Breaking News

ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ ఉద్యమ గళం గూడ అంజయ్య అస్తమయం

-కొంతకాలంగా అనారోగ్యం
-కుమార్తె ఇంట్లో తుదిశ్వాస
-ఆదిలాబాద్ జిల్లా లింగాపూర్‌లో నేటి మధ్యాహ్నం అంత్యక్రియలు
-సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
-తెలంగాణ ఉద్యమంలో అస్ర్తాలైన అంజన్న పాటలు
-దుమ్ము రేపిన అవ్వోనివా నువ్వు అయ్యోనివా.. పాట
-ప్రజాప్రతినిధులు, కవులు, కళాకారుల సంతాపం

హైదరాబాద్: పేదల కష్టాలను పేదల భాషలోనే వినిపించిన అద్భుత కలం మూగబోయింది. తన చుట్టూ ఉన్న సమాజంలోని దుర్నీతులే వస్తువుగా అనేక చైతన్యభరిత పాటలు రాసి.. ప్రజల కవిగా వెలుగొందిన అపూర్వ కలం.. కాలంచేసింది. తెలంగాణ ఉద్యమానికి ప్రాణవాయువులాంటి సాహితీస్వరాలందించిన ప్రముఖ పాటల రచయిత, గాయకుడు గూడ అంజయ్య (61) ఇక లేరు. తీవ్ర అనారోగ్యంతో మంగళవారం సాయంత్రం 4.48 గంటలకు హయత్‌నగర్ సమీపంలోని రాగన్నగూడెంలోని తన కుమార్తె ఇంట్లో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వృత్తిరీత్యా ఆయన హైదరాబాద్‌లో ఫార్మసిస్టుగా పనిచేశారు. తెలంగాణ సాంస్కృతిక సంఘం నాయకునిగా ఉన్నారు. అంజయ్య స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా లింగాపురం. ఆయన చివరి కోరిక మేరకు అంత్యక్రియలను లింగాపురంలో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ఉద్యమంతోపాటు సామాజిక అంశాలపై అనేక గేయాలు రాసిన అంజయ్య సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. గూడ అంజయ్య మరుపురాని మనిషని శాసనమండలి చైర్మన్ కనకమామిడి స్వామిగౌడ్ నివాళులర్పించారు. ఆయన పాటల రచయిత మాత్రమే కాదు, మృధుస్వభావి, ఆయన భావాలు చాలా ఉన్నతమైనవీ, ఉదాత్తమైనవి.. అని ఆయన పేర్కొన్నారు. గత నెల 25వ తేదీన తీవ్ర అస్వస్థతకు గురైన అంజయ్యను సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, గోరటి వెంకన్నవంటి మిత్రులు నిమ్స్‌లో చేర్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఆరోగ్యమంత్రి లకా్ష్మరెడ్డి ఆయన ఆరోగ్యంపట్ల చాలా శ్రద్ధతీసుకున్నారు. రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో మంత్రి పీఎస్ శ్రీధర్‌రావు దేశ్‌పాండే ఎప్పటికప్పుడు సమీక్షించేవారు. నెలపాటు నిమ్స్‌లో చికిత్స అందించినా అంజయ్య శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో ఆయనను కుమార్తె నివాసముంటున్న రాగన్నగూడేనికి తీసుకొచ్చారు. అక్కడే ఆయన మంగళవారం సాయంత్రం 4.48 గంటలకు తుదిశ్వాస విడిచారు. అంజయ్య మరణ వార్త తెలియగానే పలువురు నేతలు, ప్రజాసంఘాల నాయకులు, కవులు, కళాకారులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. నిత్యం తెలంగాణను శ్వాసించిన అంజయ్య మృతదేహాన్ని హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌కు తీసుకొచ్చి కొద్ది సేపు ఉంచారు. అక్కడ ప్రజాగాయకుడు గద్దర్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, బుద్ధవనం స్పెషలాఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య, పాశం యాదగిరి, గోరటి వెంకన్న, సీపీఎంఎల్ నాయకుడు గోవర్ధన్, టీఎన్జీవో నాయకులు కారం రవీందర్‌రెడ్డి, గుండవరపు దేవీప్రసాద్, రచయిత జయధీర్ తిరుమల్‌రావు, కవి జూలూరు గౌరీశంకర్ తదితరులు ఆయన భౌతికకాయాన్ని దర్శించి నివాళులర్పించారు. అంజయ్య మృతి వార్త తెలియగానే సాహితీ ప్రపంచం విషాదసాగరమయ్యింది.

పల్లెల్ని కదిపిన పాటగాడు

-తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన అంజన్న పాట
-అనేక విప్లవ, ప్రగతిశీల సినిమాలకు సాహితీసేవ

ఆయన పాటలు ఆయుధాలు.. ఆ పాటల్లో పదాలు దూసుకుపోయే తూటాలు! సామాజిక ఉద్యమాలకు, ప్రగతిశీల శక్తులకు తిరుగులేని అస్ర్తాలు! ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన కిరణాలను దర్శించినా.. ఊరు మనదిరా.. ఈ వాడ మనదిరా అంటూ ఊరుమ్మడి బతుకుల్ని ఏకంచేసి.. దొరపై తిరుగుబాటుకు పురికొల్పినా.. భద్రం కొడుకో.. అంటూ రిక్షా కార్మికుడిని అప్రమత్తం చేసినా.. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. అంటూ ప్రభుత్వవైద్యం గుల్లతనాన్ని నిలువునా కడిగేసినా.. అవ్వోడివా నువ్వు అయ్యోడివా.. తెలంగాణోనికి తోటి పాలోడివా? అని నిగ్గదీసినా..తెలంగాణ గట్టు మీద సందమామయ్యలను అబ్బురంగా ఆస్వాదించినా.. ప్రతి పల్లవిలో.. ప్రతి చరణంలో అచ్చు తెలంగాణ యాస! ఆసాంతం కష్టజీవి గోస.. అందులోనే తిరుగుబాటు కాంక్ష! తెలంగాణ సాకారం కావాన్న బలమైన ఆకాంక్ష! అదే గూడ అంజయ్య పాట! ఏ రోగానికి వైద్యుడు ఏ మందు రాస్తాడో వృత్తిరీత్యా సంపాదించిన అనుభవంతో అక్షరాలనే ఔషధాలుగా చేసి.. జనం దరికి చేర్చిన సామాజిక వైద్యుడు!

40 ఏండ్లసాహితీ జీవితంలో కవిగా, రచయితగా అంజయ్య కలకాలం నిలిచిపోయే పాటలు, కథలు రాశారు. అనేక విప్లవ, అభ్యదయ, ప్రగతిశీల సినిమాలకు ఆయన రాసిన పాటలు ఇప్పటికీ ప్రాంతాలకతీతంగా తెలుగు ప్రజల గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఊరు మనది రా.. ఈ వాడ మనదిరా.. అనే పాట పదహారు భాషల్లోకి తర్జుమా అవ్వడం ఆ పాటకున్న గొప్పతనాన్ని చెప్పకనే చెప్తున్నది. 1980లలో హైదరాబాద్‌లో జరిగిన ఆసియా-ఆఫ్రికన్ దేశాల రచయితల సదస్సులో ఈ పాటను ఆ సమావేశానికి హాజరైన ప్రతినిధులు అప్పటికప్పుడే వారి భాషలలోకి అనువాదం చేసుకొని పాడుకున్నారు.ఊరిడిసి నే పోదినా, చెరువులో దూకనా, చెరువయ్యిపోదునా, అంటూ తెలంగాణ ప్రజల ఇబ్బందులను పాటలను చేశారు. నల్లగొండను సందర్శించినప్పుడు ఆయన మోట రైతులదగ్గరనే తిని నిద్రచేసేవారు. ఆ సందర్భంలోనే అసిలేటికార్తెలో ముసలెడ్లు కట్టుకొని మోకాటి బురదల్లో దుక్కులే దున్నితే గరిశెలెవరివి నిండెరో.. అంటూ ఆశువుగా పాట రాశారు. గూడ ఆంజయ్య రాసిన చాలా పాటలు అన్నీ భారతీయ భాషలలోకి అనువాదాలయ్యాయి. సినిమాల రూపంలో అయితేనేమి.. స్వరాష్ట్ర సాధన పోరుకోసమైతేనేమి.. తెలంగాణ ఉద్యమానికి ఆయన అందించిన సాహితీ అస్ర్తాలు అనన్యమైనవి. తెలంగాణ ఉద్యమానికి సాహిత్యపరంగా ఆయనరాసిన పాటలు ఆక్సిజన్‌గా మారి ప్రాణం పోశాయంటే అతిశయోక్తికాదు. ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన తెగ గోండుల కోసం వారి భాష నేర్చుకుని వారి భాషలోనే పాటలు పాడిన సృజనశీలి అంజయ్య. నక్సల్బరీ ఉద్యమానికి ఆయువుపట్టువంటి పాటలను రచించారు.

సినిమా పాటల కోసం హైదరాబాద్‌కు
ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో 1955, నవంబర్ ఒకటిన గూడ లస్మయ్య, లస్మమ్మల ఐదో సంతానంగా అంజయ్య జన్మించారు. లక్షెట్టిపేటలో ఇంటర్ పూర్తి చేసిన అంజయ్య.. హైదరాబాద్‌లో బీ ఫార్మసీ చదివి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో ఫార్మసిస్టుగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. ఆదిలాబాద్ పట్టణంలో కూడా పనిచేశారు. సినిమాపాటల రచనలో భాగంగా హైదరాబాద్‌కు తరలివెళ్లారు. అంజయ్యకు భార్య హేమనళిని, నలుగురు కూతుళ్లు. వీరిలో నవిత మృతిచెందింది. శ్రీలత, కవిత, మమతలతోపాటు తల్లి లస్మవ్వ ఉన్నారు. అంజయ్యకు ఐదుగురు సోదరులు, ఒక సోదరి. అందులో ఒక సోదరి, ఒక సోదరుడు ఉన్నారు. మిగతావారంతా చనిపోయారు. ఆదిలాబాద్ జిల్లాతో గూడ అంజయ్యకు వీడదీయలేని అనుబంధం ఉంది. వైద్యారోగ్య శాఖలో ఫార్మసిస్టుగా పని చేస్తునే ఉద్యమ గీతాలను ఎన్నో రచించారు. జిల్లాలోని ఉట్నూరు, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల ప్రాంతాల్లో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత అంజయ్య కలం కొత్త పుంతలు తొక్కింది. ఆయన ప్రధాన రచనావ్యాసాంగం, పాటల పల్లవులు అన్నీ హైదరాబాద్ రోడ్లమీదనే వెల్లువెత్తాయి. 2012లో లలితకళాతోరణంలో జరిగిన ధూంధాం దశాబ్ది ఉత్సవాలలో పాల్గొని తన పాటలతో తెలంగాణలో విప్లవకెరటాలను సృష్టించారు.సాహిత్యకళాక్షేత్రంలోని మేధావులందరూ నిర్వచించిన దందహ్యమాన దశాబ్దం 1970-80ల మధ్యకాలంలో పాటలను రణన్నినాదాలుగా మోగించిన విప్లవకవి గూడ అంజయ్య. మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రొఫెసర్ కేశవరావ్ జాదవ్, జయశంకర్‌లతో కలిసి నడిచారు. కాళోజీ, సదాశివ, రామశాస్త్రివంటి మేధావులతో చర్చలు జరిపారు. ప్రజల విప్లవ ఆకాంక్షలను కవులు, రచయితలు తమ రచనల ద్వారా ముందుగా ప్రకటిస్తారని, అ తర్వాతనే ప్రజా ఉద్యమాలు వెల్లువెత్తుతాయన్న చారిత్రక సత్యానికి అంజయ్య మొక్కవోని నిదర్శనం. కవులను, కళాకారులను గౌరవించే పాలకులే ప్రజాస్వామిక పాలకులని తుదిశ్వాస వరకు తన విశ్వాసాన్ని ప్రకటించిన కలంయోధుడు ఆయన. ఆరోగ్యశాఖలో పని చేసిన ఆయనకు ఆదిలాబాద్ జిల్లాలోని ఆరోగ్యశాఖ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలతో మంచి సంబంధాలుండేవి. అంజయ్య మృతి నేపథ్యంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని జిల్లా వాసులు నెమరువేసుకున్నారు. అంజయ్య మృతి పట్ల తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అజయ్, ప్రముఖ కవులు, సాహితివేత్తలు డాక్టర్ దామెర రాములు, అప్పాల చక్రధారి, తుమ్మల దేవరావు, అంబటి నారాయణ, శివప్రసాద్, వైద్యారోగ్యశాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రాజేశ్వర్ పాండే తమ సంతాపాన్ని ప్రకటించారు.

ఉద్యమానికి ఊపిరి.. అంజన్న పాట
-డిప్యూటీ సీఎం కడియం సహా పలువురు మంత్రుల నివాళి

జీవితాన్ని తెలంగాణ సమాజానికి అంకితం చేసిన వ్యక్తి అంజయ్య. ఉద్యమానికి ఊతమిచ్చే పాటలు రాసిన అంజయ్య మృతి రాష్ర్టానికి తీరనిలోటు.
-కడియం శ్రీహరి, ఉప ముఖ్యమంత్రి

అంజన్న మరణం తెలంగాణకు తీరని లోటు. పుడితే ఒక్కడు.. సస్తే రెండు రాజనవో.. రాజన పాట తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదింది. అంజన్న కుటుంబానికి సర్కార్ అన్ని విధాలుగా అండగా ఉంటుంది.
– టీ హరీశ్‌రావు, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి
డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

అంజయ్య కలకాలం నిలిచిపోయే పాటలెన్నో రాశారు. ఆయన పాటలు తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదాయి.
– ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర దేవాదాయ మంత్రి

నిరాడంబర జీవితాన్ని గడిపిన ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నా.
– జోగురామన్న, బీసీ సంక్షేమశాఖ మంత్రి

అనేక సామాజిక అంశాలపై అంజయ్య పాటలు రాశారు. ఆయన సేవలు చిరస్మరణీయం.
– అజ్మీరా చందూలాల్, రాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి

సామాజిక చైతన్యం దిశగా రచనలు చేసిన గూడ అంజయ్య మృతి బాధాకరం. ఆయన పాటలు ఉద్యమంలో కీలక పాత్ర పోషించాయి.
– జీ జగదీశ్‌రెడ్డి, రాష్ట్ర విద్యుత్, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి

ఎమర్జెన్సీనుంచి తెలంగాణ ఉద్యమంవరకు అనేక ఉద్యమాలకు సంఘీభావంగా అంజయ్య రాసిన పాటలు ప్రజల నోళ్లలో నానాయి. ప్రజల సమస్యలను ప్రజల భాషలోనే పాటలుగా మలచడంలో ఆయనకెవరూ సాటిలేరు.
-కల్వకుంట్ల కవిత, నిజామాబాద్ ఎంపీ

ఉద్యమ నేపథ్యంలో అంజయ్య రాసిన పాటలు, గేయాలు ఎంతో ఉత్తేజాన్ని కలిగించాయి. సామాజిక చైతన్యం కోసం తన జీవితకాలమంతా కృషిచేశారు.
– కే జానారెడ్డి, కాంగ్రెస్ నేత

తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయింది.
– ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

కవి, రచయిత గూడ అంజయ్య మృతి రాష్ర్టానికి తీరనిలోటు.
– కే లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

రచయిత గూడ అంజయ్య ప్రజా ఉద్యమాలకు ప్రేరణ అందించారు.
-తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్రకార్యదర్శి

తన ప్రకాశవంతమైన భవిష్యత్తును తెలంగాణ కోసం అంకితం చేశా
– రాపోలు ఆనంద భాస్కర్, ఎంపీ

తన పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన గొప్ప రచయిత.
-దేవేందర్‌గౌడ్, రాజ్యసభ సభ్యుడు
కరీంనగర్ జిల్లాను కార్యక్షేత్రంగా ఎన్నుకొని ఆయన చాలా సాహిత్య కృషి చేశారు. – సీపీఐ ఎంఎల్ నాయకులు గోవర్ధన్

నమ్మిన ఆశయం కోసం నిలబడ్డ మనిషి
-గూడ అంజయ్య మృతికి సాహితీలోకం నివాళి
(నమస్తే తెలంగాణ నెట్‌వర్క్):సమాజ మార్పుకోసం కళా, సాంస్కృతిక రంగాలను సాధనంగా ఎంచుకున్న తొలితరం కళాకారుడు అంజన్న. భద్రం కొడుకో పాటను నా సినిమాలో వాడుకున్నాం. చివరి వరకూ నమ్ముకున్న ఆశయం కోసం నిలబడ్డాడు. తెలంగాణ సమాజానికి, ప్రజాకళల సంప్రదాయానికి అంజన్న విలువైన మాణిక్యం.
– బీ నరసింగరావు, ప్రముఖ సినీ దర్శకులు

ఆయన ఊరు ఉన్నంత వరకు ఆయన పాట నిలిచి ఉంటుంది. 1969-70ల్లో ఇద్దరం ఉద్యమాల్లోకి వచ్చాం. ఎమర్జెన్సీలో జైలులో కలిసి జైలు శిక్ష అనుభవించినం. అనేక ఉద్యమాల్లో కలిసి పనిచేసినం. ఉద్యమాల్లో నిలిచి అనేక కష్టాలు, నష్టాలు, నిర్భందాలను అనుభవించిన కవి ఆయన.
– ప్రజా గాయకుడు గద్దర్

శ్రీశ్రీ కవిత్వాన్ని భూమార్గం పట్టించాలన్నాడు. శ్రీశ్రీ చెప్పినట్లుగా కవిత్వం భూమార్గం పడితే ఎలా ఉంటుందో జనసామాన్యానికి తెలియజేసిన పాట ఊరు మనదిరా.. ఈ వాడ మనదిరా. ఈ పాట కవిత్వంలో ఒక మలుపు. ఈ పాట అంజన్నను గొప్ప వాగ్గేయకారుడిగా నిలిపింది. ఆయన పాటల్లో జీవితం ఉంటుంది.
– వరవరరావు, విరసం నేత

పాటల ద్వారా తెలంగాణ సమాజానికి కొత్త చైతన్యాన్ని అందించిండు. ఊరులోని ఆధిపత్యాన్ని, వాడలోని దైన్యాన్ని అర్థం చేసుకుని రెంటినీ నిర్మూలించేందుకు రచనలు చేసిండు. ఏ పాట రాసినా అస్త్రశస్ర్తాలకంటే శక్తిమంతమైనవి.అతని పాటలు మౌఖిక రూపంలో అంజయ్య పేరు లేకుండా ప్రజల పాటలుగా చెలామణీ అయ్యాయి. అంతటి ప్రభావవంతమైన పాటలు అంజన్నవి.
– జయధీర్ తిరుమల రావు, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు

ఊరు మనదిరా.. వాడ మనదిరా.. అంటూ పేదల పాట రాసిన తెలంగాణ ఉద్యమ ప్రజా గాయకుడు గూడ అంజయ్య మృతి తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి తీరని లోటు. తెలంగాణ ఉద్యమంలో రాజిగా…ఒరే…రాజిగా వంటి పాటలతో సమాజాన్ని జాగృతం చేశారు.
– అల్లం నారాయణ, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్

అంజన్న మరణం కోట్లాది ప్రజలకు తీరని దుఃఖం. రసమయి ఆవిర్భావ సభలో ఆయనతోనే జ్యోతి వెలిగించి, ఆయన పాట రాజిర ఒరె రాజిగ ధూం ధాం ప్రారంభించిన. ప్రజల కష్టాలను ప్రజల భాషలోనే చెప్పిన కవి అంజన్న.
– రసమయి బాలకిషన్, సాంస్కృతిక సారథి చైర్మన్

అణగారిన వర్గాల ప్రజల బాధల్ని ఆలపించిన కవి గూడ అంజయ్య. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాటలు రాస్తూ ఉద్యమాలకు ఉత్తేజాన్నిచ్చిండు. ఆయన సినిమా పాటలు చాలా ప్రత్యేకమైన రచనా శిల్పంతో ఉండేవి. సామాన్యుల భాషకు దగ్గరగా ఉంటాయి. విప్లవ ఉద్యమాల్లో, అస్తిత్వ ఉద్యమాల్లో ఆయన పాట మరువలేనిది.
– ఎన్ శంకర్, సినీ దర్శకుడు

ప్రజల జీవితాల్ని కాచివడపోసిన వ్యక్తి అంజన్న. పాటకు, పాటలపై సానుభూతి ఉన్న ప్రజలపట్ల సానుభూతితో ఉన్న కవి ఆయన. ఆయన కార్మికుడు, కష్టజీవి కాబట్టే పేదల జీవితాల్ని, కష్టాల్ని కవిత్వం ద్వారా జనసామాన్యాన్ని చేరువ చేసిండు. ఆయన నడిచి వచ్చిన అట్టడుగు జీవితం ఆయన కవిత్వంలో కనిపిస్తుంది. ఆయన భాషపై బాగా పట్టున్న వ్యక్తి.
– భూపాల్, నటుడు

ఊరు మనదిరా పాట దేశాన్ని ఊపింది. ఆయన పాటలు ప్రజల్లోకి తొందరగా వెళ్లే సాధనంగా ఉపయోగపడింది.
– మా భూమి సంధ్య, విప్లవ గాయని

తను పనిచేస్తున్న ప్రభుత్వ దవాఖానలు ఎంత దయనీయంగా ఉన్నాయో జనం కళ్లకు కట్టిన నేను రాను బిడ్డో మన ఊరి దవాఖానకి పాట రాసిండు. కవిగా సామాజిక బాధ్యతతో రచనలు చేశారు.
– డాక్టర్ ఆకుల సంజయ్ రెడ్డి, ఫార్మా సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు

పాటను, ప్రజలను చైతన్యవంతం చేసే ఒక వాహిక అనే సత్యాన్ని ఆయన చాటి చెప్పారు. హైదరాబాద్‌లో జరిగిన ఆసియా- ఆఫ్రికన్ రచయితల సదస్సులో ఆయన పాటలకు భాష తెలియని రచయితలందరూ హర్షధ్వానాలతో బ్రహ్మరథం పట్టారు.
– సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి

తెలంగాణ మలిదశ ఉద్యమానికి అంజయ్య పాటలు కొత్తరక్తాన్ని ఇచ్చాయి.
– రచయిత నమ్ము

అంజయ్య మృతి సాహిత్యలోకానికి తీరని లోటు. ఆయన రాసిన అనేక పాటల్లోనూ తెలంగాణ వాదం గట్టిగా వినిపించేది. ఆయన పాటలు ఉద్యమాన్ని ఉధృతం చేయడమే కాకుండా రాష్ట్ర సాధన వైపు మళ్లేలా చేశాయి.
– డాక్టర్ విజయభాస్కర్, తెలంగాణ ఉపాధ్యాయ పండిత్ పరిషత్ నేత

అంజయ్య మృతి సాహితీ లోకానికి తీరని లోటు
– మట్టి మనుషులు పాండురంగారావు

గ్రామీణుడు గర్జిస్తే ఎలా ఉంటుందో గూడ అంజయ్య పాటల్లో చూపారు. మంచి కవిని కోల్పోవడం ఎంతో బాధాకరం
– దేశపతి శ్రీనివాస్, సీఎం ఓఎస్‌డీ

తెలంగాణ ప్రజల గోసను ఎప్పటికప్పుడు పాటలుగా అక్షరబద్ధం చేసిన వ్యక్తి
– నందిని సిధారెడ్డి, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు

వెనుకబడిన జిల్లా నుంచి వచ్చిన అంజయ్య ప్రగతిశీల శక్తులకు తన రచనలతో గొంతుక ఇచ్చారు. ఆయన రచించిన పొలిమెర నవలకు ఉత్తమ నవలా పురస్కారంతో తెలుగువర్సిటీ సత్కరించుకుంది.
– ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, వీసీ పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ

 

Check Also

సిఎం కెసిఆర్ కీల‌క నిర్ణయం తీసుకున్నారు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా అనూహ్యంగా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజల‌కు వైద్యాన్ని ...

Comment on the article