Breaking News

గగన వీధిలో ఇస్రో జయహో..

శ్రీహరికోట (ఏపీ): చంద్రయాన్, మంగళ్‌యాన్, స్వదేశీ జీపీఎస్ లాంటి అద్భుత ప్రయోగాలతో ప్రపంచ అంతరిక్ష పరిశోధనా రంగంలో ఇప్పటికే భారత్ ఘనకీర్తిని సాధించింది. తాజాగా ఒకే రాకెట్‌తో 20 శాటిలైట్ల ప్రయోగాన్ని విజయవంతం చేసి మరో ఘనతను సొంతం చేసుకొన్నది. ఇందుకోసం అత్యంత విశ్వసనీయమైన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్-సీ34ను (పీఎస్‌ఎల్వీ-34) నమ్ముకొన్నది. బుధవారం ఉదయం 9.26 గంటల ప్రాంతంలో నెల్లూరుకు సమీపాన ఉన్న భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో)లోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ-సీ34 ప్రయోగం విజయవంతమైంది.

-ఇస్రో ఖాతాలో సరికొత్త రికార్డు అగ్రదేశాల సరసన భారత్
-ఒకే రాకెట్‌తో 20 శాటిలైట్ల ప్రయోగం సక్సెస్
-శ్రీహరికోట ఇస్రో కేంద్రం నుంచి మూడు స్వదేశీ, 17 విదేశీ శాటిలైట్ల ప్రయోగం
-కేవలం 26 నిమిషాల్లోనే ముగిసిన ప్రక్రియ
-రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ, గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ హర్షం

ప్రధాన పేలోడ్ కార్టోశాట్-2 సిరీస్‌తోపాటు మొత్తం 20 శాటిలైట్లను మోసుకెళ్లిన అంతరిక్ష వాహక నౌక కేవలం 26 నిమిషాల తర్వాత వాటిని పోలార్ సన్ సింక్రోనస్ ఆర్బిట్ (ఎస్‌ఎస్‌వో)లో దిగ్విజయంగా ప్రవేశపెట్టింది. దాంతో ఇస్రో శాస్త్రవేత్తల సంబురాలు అంబరాన్ని తాకాయి. తాజా ప్రయోగంలో రెండు భారతీయ విద్యాసంస్థల శాటిలైట్లను, 17 విదేశీ శాటిలైట్లను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో అగ్రదేశాల సరసన చేరింది. 2013లో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా 29 శాటిలైట్లను, 2014లో రష్యా 33 శాటిలైట్లను ప్రయోగించాయి. ప్రస్తుతం 20 శాటిలైట్ల ప్రయోగాన్ని విజయవంతం చేసిన మూడో దేశంగా భారత్ రికార్డుల్లోకి ఎక్కింది. రికార్డుస్థాయి ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ, గవర్నర్ నరసింహన్ తదితరులు అభినందించారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత్ తిరుగులేని శక్తిగా అవతరించింది. ఒకే రాకెట్ సహాయంతో 20 శాటిలైట్లను కేవలం 26 నిమిషాల్లోనే కక్ష్యలోవిజయవంతంగా ప్రవేశపెట్టి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఓ సరికొత్త రికార్డును సొంతం చేసుకొన్నది. ఇస్రో నమ్మిన బంటు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్-సీ34ను (పీఎస్‌ఎల్వీ-34) బుధవారం ఉదయం 9.26 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించింది. ప్రధాన పేలోడ్ కార్టోశాట్-2 సిరీస్‌తోపాటు మొత్తం 20 శాటిలైట్లను మోసుకెళ్లిన అంతరిక్ష వాహక నౌక 26 నిమిషాల తర్వాత వాటిని పోలార్ సన్ సింక్రోనస్ ఆర్బిట్ (ఎస్‌ఎస్‌వో)లో దిగ్విజయంగా ప్రవేశపెట్టింది. దాంతో శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో ఒక్కసారిగా ఉద్వేగభరిత క్షణాలు ఆవిషృతమయ్యాయి. ఈ ప్రయోగంలో పాలుపంచుకొన్న ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బంది పరస్పరం అభినందించుకొన్నారు. శాస్త్రవేత్తల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. అద్భుతమైన కార్యాన్ని పూర్తి చేసింది అని పీఎస్‌ఎల్వీ సేవలను కొనియాడారు. ఈ చారిత్రత్మక ప్రయోగం ద్వారా వేల కోట్ల అంతరిక్ష ప్రయోగ మార్కెట్‌లో భారత్ తనకు తానే సాటి అని నిరూపించుకొన్నది.

భారత్, ఇస్రో విజయ చిహ్నంగా పీఎస్‌ఎల్వీ
ప్రయోగంలో భాగంగా తుది దశలో వివిధ కక్ష్యల్లో శాటిలైట్లను ప్రవేశపెట్టడానికి వాహక నౌక సామర్థ్యాన్ని ఇస్రో పరిశీలించింది. నాలుగు, తుది దశల తర్వాత కక్ష్యలో మరికొన్ని కిలోమీటర్లు ప్రయాణించడానికి వాహక నౌకను రెండుసార్లు పునఃప్రారంభించారు. ఇకే రాకెట్‌ను ఉపయోగించి వివిధ కక్ష్యల్లో శాటిలైట్లను ప్రవేశపెట్టడానికి తదుపరి ప్రయోగానికి ప్రణాళికను రూపొందిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ధారణ ప్రక్రియను ప్రదర్శించామని ఇస్రో తెలిపింది. 320 టన్నుల బరువు, 44.4 మీటర్ల పొడవు ఉన్న పీఎస్‌ఎల్వీ-సీ34కు ఇది 36వ ప్రయోగం. భారత్, ఇస్రోకు విజయ చిహ్నంగా పీఎస్‌ఎల్వీ నిలిచింది.

pslv2
గత రికార్డును తిరుగరాసిన ఇస్రో
2008 ఏప్రిల్ 28న ఇదే పీఎస్‌ఎల్వీ రాకెట్‌ను ఉపయోగించి తొలిసారి 10 శాటిలైట్లను ప్రయోగించి ఇస్రో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఆ తర్వాత ఒకే రాకెట్‌తో 2013లో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా 29 శాటిలైట్లను, 2014లో రష్యా 33 శాటిలైట్లను ప్రయోగించాయి. తాజాగా ఒకేసారి 20 శాటిలైట్లను ప్రయోగించి తాను నెలకొల్పిన గత రికార్డును ఇస్రో తిరుగరాసింది.

కక్ష్యలో చేరిన 20 శాటిలైట్లు ఇవే..
ఇస్రో ప్రయోగించిన 20 శాటిలైట్లలో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ కార్టోశాట్ 2, భారతీయ విద్యాసంస్థలు రూపొందించిన రెండు శాటిలైట్లతోపాటు అమెరికా, కెనడా, ఇండోనేషియా, జర్మనీలకు చెందిన 17 శాటిలైట్లు ఉన్నాయి. ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ అనుబంధ సంస్థ టెర్రా బెల్లా రూపొందించిన స్కైశాట్ జెన్2-1తోపాటు మరో 12 అమెరికా శాటిలైట్లు, కెనడాకు చెందిన జీహెచ్‌జీశాట్-డీ, ఎం3ఎంశాట్, ఇండోనేషియాకు చెందిన లాపాన్-ఏ3, జర్మనీకి చెందిన బిరోస్, చెన్నైకి చెందిన సత్యభామ యూనివర్సిటీ తయారుచేసిన సత్యభామశాట్, పుణె ఇంజినీరింగ్ కాలేజీ రూపొందించిన స్వయంశాటిలైట్లను తాజా ప్రయోగం ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టారు. 20 శాటిలైట్ల మొత్తం బరువు 1288 కేజీలు. సత్యభామ యూనివర్సిటీ రూపొందించిన సత్యభామ శాటిలైట్ ద్వారా గ్రీన్‌హౌస్ వాయువుకు సంబంధించిన డాటాను సేకరిస్తారు. స్వయంశాటిలైట్ ద్వారా హ్యామ్ రేడియో కమ్యూనిటీకి పాయింట్ టు పాయింట్ మెసేజింగ్ సేవలను పుణే కాలేజీ అందించనున్నది.ఇస్రో ఖాతాలో 57 విదేశీ శాటిలైట్లు
ఇస్రో అంతరిక్ష ప్రయోగ చరిత్రలో ఇప్పటివరకు 57 విదేశీ శాటిలైట్లను ప్రయోగించింది. 1999లో విదేశీ శాటిలైట్లను తొలిసారి ప్రయోగించింది. పీఎస్‌ఎల్వీ ద్వారా విదేశీ శాటిలైట్లను విజయవంతంగా ప్రవేశపెడుతూ.. ప్రపంచంలోనే దీటైన సంస్థగా ఇస్రో పేరుప్రఖ్యాతులు సాధించింది. అంతరిక్ష ప్రయోగాల కోసం విదేశీ పరిశోధనా సంస్థలు వసూలు చేసే మొత్తంలో 60 శాతం మాత్రమే తీసుకోవడం ఇస్రో విశ్వసనీయతను పెంచింది.

కార్టోశాట్ శాటిలైట్ ప్రత్యేకతలివీ..
నిరంతరం రిమోట్ సెన్సింగ్ సేవలను అందించడానికి కార్ట్‌శాట్-2 సిరీస్ శాటిలైట్‌ను రూపొందించారు. దీని బరువు 727.5 కేజీలు. హై రెసల్యూషన్ చిత్రాలను తీయడానికి ప్యాంక్రోమాటిక్, మల్టిస్పెక్ట్రల్ కెమెరాలను అమర్చారు. ఈ కెమెరాలతో తీసే చిత్రాలను బహుళ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడానికి వీలుంటుంది. కార్టోగ్రాఫిక్, పట్టణ, గ్రామీణ, తీరప్రాంత భూమి ఉపయోగం, రెగ్యులేషన్, రోడ్ నెట్‌వర్క్ మానిటరింగ్, జల వనరుల పంపిణికి కార్టోశాట్ సేవలను ఉపయోగించుకొంటారు. మ్యాపుల ద్వారా భూ అధ్యయనంతోపాటు ల్యాండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం అప్లికేషన్లకు కూడా ఈ సేవలను వినియోగించుకొంటారు. కార్టోశాట్-2 సిరీస్ శాటిలైట్ కార్టోశాట్-2, 2ఏ, 2బీని పోలి ఉంటుందని ఎస్డీఎస్సీ-షార్ డైరెక్టర్ పీ కునికృష్ణన్ పేర్కొన్నారు. ఎక్కువ బరువును మోసుకెళ్లడానికి సాలిడ్ స్ట్రాప్ మోటర్లపై ఉపయోగించే ప్రత్యేక టెక్నాలజీ ఎక్స్‌ఎల్‌తో పీఎస్‌ఎల్వీ ప్రయాణించడం ఇది 14వ సారి అని తెలిపారు.

హృదయపూర్వక అభినందనలు
రికార్డుస్థాయిలో 20 శాటిలైట్లు తీసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ-సీ34 ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు హృదయపూర్వక అభినందనలు.

రికార్డుల పరంపర కొనసాగుతున్నది
ఒకేసారి అంతరిక్షంలోకి 20 శాటిలైట్లు. కొత్త రికార్డుల పరంపరను ఇస్రో కొనసాగిస్తున్నది. చరిత్రలో మైలురాయిగా నిలిచిన ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు. ప్రజల జీవితాల్లోకి సాంకేతిక, పరిజ్ఞానాన్ని జొప్పించే సామర్థ్యాన్ని మరోసారి రుజువైంది. అంతరిక్ష ఆవిష్కరణలో కొన్నేండ్లుగా సాధించిన భారతీయు శాస్త్రవేత్తల నైపుణ్యం, సామర్థ్యం ఇతర దేశాలకు కూడా ఉపయోగపడుతున్నది. ఇది మన శాస్త్రవేత్తల నైపుణ్యానికి గీటురాయి

ఇస్రోకు కేంద్ర క్యాబినెట్ అభినందన
ఒకేసారి 20 ఉపగ్రహాలను ప్రయోగించిన ఇస్రోను కేంద్ర మంత్రివర్గం అభినందించింది. పీఎస్‌ఎల్వీ-34 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్రమోదీ తన మంత్రివర్గ సహచరులకు వివరించారు. మరో కొత్త రికార్డు సృష్టించిన ఇస్రోకు, అందులో పనిచేస్తున్న శాస్త్రవేత్తలకు మంత్రివర్గం అభినందనలు తెలిపిందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు.

ఏడాదికి 18 శాటిలైట్ల ప్రయోగం: ఇస్రో చైర్మన్
ఏడాదిలో 12 నుంచి 18 శాటిలైట్ల ప్రయోగించే అంశంపై దృష్టిపెట్టినట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ బుధవారం తెలిపింది. పీఎస్‌ఎల్వీ సిరీస్‌ను క్రమబద్దీకరించాల్సిన అవసరం ఉంది. అంతరిక్ష పరిశోధనల్లో దేశ సామర్థ్యాన్ని పెంచేందుకు శాటిలైట్ల ప్రయోగాల సంఖ్యను పెంచాల్సిన అవశ్యకత ఉంది. ఆ దిశగా సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు పనిచేస్తున్నాం అని ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ పేర్కొన్నారు. మూడు దశల పీఎస్‌ఎల్వీ తయారీపై ఆయన స్పందిస్తూ.. ప్రస్తుతం ఆ ఆలోచన లేదని, ప్రస్తుతం విశ్వ పరిశోధనకు అవుతున్న వ్యయాన్ని గణనీయంగా తగ్గించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. పీఎస్‌ఎల్వీ-సీ35 ద్వారా స్కాట్‌శాట్‌ను త్వరలో ప్రయోగించనున్నట్టు ఆయన తెలిపారు.

170 విద్యార్థుల కృషి ఫలితం: పుణె ఇంజినీరింగ్ కాలేజీ
పుణె ఇంజినీరింగ్ కాలేజీ రూపొందించిన స్వయం శాటిలైట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఆ కళాశాల విద్యార్థుల్లో ఉత్సాహం వెల్లువెత్తింది. హ్యామ్ రేడియో ద్వారా మారుమూల ప్రాంతాలకు కమ్యూనికేషన్ వ్యవస్థను చేరువ చేయడమే లక్ష్యంగా స్వయం శాటిలైట్‌ను రూపొందించారు. ఈ శాటిలైట్ రూపొందించడానికి 170 మంది విద్యార్థులు రాత్రింబవళ్లు శ్రమించారు.

సత్తా చాటిన ఇస్రో శాస్త్ర వేత్తలు: సీఎం కేసీఆర్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పీఎస్‌ఎల్వీ-సీ34 ద్వారా 20 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభినందించారు. పీఎస్‌ఎల్వీ ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు అంతరిక్ష ప్రయోగాల్లో అద్భుతం సృష్టించాలని ఆకాక్షించారు. భారత దేశ సత్తాను ఇస్రో శాస్త్రవేత్తలు నలుదిశలా చాటారని పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధనారంగంలో ఈ ప్రయోగం మరో మైలురాయిగా నిలుస్తుందనే ఆశాభావాన్ని సీఎం వ్యక్తం చేశారు.

20 ఉపగ్రహాలు-26 నిమిషాలు

అద్భుత ప్రయోగం హైలెట్స్
1.కార్టోశాట్-2 సిరీస్‌తోపాటు 20 శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో
2.మరోసారి సత్తా చాటిన పీఎస్‌ఎల్వీ-సీ34
3.తాజా ప్రయోగంలో అమెరికా, కెనడా, ఇండోనేషియా, జర్మనీకి చెందిన 17 శాటిలైట్లు
4.కక్ష్యలోకి చెన్నై సత్యభామ వర్సిటీ, పుణె ఇంజినీరింగ్ కాలేజీ రూపొందించిన స్వయం శాటిలైట్లు
5.20 శాటిలైట్ల మొత్తం బరువు 1288 కిలోలు
6.కార్టోశాట్‌లో ప్యాంక్రోమాటిక్, మల్టీ స్పెక్ట్రల్ కెమెరాల ఏర్పాటు
7.రిమోట్ సెన్సింగ్ సేవల కోసం కార్టోశాట్ రూపకల్పన
8.గతంలో ఒకేసారి 10 శాటిలైట్లు ప్రయోగించిన ఘనత ఇస్రోదే
9.పీఎస్‌ఎల్వీ వాహక నౌకకు ఇది 36వ ప్రయోగం
10.ఇప్పటివరకు 57 విదేశీ శాటిలైట్లను ప్రయోగించిన ఇస్రో
11.తాజా ఫీట్‌తో ప్రపంచ అంతరిక్ష ప్రయోగ మార్కెట్‌లో పెరిగిన భారత్ పరపతి

Check Also

పందులను నివారించ లేరా?

నందిపేట్‌, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ గ్రామంలో ఏముంది ..ఒకవైపు అపరిశుభ్ర వాతావరణం.. మరోవైపు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *