Breaking News

కథలు చెప్పొద్దు … ఫలితాలు చూపండి

 

– జిల్లాకలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా

ఎడపల్లి, డిసెంబరు 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యావ్యవస్థపై అధికారులు కథలు చెప్పొద్దని, ఫలితాలు రాబట్టి నూటికి నూరుశాతం సాధించామని చేసి చూపెట్టాలని జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా విద్యాశాఖాధికారులను హెచ్చరించారు. శుక్రవారం ఎడపల్లి మండల కేంద్రంలోని ఎంఆర్‌సి భవనంలో మండల అధికారులతో విద్యాశాఖపై సమీక్షించారు.

ఈ సందర్భంగా మండలంలోని విద్యావ్యవస్థ తీరుతెన్నులు సాధించిన ఫలితాలు, చేపట్టబోయే కార్యాచరణ, ఇందుకు తీసుకోబోయే చర్యలపై కలెక్టర్‌ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో విద్యాశాఖ మొత్తం సిండికేట్‌గా మారిందన్నారు. ఎవరు చేయవలసిన పని వారు చేయకుండా ఎవరికి వారే యమునా తీరేగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం తగ్గినా అధికారులు చర్యలు చేపట్టడం లేదని అన్నారు. నిత్యం గైర్హాజరు అయ్యే విద్యార్థుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

మండలంలో ఐదు పాఠశాలలను శాంపిల్‌గా తీసుకొని నూటికి నూరుశాతం అన్ని సౌకర్యాలు కల్పించి, నూటికి నూరుశాతం హాజరు శాతం, ఉత్తీర్ణత శాతం ఉండేలా చర్యలు చేపట్టాలని దీనిని మోడల్‌గా తీసుకొని అన్ని పాఠశాలల్లో ఇదే పద్దతులు అవలంబించాలని కలెక్టర్‌ అన్నారు. మండలాల్లో నియమించిన పిఆర్‌సిలు ప్రభుత్వ పాఠశాలల గురించి పట్టించుకోవడం లేదని నెలనెలా జీతం వస్తే చాలన్న దృస్టిలో వున్నారని కలెక్టర్‌ మండిపడ్డారు. ఉపాధ్యాయులు, సిఆర్‌పిలు, విద్యాశాఖ అధికారులు సమష్టి కృషి చేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు తీసుకురావచ్చని అన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా పనిచేయాలని హెచ్చరించారు. పాఠశాలల్లో డిసెంబరు 31 వరకు సిలబస్‌ పూర్తి చేయని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. నేటినుంచి ప్రతిపాఠశాలలో సిఆర్‌పిలు తమ విదులకు తగ్గట్టు పనిచేసి తమ నైపుణ్యాన్ని చూపించాలని, సక్రమంగా పనిచేయని వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్‌ హెచ్చరించారు. కార్యక్రమంలో బోధన్‌ ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్‌, ప్రోగ్రామ ఆఫీసర్‌ శ్రీహరి, డిప్యూటి డిఈవో పద్మనాభం, తహసీల్దార్‌ గఫర్‌మియా, జిల్లా సిఎంఓలు సుధాకర్‌, స్వర్ణలత, ఎంపిడివో రమాదేవి, ఎంఇవో రామారావు, ఈవో పిఆర్‌డి వేణుగోపాల్‌, మండలంలోని వివిధ గ్రామాల సిఆర్‌పిలు, ఉపాధి సిబ్బంది, ఐకెపి సిబ్బంది తదితరులున్నారు.

Check Also

ఘనంగా కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *