Breaking News

యురేనియం బాబా!

క్రైంబ్యూరో:అత్యాశకు పోయే ప్రబుద్ధులను కోట్లలో ముంచే ఘనులు చాలామందే ఉన్నారు. మొన్నటికి మొన్న డబ్బును పూజలతో రెట్టింపు చేస్తానని శివానంద బాబా బురిడీ కొట్టించగా.. అలాంటి వ్యవహారమే మరోటి బయటపడింది. కాకపోతే ఇతగాడు పిడుగు పడినప్పుడు యురేనియం లభిస్తుందని, దాని ఖరీదు మూడు వం దల కోట్లపైనే ఉంటుందని, తనకు ఐదు కోట్లు ఇస్తేచాలని నమ్మించి వసూలు చేసిన సొమ్ముతో ఉడాయించాడు. ఏకంగా 17రాష్ట్రాల్లో 62 మంది ప్రముఖులను బురిడీ కొట్టించి, రూ.150 కోట్లు కొల్లగొట్టిన కోహ్లీ అనే వ్యక్తిని సీఐడీ పోలీసులు బెంగళూరులో అరెస్టుచేశారు. కోహ్లీ వంచనకు గురైనవారిలో తెలంగాణకు చెందిన ఎనిమిది మంది సంపన్నులు ఉన్నారు.

-150కోట్లకు పైనే కొల్లగొట్టిన ఘనుడు
-17 రాష్ర్టాల్లో 62 మందికి బురిడీ
-కర్ణాటక హీరోయిన్‌తో ఆహ్వానాలు
-పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు
-కర్నూలుకు చెందిన కోహ్లీ ఘరానా దందా
-బెంగళూరులో అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు
-కోహ్లీ బాధితుల్లో 8 మంది తెలంగాణ సంపన్నులు

ప్రజెంటేషన్ నుంచి మొదలు..
ఉత్తరభారతదేశంనుంచి వచ్చి కర్నూల్లో సెటిలైన కోహ్లీ అనే వ్యక్తి బెంగళూరులో కార్పొరేట్ ఆఫీసు తెరిచాడు. సంపన్నుల లిస్టు తయారు చేసుకుని, ఆకాశం నుంచి పడే పిడుగులో అత్యంత ఖరీదైన యురేనియం నిక్షేపాలు ఉంటాయని, వాటిని వెలికి తీసే సామర్థ్యం తనకు ఉందని నమ్మించడం మొదలుపెట్టాడు. యురేనియం ఎలా తీయాలి? దాన్ని ఎంతకు, ఎక్కడ విక్రయించాలి? అనే అంశాలపై వారికి పవర్ పాయంట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చేవాడు. ఒక్కసారి పిడుగుపడితే ఆ ప్రాంతంలో కనీసం రూ.300 కోట్ల విలువైన యురేనియం దొరుకుతుందని నమ్మించేవాడు.

దేశవ్యాప్తంగా ఎక్కడ పిడుగుపడినా తనకు సైంటిస్ట్‌లనుంచి సమాచారం వస్తుందని, వాటిని ప్రత్యేకమైన ల్యాబ్‌లో వీటిని పరీక్షించాల్సి ఉంటుందని చెప్పి.. తనవాటాగా రూ.3నుంచి 5కోట్లు అడ్వాన్స్‌గా వసూలుచేస్తాడు. కోహ్లీ మాయమాటలు నమ్మిన 62 మంది ప్రముఖులు అతడికి రూ.150 కోట్లు సమర్పించుకున్నారు. సొమ్ము ఇచ్చి నెలలు గడుస్తున్నా యురేనియం కాదు కదా.. కనీసం అల్యూమినియం కూడా అందకపోయే సరికి ఇదేదో మోసమని చివరాఖరుకు గ్రహించిన పెద్దలు.. పొలోమంటూ పోలీసులను ఆశ్రయించారు. రాష్ర్టానికి చెందిన 8మంది సంపన్నులు డీజీపీని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. డీజీపీ ఆదేశాలతో కోహ్లీని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన సీఐడీ నానా తంటాలు పడింది. 10రోజుల నుంచి దేశవ్యాప్తంగా అనేక చోట్ల నిఘా వేసి, తనిఖీలు జరిపింది. ఎక్కడా కోహ్లీ జాడ బయటపడలేదు. అయితే.. బాధితులకు కోహ్లీ చేసిన ఫోన్ నంబర్ల ఆధారంగా సిగ్నల్స్ ట్రేస్ చేసి పట్టుకున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

11సెల్‌ఫోన్లు.. ముగ్గురు పీఏలు..
కోహీ ఏకంగా 11 సెల్‌ఫోన్లతో వ్యవహారం నడిపేవాడని సీఐడీ విచారణ బయటపెట్టింది. ఒక్కో రాష్ర్టానికి చెందిన ఒక్కో సిమ్‌ను, ఒక్కో ఫోన్‌లో వేసి మాట్లాడుతాడని తెలిపింది. ఇతడికి సహకరించేందుకు ముగ్గురు పీఏలు కూడా ఉన్నారని తేలింది. 17రాష్ర్టాల కస్టమర్లతో నిత్యం బిజీగా ఉండే కోహ్లీ ఖరీదైన కార్లలో తిరుగుతూ విలాసవంతమైన హోటళ్లలో బస చేస్తుంటాడని సీఐడీ గుర్తించింది. తనకు ఎలాంటి ఆపద రాకుండా బలిష్టమైన ముగ్గురు ప్రైవేట్ బౌన్సర్లను భద్రతా సిబ్బందిగా నియమించుకున్నాడని సీఐడీ అధికారులు తెలిపారు.

బాధితుల లిస్టులో చాలామంది ప్రముఖులే
కోహ్లీ వలలో చిక్కిన బాధితుల్లో అందరూ సంపన్నులే. కర్ణాటకకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు, ఒక సినీ ప్రముఖుడు కూడా కోహ్లీ బాధితుల్లో ఉన్నట్టు సీఐడీ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ర్టాలకు సంబంధించి గతంలో ఓ మాజీ ముఖ్యమంత్రితోపాటు ప్రముఖ హీరోకు యురేనియం ద్వారానే కలిసివచ్చిందని చెప్పి సినీ ఇండస్ట్రీ, పారిశ్రామిక వర్గాలకు చెందిన నలుగురు, రాజకీయ రంగానికి చెందిన నలుగురిని మోసం చేసి 65కోట్లు కొల్లగొట్టినట్టు సీఐడీ అధికారులు అనుమానిస్తున్నారు.

వేర్వేరు బృందాలతో కాపలా
కోహ్లీని పట్టుకునేందుకు రంగంలో దిగిన సీఐడీ అధికారులు.. సెల్‌ఫోన్ లొకేషన్ల ఆధారంగా అతడు బెంగళూరులోని ఒక హోటల్‌లో ఉన్నట్టు గుర్తించారు. మార్నింగ్ వాక్ కోసం బయటకు వచ్చిన సమయంలో అతడిని చాకచక్యంగా పట్టుకుని హైదరాబాద్ తీసుకువచ్చినట్టు ఓ ఐజీ స్థాయి అధికారి ఒకరు నమస్తే తెలంగాణకు తెలిపారు. కర్నూల్లోని అతడి నివాసంతోపాటు బెంగళూరు ఎయిర్‌పోర్టు, హైదరాబాద్ ఎయిర్‌పోర్టు, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే రహదారులపైనా వేర్వేరు పోలీసు బృందాలతో కాపలా పెట్టామని ఐజీ తెలిపారు. కోహ్లీ వలకు చిక్కిన సినీ ప్రముఖులెవరన్న విషయంలోనూ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ కోణంలోనే కోహ్లీని విచారిస్తున్నట్టు సమాచారం. సినీ ప్రముఖులను కోహ్లీకి పరిచయం చేసిన ఓ బ్రోకర్‌ను కూడా పట్టుకునేందుకు సీఐడీ రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది.

ఎవరా కర్ణాటక హీరోయిన్?
కొంతమంది పారిశ్రామికవేత్తలు, రాజకీయ ప్రముఖులను యురేనియం ప్రజెంటేషన్‌కు రమ్మని ఆహ్వానించేందుకు ఓ శాండిల్‌వుడ్ (కర్ణాటక సినీరంగం) హీరోయిన్‌ను కోహ్లీ ఉపయోగించాడని పోలీస్ అధికారులు అనుమానిస్తున్నారు. ఆ హీరోయిన్‌నుకూడా విచారించేందుకు సిద్ధంగా ఉన్నామని, కోహ్లీ చెప్పే అంశాలను బట్టి విచారణ కొనసాగుతుందని సీఐడీ అధికారులు చెప్తున్నారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *