Breaking News

క్యాటగిరీలుగా ఇంజినీరింగ్ కాలేజీలు

-జేఎన్టీయూ, ఉన్నత విద్యామండలి అధికారులకు డిప్యూటీ సీఎం కడియం ఆదేశం
-ఆన్‌లైన్‌లో యాజమాన్య కోటాసీట్ల భర్తీపై త్వరలో నిర్ణయం?

హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలను మూడు క్యాటగిరీలుగా విభజించాలని జేఎన్టీయూహెచ్ అధికారులను డిప్యూటీ సీఎం కడియంశ్రీహరి ఆదేశించారు. నాణ్యమైన విద్యావిధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఆయా కళాశాలల గుర్తింపు కోసం నిర్వహించిన తనిఖీల నివేదికల్లో తేడాలకు అనుగుణగా వాటిని విభజించాలని అధికారులను ఆదేశించామని బుధవారం మీడియాతో అన్నారు. దీనిపై గురువారం నుంచి అధికారులు కసరత్తు చేస్తారన్నారు.

అంతకుముందు ఆయన రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, కార్యదర్శి శ్రీనివాసరావు, జేఎన్టీయూహెచ్ ఇన్‌చార్జి వీసీ శైలజారామయ్యర్, రిజిస్ట్రార్ యాదయ్య తదితరులతో సమీక్షించారు. ఈ నెలాఖరులోగా ఇంజినీరింగ్ కళాశాలల అఫిలియేషన్ల ప్రక్రియ పూర్తిచేసేందుకు పనుల్లో వేగం పెంచాలని సూచించారు. జేఎన్టీయూహెచ్ ఇన్‌చార్జి వీసీ శైలజారామయ్యర్ కూడా ఈ నెలాఖరులోగా అఫిలియేషన్ల ప్రక్రియ పూర్తిచేస్తామని మీడియాకు చెప్పారు. యాజమాన్య కోటా ద్వారా 30 శాతం ఇంజినీరింగ్ సీట్ల అడ్మిషన్లు ఆన్‌లైన్‌లో నిర్వహించే అంశంపై త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. దీనిపై ఇప్పటికే పలు ఫిర్యాదులు వస్తున్నాయ్నారు. ఇంకా ఫీజుల కమిటీ (టీఎస్‌ఏఎఫ్‌ఆర్సీ) ఆధ్వర్యంలో ఫీజులు ఖరారు కాలేదన్నారు. ఆ లోగా ఆన్‌లైన్‌లో యాజమాన్య కోటా సీట్ల అడ్మిషన్లపై ప్రభుత్వ విధానాన్ని ప్రకటిస్తామన్నారు. అవసరమైతే గురువారం దీనిపై చర్చించే అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు.

మూడు క్యాటగిరీలు ఇలా..
జేఎన్టీయూహెచ్, ప్రభుత్వ తనిఖీల నివేదికలను కళాశాలలు, కోర్సుల వారీగా పరిశీలిస్తారు. జేఎన్టీయూ, ప్రభుత్వ తనిఖీల్లో ఒకే రకమైన ప్రమాణాలు గల కళాశాలలను ఒక క్యాటగిరీలో చేరుస్తారు. జేఎన్టీయూహెచ్ తనిఖీల్లో కనిపించిన ప్రమాణాలు, ప్రభుత్వ తనిఖీల్లో ప్రమాణాలు లేని కళాశాలలను రెండో క్యాటగిరీ జాబితాలోకి తెస్తారు. ప్రభుత్వ తనిఖీల్లో ఉన్న ప్రమాణాలు, జేఎన్టీయూ తనిఖీల్లో ప్రమాణాలు కనిపించని కళాశాలలతో మూడో జాబితాను సిద్దంచేస్తారు. నాణ్యతా ప్రమాణాలు పాటించిన కళాశాలలకు మాత్రమే కోర్సులు, సీట్ల వారీ అఫిలియేషన్ ఇవ్వాలన్న కచ్చితమైన నిర్ణయంతో జేఎన్టీయూ అధికారులు ఉన్నట్లు సమాచారం.

Check Also

లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో దుప్పట్ల పంపిణీ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇందూర్‌ ఆద్వర్యంలో శుక్రవారం రాత్రి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *