Breaking News

విధులపై నిర్లక్ష్యం తగదు

 

– వైద్య ఆరోగ్య శాఖకు స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్‌

నిజామాబాద్‌ రూరల్‌, సెప్టెంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రతి నెల దాదాపు 20 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని, కాని కనీస కార్యక్రమాల అమలులో కూడా చాలా వెనకబడి ఉన్నామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయి నుంచి పనితీరులో మార్పు రావాలని పిలుపునిచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ పనితీరును మెరుగుపర్చేందుకు గ్రామ పంచాయతీ స్తాయి హెల్త్‌ కమిటీని భాగస్వాములను చేయనున్నట్టు ప్రకటించారు. బుధవారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన డివిజన్‌ స్థాయి సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ పనితీరును కలెక్టర్‌ సమీక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జనని సురక్ష యోజన, ఇతర పథకాలకు మంజూరు చేస్తున్న నిధులను కూడా వినియోగించడం లేదని ఆక్షేపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల తీరు దారుణంగా ఉందని అన్నారు. ఇందల్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేవలం ఒకే ఒక ప్రసవం జరిపారని, కాని ప్రయివేటు ఆసుపత్రుల్లో 292 ప్రసవాలు జరిగాయని చెప్పారు. వాటిలో కొన్ని ప్రసవాలు ఇళ్ల వద్దే జరిగి ఉంటాయని అన్నారు. ప్రయివేటు ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలకు 5 నుంచి 10 వేల వరకు ఖర్చువుతుందని, అదే సిజేరియన్‌ ఆపరేషన్‌ అయితే 20 వేల వరకు ఖర్చవుతుందని అన్నారు. పేద ప్రజలు ఈ ఖర్చుల వల్ల అప్పుల పాలవుతారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు లేవని అన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా జరుగుటలేదని అన్నారు. ప్రతి గర్భిణీకి బర్త్‌ ప్లానింగ్‌ తయారుచేసి రెగ్యులర్‌గా ఇమ్యునైజేషన్‌ అందిస్తు, ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించాలని ఆదేశించారు. పరీక్షలకై ఆసుపత్రికి వచ్చి, వెళ్ళేందుకు ప్రయాణ చార్జీలను ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. బాలింతలకు కూడా రానుపోను చార్జీలు ఇస్తున్నట్టు తెలిపారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈనిధులు సమృద్ధిగా ఉన్నట్టు తెలిపారు. అలాగే ఆసుపత్రి అబివృద్ది సొసైటీ నిధులు కూడా ఖర్చు చేయుటకు అత్యవసర మౌలిక వసతుల కల్పనకు ఈ నిదులు వినియోగించాలని కలెక్టర్‌ సూచించారు.

Check Also

క్యాంపు కార్యాల‌యంలో హరితహారం

నిజామాబాద్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంలో భాగంగా జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ...

Comment on the article