Breaking News

కూర కొనేదెలా?

కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తీవ్రమైన ఎండల కారణంగా పంట దిగుబడులు తగ్గడం, ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో కూరగాయలు సామాన్యులకు అందుబాటులో లేకుండాపోయాయి. నెల రోజుల వ్యవధిలోనే ధరలు వందశాతానికి పైగా పెరిగాయి. గత నెలలో కేజీ పచ్చిమిర్చి ధర రూ.10 నుంచి రూ.20 మధ్య ఉండగా, ఇప్పుడు రూ.100ను తాకింది. గత నెలలో ధర లేక రైతులు టమోటాలను రోడ్డుమీదే పారబోసిన దుస్థితి. మదనపల్లి మార్కెట్‌లో వ్యాపారులే కేజీ టమోటాను రూ.40కి కొంటున్నారు. చిల్లరగా రూ.50కు అమ్ముతున్నారు. సాధారణంగా ఉపయోగించే 13 రకాల కూరగాయలకు ఏప్రిల్‌ 28నాటి ధరల ప్రకారం (ఒక్కోటి కేజీ చొప్పున) రూ.365 అవుతుంది. అదే మే 28 నాటి ధరల ప్రకారం రూ.777 అవుతుంది. అంటే ఒక నెల వ్యవధిలోనే రూ.412 పెరిగింది. మిగతా కూరగాయలు, ఆకుకూరల ధరలు కూడా పరిగణలోకి తీసుకుంటే సామాన్యుల కూరగాయల ఖర్చు భారీగా పెరిగింది.

గణనీయంగా తగ్గిన దిగుబడులు
రాష్ట్రవ్యాప్తంగా 2.3 లక్షల హెక్టార్లలో కూరగాయల సాగు జరుగుతుంది. ప్రతి హెక్టారుకు 25 టన్నుల దిగుబడి చొప్పున 57.50 లక్షల టన్నుల దిగుబడి రావాల్సి ఉంది. ఎండల కారణంగా కనీసం 50 లక్షల టన్నుల దిగుబడి కూడా వచ్చే అవకాశాలు లేవు. ఎండల వేడిమికి బీర, చిక్కుడు, బీన్స్‌ రకాలు అసలు తట్టుకోలేవు. అందుకే ఈ ఏడాది వీటి సాగు బాగా పడిపోయింది. పచ్చి మిర్చిదీ ఇదే పరిస్థితి. రైతు బజార్లకూ సరకు తక్కువగా వస్తున్నందున కొన్నిచోట్ల కేజీల చొప్పున కాకుండా పావు/అరకిలో చొప్పునే ఒక్కో వినియోగదారుడికి విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

పొరుగు రాష్ట్రాల ప్రభావం కూడా..
రాష్ట్రంలో పండుతున్న కూరగాయాలు పొరుగు రాష్ట్రాలకు తరలుతుండడం కూడా ధరలు పెరుగుదలకు మరో కారణం. రాష్ట్రంలో అతిపెద్ద టమోటా మార్కెట్లయిన చిత్తూరు జిల్లా మదనపల్లి, కర్నూలు(ఆలూరు, ఆస్పరి ప్రాంతాలు) నుంచి కర్ణాటక, కేరళ, తెలంగాణలకు రవాణా అవుతున్నాయి. కానీ ఇక్కడ నుంచి ఏపీలోని జిల్లాలకు మాత్రం సరఫరా కావడం లేదు. మహారాష్ట్ర నుంచి బంగాళదుంపల సరకు రావడం తగ్గడంతో వాటి ధరలు పెరిగాయి. కర్ణాటక నుంచి రావాల్సిన బీన్స్‌, క్యాప్సికం, క్యాలిఫ్లవర్‌లు తమిళనాడు, కేరళలకు వెళ్తుండడంతో వాటి ధరలు కూడా అందుబాటులో లేవు.

ప్రత్యామ్నాయాలపై ఏదీ దృష్టి?
ఎండలు ఎక్కువగా ఉండడంతో బహిరంగ పొలాల్లో టమోట పండే పరిస్థితి లేదు. ఇలాంటి చోట పందిళ్ల కింద సాగు చేస్తే దిగుబడులు పెరిగే అవకాశం ఉంది. గ్రీన్‌హౌస్‌, పాలీహౌస్‌, షెట్‌నెట్‌ వంటి వాటిలో సాగు చేసేందుకు అవకాశం ఉన్నా, అందుకుతగ్గ ప్రోత్సాహం కరవయింది. రైతులకు సకాలంలో విత్తనాలు సరఫరా చేయడంలోనూ ఉద్యానశాఖ ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు. రాజధాని అమరావతి పాంతంలోని 2500 హెక్టార్లలో దొండ, బెండ, కాకర, కాలీఫ్లవర్‌, ఉల్లి వంటి పంటలు సాగు చేసేవారు. రాజధాని నిర్మాణంతో ఇప్పుడు అక్కడ ఆగిపోయిన సాగును ఇతర ప్రాంతాల్లో జరిగేలా చూడాలని ప్రభుత్వం ఉద్యానశాఖను ఆదేశించినా, ఇంతవరకు తగిన కార్యాచరణ రూపొందించలేదు.

ఆరుగాలం కష్టించే రైతుకు అవస్థలే మిగులుతున్నాయి. విజయనగరం జిల్లా రామభద్రపురం ప్రాంతంలో వంకాయల్ని పండించే రైతుల దుస్థితే ఇందుకు ఉదాహరణ. పంట చేతికొచ్చేసరికి ధర తగ్గిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వ్యాపారులు కిలో వంకాయలను టోకున రూ.1.50లకు కొనుగోలు చేస్తున్నారు. చిల్లర ధర కిలోకు రూ.3 ఉంది. ఎకరం సాగుకు రూ.50 వేలు ఖర్చు కాగా, రూ.10 వేలు ఆదాయం కూడా రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం శుభకార్యాలు లేనందున గిరాకీ తగ్గిందని, అందుకే ధరలు పడిపోయాయని వ్యాపారులు అంటున్నారు.

Check Also

గొప్ప పనులు చేస్తున్నారు

రాజన్న సిరిసిల్లా, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని గొప్ప పనులు ...

Comment on the article