Breaking News

ఇదేమి న్యాయం?

గుల్బర్గ్‌ సొసైటీ నరమేథం కేసులో నిందితులకు అహ్మదాబాద్‌ ప్రత్యేక కోర్టు ఖరారు చేసిన శిక్షలు బాధితులకు అన్యాయంగా అనిపించడం సమంజసం. పద్నాలుగేళ్ళ క్రితం జరిగిన ఈ ఊచకోతలో కాంగ్రెస్‌ మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ సహా 69 మంది దారుణ మారణకాండకు బలయ్యారు. పదిహేను రోజుల క్రితం న్యాయస్థానం తీర్పు ప్రకటిస్తూ, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) నిందితులుగా పేర్కొన్న 66 మందిలో 24 మందిని మాత్రమే దోషులుగా నిర్థారించి, బీజేపీ నాయకుడు బిపిన పటేల్‌ సహా 36 మందిని నిర్దోషులుగా వదిలిపెట్టేసినప్పుడే బాధితులు తీవ్రంగా మనస్తాపం చెందారు. శిక్షల ఖరారును రెండుసార్లు వాయిదావేసుకుంటూ వచ్చిన న్యాయస్థానం చివరకు వారిలో సగంమందికి ఏడేళ్ళనూ, ఒకరికి పదేళ్ళనూ, మిగతా పదకొండుమందికి యవజ్జీవాన్నీ నిర్ణయించడం బాధితుల గాయాన్ని మరింత రేపింది. ప్రజాస్వామికవాదులను నిశ్చేష్టులను చేసింది.
                  ‘నాలుగువందలమంది గేట్లు కూలదోసుకొచ్చి, పార్లమెంటు సభ్యుడిగా ఉన్న నా భర్తను నడివీధిలోకి ఈడ్చి, కత్తులతో, గొడ్డళ్ళతో నరికి సజీవంగా తగులబెట్టిన అమానుషత్వానికి ఈ శిక్ష తగినదేనా? అని ప్రశ్నిస్తున్నారు ఎహ్సాన జాఫ్రీ భార్య జాకియా. నాగరిక సమాజంలో జరిగిన అత్యంత అనాగరిక చర్యగా ఈ ఘటనను అభివర్ణిస్తూనే, హత్యానేరం ఉన్న పదకొండుమందికీ న్యాయస్థానం యావజ్జీవంతో సరిపుచ్చడం బాధితులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారు కోరుతున్నది ప్రతీకారం కాదు. జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతున్న సందేశం సమాజానికి బలంగా పోవాలన్నదే. ఉరిశిక్షను మానవహక్కుల పరంగా ఎవరూ సమర్థించకపోయినా, ఉరిశిక్షకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉద్యమాలు జరుగుతున్నా, కొందరి భావోద్వేగాలను, మనోభావాలను సంతృప్తి పరచే పరోక్ష లక్ష్యంతో అది అమలవుతూనే ఉన్నది. ఇటువంటి ఊచకోత ఘటనల్లో, అందునా ప్రత్యేకించి ఒక మతానికి చెందినవారిపై ఉద్దేశపూర్వకంగా జరిగిన నేపథ్యంలో, దర్యాప్తు దశనుంచి శిక్షల ఖరారు వరకూ తమకు పూర్తి అన్యాయమే జరిగిందన్న భావన సమాజానికి మేలు చేయదు. ఒకరినో ఇద్దరినో హత్యచేసినందుకు కటువుగా స్పందించే వ్యవస్థలు ఊచకోతల నిందితులను యధేచ్ఛగా వదిలేస్తుండటం తప్పుడు సందేశాన్ని ఇస్తుంది. ఇప్పుడు తక్కువ శిక్షలు పడినవారికి యావజ్జీవం విధించాలంటూ అప్పీలు చేస్తామని తీస్తా సెతల్వాడ్‌ వంటివారు అంటున్నారు. ప్రారంభంలోనే శిక్షలు ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించినా అవి పలుచబడతాయే తప్ప బలపడవు.
                  ఈ తీర్పు ద్వారా తేలినదొక్కటే. 69 మందిని కేవలం 11 మంది హత్యచేశారని. దాడికి పాల్పడింది 400 మంది అయితే, వారిలో నిందితులుగా నిర్ణయించింది ఆరోవంతు, దోషులుగా నిర్థారించింది ఇరవయ్యోవంతు. హత్యానేరంపై శిక్షలు అనుభవిస్తున్నది దాదాపు మూడుశాతం. రక్తం అంటిన చేతులు కడుక్కొని ఎంతమంది పోగలిగారో ఈ వాస్తవం తెలియచెబుతున్నది. ఈ బీభత్సకాండలో కుట్రలూ, నేరపూరిత దురుద్దేశాలు న్యాయమూర్తికి కనిపించనప్పుడే న్యాయం బలహీనపడింది. ఇది ప్రణాళికాబద్ధంగా జరిగిన మారణకాండ కాదనీ, దాడివెనుక దురుద్దేశాలే లేవని కొట్టిపారేయడం తమవారిని కళ్ళెదుట కోల్పోయిన కుటుంబీకులను మరింత క్షోభకు గురిచేసే నిర్థారణ. ముస్లిం జనాభా అధికంగా ఉన్న ఈ సొసైటీ కాంప్లెక్సుకు రక్షణ కల్పించాల్సిందిగా రాజకీయనాయకులను, పోలీసు ఉన్నతాధికారులను పలుమార్లు ముందే అభ్యర్థించినా, దుండగులు కాంప్లెక్సును చుట్టుముట్టిన సందర్భంలోనూ ఫోన్లు చేసి వేడుకున్నా వీసమెత్తు రక్షణ దక్కనివ్వకుండా వ్యవస్థలన్నీ కక్షగట్టి ఈ మారణకాండను యధేచ్ఛగా సాగనిచ్చినమాట వాస్తవం.
                  తన ప్రాణాలను పణంగా పెడితే దుండగులు మిగతావారిని వదిలిపెడతారన్న భ్రమతో జాఫ్రీ స్వచ్ఛందంగా చిక్కి బలైపోయారు. హత్యలు, అత్యాచారాలు, గృహదహనాలతో గంటలపాటు సాగిన ఈ నరమేథం పూర్తిగా ముగిసేవరకూ పోలీసులు దరిదాపుల్లో లేకపోవడం వాస్తవం. ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యం, ఉన్నతస్థాయి కుట్ర, ప్రణాళికాబద్ధమైన దాడి ఉన్నందునే, రాష్ట్రస్థాయి దర్యాప్తులన్నీ అన్యాయం చేస్తున్నాయన్న ఆక్రందనల నేపథ్యంలో, సుప్రీంకోర్టు రంగంలోకి దిగి తొమ్మిది ఊచకోత కేసులనూ ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించింది. కానీ, సిట్‌ కూడా పెద్దలకు మసి అంటకూడదన్న లక్ష్యంతోనే సాగిందన్నది బాధితుల బాధ. గుజరాత ఊచకోతల్లో గుల్బర్గ్‌ ఘటన హతుల సంఖ్య రీత్యా రెండవ అతిపెద్ద మారణకాండ. దశాబ్దంన్నర జాప్యంతో పాటు, మిగతా కేసులతో పోల్చినా నిందితు లుగా నిర్థారించిన వారి సంఖ్య తక్కువగానే ఉంటూ, చివరకు శిక్షల ఖరారులో కూడా బాధితులకు అన్యాయమే జరగడం న్యాయవ్యవస్థ ప్రతిష్టను పెంచదు.

Check Also

ఉచిత బియ్యం పంపిణీ చేసిన ఎంపిటిసి రాణి

నందిపేట్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నుంచి రెండవ విడత ఉచిత బియ్యం పంపిణీ ...

Comment on the article