Breaking News

పేరుకే పెద్దాసుపత్రి… చికిత్సకు దిక్కేది…

 

ఇందూరు, సెప్టెంబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అది ఓ ఏడంతస్తుల అద్దాల మేడ… జిల్లాలోని నిరుపేదలందరికి ఉచిత వైద్యం అందించేందుకు కోట్లు ఖర్చుచేసి నిర్మించిన ఆసుపత్రి అది. కాని పేరుకు మాత్రమే పెద్దాసుపత్రిగా మారింది. చికిత్స కోసం ఈ ఆసుపత్రికి వెళ్లే అంతే సంగతులు. ఉన్న ప్రాణం గాల్లో కలిసిపోవాల్సిందే. దీంతో ఈ దవాఖాన పేరు చెప్తేనే ప్రజలు జంకుతున్నారు. అప్పో సోప్పో చేసి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు తప్ప ఇటువైపు రావడం లేదు.

అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని అన్న చందంగా మారిన నిజామాబాద్‌ జిల్లా ఆసుపత్రిపై ఓ కథనం…నిజామాబాద్‌ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి తీరు రోజురోజుకు దారుణంగా మారుతుంది. మేడిపండు చందంగా ఉన్న ఈ అద్దాల మేడలో వైద్యం కోసం వచ్చే రోగులు పడే తిప్పలు అంతా ఇంతా కాదు. ఉచిత వైద్యం కోసం ఆశగా వచ్చే రోగులకు చుక్కలు చూపిస్తున్నారు ఇక్కడి వైద్యులు.

అసలు డాక్టర్లు ఎప్పుడు వస్తారో తెలియదు. అసలు వస్తారో రారో తెలియదు. చికిత్స మాట దేవుడెరుగు కనీసం పలకరించేవారు కూడా ఉండరక్కడ దీంతో ఎవరిని సంప్రదించాలో ఎలా వైద్య చికిత్స పొందాలో తెలియక ఎందుకొచ్చిన బాధలనుకుని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు. 2009లో నూతన భవనంలోకి వచ్చిన జిల్లా ఆసుపత్రిలో మొత్తం ఏడు అంతస్తులు ఉన్నాయి. వేరు వేరు సెక్షన్లకు వేరు వేరు వార్డులతో సకల సౌకర్యాలు కల్పించింది. చికిత్స కోసం వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ఏటా లక్షల రూపాయలు వెచ్చిస్తుంది. ఇందులో భాగంగానే అన్నీ ఏర్పాట్లను చేసింది. జిల్లా ప్రజలను వణికిస్తున్న డెంగ్యూ వ్యాధికి సైతం చికిత్స అందించేందుకు ఈ మద్యనే తెలంగాణ ప్రభుత్వం ఈ ఆసుపత్రిలో కోటి రూపాయలు వెచ్చించి స్లేట్‌ లెట్‌ మిషన్‌ను ఏర్పాటు చేయించింది. వ్యాధి లక్షణాలను గుర్తించేందుకు అన్ని పరికరాలను అమర్చింది.

అంతేకాదు బ్లడ్‌ బ్యాంకు, స్కానింగ్‌ సెంటర్‌, సిటి స్కానింగ్‌ లతో పాటు మహిళలకు ప్రత్యేక వార్డులు,టిబి, క్షయ తదితర వ్యాధి గ్రస్తులకు చికిత్స అందించేందుకు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయించింది. ఎక్కడ కూడా రోగులకు అసౌకర్యాలు లేకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇన్ని ఉన్నా వైద్యుల నిర్లక్ష్యమే శాపంగా మారింది. సమయపాలన లేని వైద్యులు నియంత్రణలేని సిబ్బంది వల్ల అసలు సమస్య ఏర్పడుతుంది. దీనికి తోడు డాక్టర్ల కొరత వల్ల కూడా వైద్యం అందని ద్రాక్షలా మారుతుంది.

జిల్లా నలుమూలల నుంచి వచ్చే బాధితులకు వైద్యం అందకపోవడంతో పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఉచిత వైద్యం కోసం వచ్చే నిరుపేదలకు చివరికి నిరాశ ఎదురవుతుంది. దీంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దవాఖాన పేరు మాత్రమే పెద్దాసుపత్రిగా మారిందంటున్నారు. ముఖ్యంగా ఆసుపత్రిలో 16 మంది స్పెషలిస్టులు, 143 మంది జనరల్‌ డాక్టర్లు, ఇతర వైద్య నిపుణులు మొత్తం కలిపి 192 మంది ఉన్నారు. ఇందులో అధిక శాతం మంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారే. అందుకే సమయపాలన పాటించడం లేదు. ఎలాంటి సమాచారం లేకుండా డ్యూటీకి డుమ్మా కొడుతున్నారు. ఒకవేళ డ్యూటీకి వచ్చినా ఎక్కువ సమయం ఉండలేరు. దీంతో స్పెషలిస్టు డాక్టర్ల కోసం రోగులు కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు ఆసుపత్రిలో ఉండాల్సిన వైద్యుల సంఖ్య కంటే చాలా తక్కువ మంది ఉండడంతో సమస్య ఏర్పడుతుంది. ఇక సిబ్బంది తీరుగురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వైద్యులు సమయపాలన పాటించకపోవడంతో వారు కూడా ఇస్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ఇది అదునుగా భావించి అందిన కాడికి దండుకుంటున్నారు. గ్లూకోస్‌ ఎక్కించాలన్నా స్టెచర్‌పై తీసుకెళ్లాలన్నా వారు అడిగినంత చేతిలో పడితేనే పనులు చేస్తున్నారు. దీంతో నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసూతి చేయించుకోవాలని ఓ వైపు ప్రభుత్వం,జిల్లా కలెక్టర్‌ చెప్తుంటే మరోవైపు ఇక్కడేమో ఇలా అందినకాడికి దండుకుంటున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇంతేకాదు అంబులెన్సు వ్యవస్థ కూడా దారునంగా మారింది. ఎప్పుడు ఎక్కడ మొరాయిస్తుందో తెలియని పరిస్థితి రోగులను సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకురావాల్సిన అంబులెన్సులు ఇలా మారినా ఎవరు పట్టించుకోవడం లేదు. పైగా ప్రైవేటు అంబులెన్సులు నిబంధనలకు విరుద్దంగా ఇక్కడ దర్జాగా దందా చేసుకుంటున్నా వారిని అదుపుచేసేవారు లేకుండా పోయింది. మొత్తంమీద జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వైద్యం అందని ద్రాక్షలా మారింది.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

రైతును రాజు చేయాల‌న్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే ఖరీఫ్‌ సీసన్‌లో వ్యవసాయంపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *