ప్రక్షాళన షురూ
కలెక్టరుకు, వక్ఫ్ బోర్డు సీఈవోకు నివేదిక
వర్ని గ్రామీణం :పవిత్ర పుణ్యక్షేత్రం బడాపహాడ్‌లో భక్తుల నుంచి ఆయా కార్యక్రమాలకు బలవంతంగా సొమ్ము వసూలు చేస్తున్న గుత్తేదారుల సంబంధీకులకు సంబంధించి ‘ఈనాడు’ వరుస కథనాలు సంచలనాలు సృష్టించాయి. ఈ నేపథ్యంలో డీఆర్వో మోహన్‌లాల్ బుధవారం బడాపహాడ్ వెళ్లి చేపట్టిన విచారణలో దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గుత్తేదారుల ఏజెంట్లు వక్ఫ్ బోర్డు నిర్మించిన షెడ్ల చుట్టూ నిర్మాణాలు చేపట్టి ఇందులోకి భక్తులు వెళ్లకుండా అడ్డుతగులుతున్నట్లు గుర్తించారు. వీరి చర్యలను ఎందుకు అడ్డుకోలేదంటూ వక్ఫ్ బోర్డు అధికారులను నిలదీశారు. ప్రైవేటు వ్యక్తులు ఇక్కడ గుడిసెలు వేసి భక్తుల నుంచి భారీగా సొమ్ము చేసుకుంటుంటే చోద్యం చూస్తూ వీరికి సహకరించేలా వ్యవహరించడంలో ఆంతర్మమేమిటని ప్రశ్నించారు. వీరు ట్యాంకులు నిర్మించి నీటి వ్యాపారం చేస్తూ భక్తులను ఇబ్బంది పెడుతున్నా తమకు పట్టదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి కార్యక్రమానికి ధరల పట్టిక పెట్టండి
దర్గాలో కందూరు నిర్వహించే చోట భారీగా సొమ్ము వసూలు చేయడమేమిటని, భక్తులు ఇచ్చింది తీసుకునేలా చర్యలు తీసుకోవాలని మోహన్‌లాల్ వక్ఫ్‌బోర్డు అధికారులకు సూచించారు. మేక కోయడానికి, కందూరు నిర్వహణకు, కొబ్బరికాయ కొట్టడానికి, తలనీలాల సమర్పణ, తదితర వాటికి భక్తులు ఎంత ఇవ్వాలన్నది పలు ప్రాంతాల్లో బోర్డులు పెట్టాలని ఆదేశించారు. బోర్డులో పేర్కొన్న ధరలను వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
న్యాయమైన టెండరు ధరను నిర్ణయించండి
దర్గా ప్రాంతాల్లో ఆయా కార్యక్రమాలకు సంబంధించి గుత్తేదారులు రూ.కోట్లలో వేలం వేస్తుండటమే భక్తులు దోపిడీకి గురికావడానికి ప్రధాన కారణంగా కన్పిస్తోందని డీఆర్వో అన్నారు. వక్ఫ్‌బోర్డు న్యాయమైన టెండరు ధరను నిర్ధారించి ఈ మేరకు టెండరు పిలిస్తే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సూచించారు. ఇక్కడ జరుగుతున్న అక్రమాలపై కలెక్టరుకు, వక్ఫ్‌బోర్డు సీఈవోకు నివేదిక పంపుతానని డీఆర్వో తెలిపారు. బడాపహాడ్‌లో భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందేలా చేసేందుకు నిధులు ఏమేరకు అవసరమో ప్రతిపాదనలు పంపాలని, కలెక్టరు ద్వారా వీటిని ప్రభుత్వానికి పంపి విడుదలయ్యేలా చేస్తానని వక్ఫ్‌బోర్డు అధికారులకు హామీ ఇచ్చారు.

Latest posts by NizamabadNews OnlineDesk (see all)
- డయల్ 100కు 2271 ఫోన్ కాల్స్ - October 10, 2018
- ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - October 10, 2018
- బహుజనులు ఐక్యం కావాలి - October 10, 2018