Breaking News

బండతో కొట్టి.. గొంతుకోసి.. ఒకరి దారుణ హత్య

-మృత దేహాన్ని పరిశీలించిన డీఎస్పీ
-జాగిలంతో ఆధారాలు సేకరించిన పోలీసులు

వర్ని: మండలంలోని రుద్రూర్ గ్రామానికి చెందిన సిరిగందం రాములు (58)అటెండర్ సోమవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం బోధన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రాములు పరిశోధన కేంద్రంలోని కృషి విజ్ఞాన్ కేంద్రంలో 31ఏళ్లుగా అటెండర్‌గా పనిచేస్తున్నాడు. రోజులాగే విధులకు వెళ్లిన రాములు సాయంత్రం తిరిగి ఇంటికి రాక పోవడంతో మృతుడి కుమారుడు సాయిలు తండ్రికి మంగళవారం ఉదయం 5గంటల ప్రాంతంలో ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సాయిలు 7గంటల ప్రాంతంలో తండ్రి కోసం కార్యాలయానికి వెళ్లాడు. కార్యాలయం సమీపంలోనే సీడ్‌టెక్నాలాజీ కళాశాల వద్ద రాములు ద్విచక్రవాహనం నిలిపి ఉండడాన్ని గమనించాడు.

చెప్పులు సైతం చెల్లాచెదురుగా పడిఉన్నాయి. వాటర్ ట్యాంక్ పక్కనే రాములు మృత దేహం కనిపించడంతో సాయిలు ఆందోళన చెందాడు. దుండగులు కత్తితో గొంతును గోసి, తలపై బండరాయితో కొట్టి చంపినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. విషయం తెలుసుకున్న ఎస్సై అంజయ్య అక్కడికి చేరుకుని మృత దేహాన్ని పరిశీలించారు. రాములు కలుపుగోలుగా పని చేసేవాడని కార్యాలయ సిబ్బంది తెలిపారు. మృతుడికి భార్య సాయవ్వ, సాయిలు, లక్ష్మణ్, కళావతి సంతానం ఉన్నారు. రాములును ఎవరైన కక్ష సాధింపుతో హత్యచేశారా? లేక వస్తువులను దుండగులు దొంగిలించడాన్ని రాములు గమనించి వారితో ప్రతిఘటిస్తుండగా హత్యచేసి పరారై ఉంటారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

మృతుడి భార్య, కుటుంబ సభ్యులను డీఎస్పీ వెంకటేశ్వర్లు విచారణ జరిపి రాములు నడవడికపై ఆధారాలను సేకరించారు. ఆధారాల కోసం పోలీసులు జాగిలంతో గాలించారు. సంఘటన స్థలం వద్ద నుంచి మెస్ ప్రాంతం పైపు వెళ్లిన జాగిలం స్టోర్ రూం వద్దకు వచ్చి నిలిచి పోయింది. సీఐ శ్రీనివాసులు, ఎస్సై అంజయ్య విచారణ చేపట్టారు.

Check Also

ఇళ్ళు దెబ్బతిన్న వారికి తక్షణ సహాయం అందించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా దెబ్బతిన్న ...

Comment on the article