జమీందారీలు సంస్థాన పాలకులు ఉక్కుపాదంతో అణచివేశారు.

ఈ దశలోనే నిజాం వద్ద సైనికాధికాగా వున్న ఖాసీంరజ్వీ నేతృత్వంలో రజాకార్ల వ్యవస్థ రూపొంది గ్రామాల్లో తీవ్ర నిరంకుశ విధానాలను విశృంఖలంగా అమలుపర్చారు. సాధారణ కూలీలపై అరాచకాలే కాకుండా గ్రామాల్లో పల్లెల్లో వున్న మహిళలపై అరాచకాలు కొనసాగిస్తూ అప్పటి నైజాం ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎత్తేలా చేశారు.

ఈ ఉద్యమం తీవ్ర అణచివేతకు గురవుతూనే మరో వైపు బానిస సంకెళ్ల విముక్తి కోసం పోరాటం కొనసాగింది. 1948 సెప్టెంబర్‌ 17న జరిగిన భారత సైనిక చర్యతో నైజాం రాజ్యం భారతయూనియన్‌లో విలీనమైంది. అప్పుడే నిజామాబాద్‌లోని చిన్న జమీందారీలు, సంస్థానాదీశులు సైతం స్వతంత్రాన్ని పొంది భారత అంతర్భాగంలో విలీనమయ్యారు.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *