Breaking News

యోగా డేకు భారీ ఏర్పాట్లు

-దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు
-చండీగఢ్‌లో పాల్గొననున్నప్రధాని మోదీ
-40 ముస్లిం దేశాలు సహా 190 దేశాల్లో నిర్వహించనున్న యోగా డే

న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తున్నది. ఆ రోజు దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ప్రత్యేక యోగా కార్యక్రమాల్లో 57మంది కేంద్రమంత్రులు పాల్గొననున్నారు. చండీగఢ్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకానున్నారు. జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తిస్తూ ఐక్యరాజ్యసమితి 2014 డిసెంబర్‌లో ప్రకటన జారీ చేసింది. యోగా దినోత్సవానికి 190కిపైగా దేశాలు మద్దతు తెలుపగా.. అందులో 40 ముస్లిం దేశాలు ఉండటం విశేషం. దేశవ్యాప్తంగా యోగా దినోత్స వం సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాల బాధ్యతలను ఆయా కేంద్ర మంత్రులకు ప్రభుత్వం అప్పగించింది. రాజ్‌నాథ్‌సింగ్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, నిర్మలా సీతారామన్ మేనకాగాంధీతోపాటు 10మంది మంత్రులు వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అరుణ్‌జైట్లీ ముంబైలో, మనోహర్ పారికర్ కాన్పూర్, మాణిక్‌ప్రభు విజయవాడ, వెంకయ్యనాయుడు ఢిల్లీ, పియూష్‌గోయల్ అహ్మదాబాద్‌లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటా రు. రాజస్థాన్‌లోని ఇండో-పాక్ సరిహద్దు ప్రాంతమైన జోధ్‌పూర్‌లో 3వేల మంది బీఎస్‌ఎఫ్ అధికారులు, జవాన్లకు బాబా రామ్‌దేవ్ యోగా పాఠాలు చెప్పనున్నారు. కాగా, బ్రిటన్, ఆస్ట్రేలియాలో యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొనేందుకు అక్కడి ప్రభుత్వాలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. లండన్, కాన్‌బెర్రా, మెల్‌బోర్న్ సహా ఆ దేశాల్లోని అన్ని ప్రధాన పట్టణాల్లో కార్యక్రమాలు జరుగుతుండటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇంత స్పందన వస్తుందనుకోలేదు..మోదీ

అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవాలని తాను ఇచ్చిన పిలుపునకు ప్రపంచవ్యాప్తంగా ఇంతటి స్పందన వస్తుందని తాను ఊహించలేదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ దేశప్రజలకు వీడియో సందేశం ఇచ్చారు. 2014 సెప్టెంబర్‌లో తాను ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ యోగా ప్రాశస్థ్యాన్ని వివరిస్తూ.. ఈ మేరకు పిలుపునిచ్చినట్లు ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ సందర్భంగా అన్నిదేశాల నుంచి వచ్చిన స్పందనను తాను ఎంతమాత్రం ఊహించలేదని అన్నారు. శారీరక అభ్యాసాలకంటే యోగా ఉన్నతమైనదని.. శరీరాన్ని, మనస్సును ఏకకాలంలో నియంత్రణలోకి తీసుకువస్తుందని పేర్కొన్నారు.

Check Also

హైదరాబాద్‌ మినహా కరోనా కేసుల్లో నిజామాబాద్‌ జిల్లా తెలంగాణలో నెంబర్‌ వన్‌…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ప్రత్యేకం : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం అందరికీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *