Breaking News

29న అఖిలపక్షం ఆధ్వర్యంలో జలసాధన యాత్ర

 

– విజయవంతం చేయాలని నాయకుల పిలుపు

కామారెడ్డి, డిసెంబరు 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రాణహిత-చేవెళ్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం ప్యాకెజి-22 ను రద్దుచేయడాన్ని నిరసిస్తూ ఈనెల 29న అఖిలపక్షం ఆధ్వర్యంలో జల సాధన యాత్ర చేపట్టినట్టు అఖిలపక్ష కమిటీ ప్రతినిధులు తెలిపారు.

శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. 29న ఉదయం 9 గంటలకు సదాశివనగర్‌ మండలం భూంపల్లి నుంచి గాంధారి ఎక్స్‌రోడ్డు వరకు పాదయాత్ర నిర్వహించి బహిరంగ సభ ఏర్పాటు చేశామన్నారు. కామారెడ్డి-ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని అఖిలపక్ష నాయకులతో పాటు రైతులు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. దీనికి శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీతో పాటు వివిధ పార్టీలకుచెందిన రాష్ట్ర నాయకులు హాజరవుతున్నట్టు తెలిపారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖర్‌రెడ్డి నిజామాబాద్‌, కామారెడ్డి, ఎల్లారెడ్డి రైతుల భూములకు సాగునీరు, తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రాణహిత-చేవెళ్ల పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్యాకెజి- 22ను రద్దుచేయడం వల్ల కామారెడ్డి-ఎల్లారెడ్డి రైతులకు సాగునీరు, తాగునీరు లేకుండా పోతుందన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి రైతులకు కాళేశ్వరం నుంచి సాగునీరు అందిస్తామనడం ఇక్కడి రైతులను మోసం చేయడమేనన్నారు. దీనివల్ల ఈ ప్రాంత రైతులకు నీరు రాదని, భావి తరాలకు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వం దీన్ని రద్దుచేసి ప్యాకెజి-22 పనులను త్వరిత గతిన ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ఇందుకోసమే జలసాధన యాత్ర చేపడుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు కైలాష్‌ శ్రీనివాస్‌రావు, మోతె కృష్ణాగౌడ్‌, వి.ఎల్‌.నర్సింహారెడ్డి, నజిరుద్దీన్‌, ఉస్మాన్‌, సుధాకర్‌, గంగాధర్‌, బిఎంఎస్‌వి భద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *