Breaking News

అఆ

మహేశ్, పవన్, అల్లు అర్జున్.. ఒక్కొక్కరితో రెండేసి చొప్పున దర్శకుడిగా ఆయన చేసిన ఆరు సినిమాలనూ ఈ ముగ్గురు స్టార్ హీరోలతోనే చేసిన త్రివిక్రమ్ తొలిసారి నితిన్ లాంటి యువహీరోతో చేసిన చిత్రం ‘అఆ’. నితిన్, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నేడు తెరమీదికొచ్చింది. పవన్, బన్నీ లాంటి హీరోలకు బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన మాటల మాంత్రికుడు నితిన్‌కి ఏ రేంజ్‌ సక్సెస్‌ని ఇచ్చాడో చూద్దాం.
కథ: అనసూయ రామలింగం (సమంత)కు తండ్రి రామలింగం (నరేష్) దగ్గర బాగా చనువు. తల్లి మహాలక్ష్మీ (నదియా) అంటే మాత్రం చచ్చే భయం. కోటీశ్వరురాలైన మహాలక్ష్మీ తన కూతురి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా అనసూయని ఓ కోటీశ్వరుడికే ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటుంది. అది అనసూయకు నచ్చకపోవడంతో ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది. ఆమె కోలుకున్నాక వ్యాపార పరంగా మహలక్ష్మి చెన్నై వెళ్ళాల్సొస్తుంది. అదే అదనుగా భావించిన అనసూయ కొన్నాళ్ళు తన అమ్మ నీడ నుండి బయట పడాలనుకుంటుంది. తండ్రి సలహాతో తన మామయ్య ఊరైన కలవపూడికి వెళుతుంది. అక్కడ తన సంక్షేమ భాద్యతలు అల్లుడు ఆనంద్ విహారి (నితిన్)కి అప్పగిస్తాడు. చిన్నప్పట్నుండి ఆ కుటుంబంతో పరిచయం లేకపోయినా ఉన్న పది రోజుల్లోనే ఆ కుటుంబంతో బాగా కలిసిపోయిన అనసూయ బావ ఆనంద్ విహారిని ప్రేమిస్తుంది. మరోవైపు అదే ఊర్లోని పేరు మోసిన వడ్డీ వ్యాపారి, భూస్వామి అయిన పళ్ళం వెంకన్న (రావు రమేష్) కూతురు నాగవల్లి (అనుపమ పరమేశ్వరన్)కి ఆనంద్ విహారికి వివాహం ఖాయం అనుకున్న పరిస్థితి. తర్వాతేం జరిగింది. అనసూయ, ఆనంద్ కుటుంబాలు వేరుపడటానికి గల కారణమేమిటి అన్నదే ‘‘అఆ’’.
నటీనటులు: టైటిల్ రోల్స్ పోషించిన సమంత, నితిన్‌ జంట తెరపై అందంగా ఉంది. ‘అత్తారింటికి దారేది’ తర్వాత మరోసారి త్రివిక్రమ్ సినిమాలో అత్తగా కనపడిన నదియ ఈసారి ఆ రేంజ్‌లో ఆకట్టకులేకపోయారు. దానికి కారణం ఆ పాత్రచిత్రణే. హీరో తండ్రిగా జయప్రకాష్, పళ్ళం వెంకన్నగా రావు రమేష్ మెప్పిస్తే ప్రవీణ్, అనన్య, నరేష్, హరితేజ, శ్రీనివాసరెడ్డి ఉన్నంతలో ఫర్వాలేదనిపిస్తారు. అనపమ పరమేశ్వరన్ పరిస్థితి విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి అన్నట్టుంది. అవసరాల శ్రీనివాస్, గిరిబాబు పాత్రలు కథకి తగ్గట్టుగా ఉన్నా రఘుబాబు, సన విషయంలో మాత్రం ప్రేక్షకుడు అసహనానికి గురవుతాడు.
సాంకేతిక వర్గం: ఈ సినిమాకి ప్రధాన బలం పాటలు. ఆడియో విడుదల నుండి సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. అందుకని ఇక్కడ ఏమాత్రం మార్కులు తగ్గించినా రామజోగయ్య శాస్త్రి, కృష్ణచైతన్య కలాలు చటుక్కున గుచ్చుకోవడం ఖాయం. మిక్కీ బాణీలు వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. నటరాజ్ సుబ్రహ్మణ్యం ఛాయాగ్రహణం బాగుంది. క్లోజప్ షాట్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి.
దర్శకత్వం-విశ్లేషణ: త్రివిక్రమ్ మెగాఫోన్ పట్టకముందు కొన్ని సినిమాలకు మాటలు, కథలు రాసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చూసిన తర్వాత తాను దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కథ సగమే రాసి దానికి మాటలు రాశారేమో అనిపిస్తుంది. ‘పరువు’ గురించి చెప్పే మాట ఆయన మార్క్‌ని గుర్తుచేస్తుంది. అనసూయ పాత్రతో కథ మొదలుపెట్టి.. విరామ సమయానికి ఆమెను ఆనంద్ విహారితో ముడిపెట్టి, చివర్లో ఈ రెండు కుటుంబాలు విడిపోవటానికి గల కారణాన్ని బయటపెట్టి తిరిగి వారు ఒక్కటవ్వడంతో కథ ముగుస్తుంది. తొలి సగభాగమంతా హీరోయిన్ పరిచయం, పట్నంలో పెరిగిన ఆమె పల్లెటూర్లోకి వచ్చాక అక్కడ ఎదురయ్యే పరిస్థితులతో కాస్త హాస్యం. వీటి కోసం ఓ మూడు పాటలు. ఇక ద్వితీయార్థానికొచ్చేసరికి హీరో తన చెల్లికి పెళ్ళి చెయ్యాలన్న బాధ్యత, అందులోని సమస్య, ఈ ఇరు కుటుంబాలు విడిపోవడం వెనుక కారణం మరో రెండు పాటలు. పోరాట సన్నివేశాలు సహజంగా ఉన్నప్పటికీ వాటి అవసరం అంతగా కనిపించదు. ఓ పెళ్ళి సంబంధాన్ని చెడగొట్టడానికి సమంత నడుమొంపులు చూపించే సన్నివేశంతో పోలిస్తే ‘భలే భలే మగాడివోయ్‌’కి ముందు మారుతి సినిమాలే నయమనిపిస్తుంది. ప్రేమ, హాస్యం మిళితం చేసి త్రివిక్రమ్ అల్లుకున్న సన్నివేశాలు నవ్విస్తాయి గనక రెండున్నర గంటల వినోదానికి అయితే ఏమాత్రం కొదువ లేదు కానీ త్రివిక్రమ్ గత సినిమాల్లా సెల్యులాయిడ్ మ్యాజిక్ కోరుకుంటే ఇబ్బందిపడక తప్పదు.
అఆ: నితిన్ చెప్పినట్టు అందంగా.. ఆహ్లాదంగా
రేటింగ్: 3/5

Check Also

ఆర్‌ఎంపి, పిఎంపిలు వైద్యం చేయరాదు

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చంద్రశేఖర్‌ బుధవారం ...

Comment on the article