Breaking News

రివ్యూ: జెంటిల్‌మన్‌

చిత్రం: జెంటిల్‌మన్‌
తారాగణం: నాని.. సురభి.. నివేదా థామస్‌.. అవసరాల శ్రీనివాస్‌.. వెన్నెల కిషోర్‌.. సత్యం రాజేష్‌.. ఆనంద్‌.. తనికెళ్ల భరణి.. రోహిణి.. ప్రగతి.. రమాప్రభ తదితరులు
ఛాయాగ్రహణం: పి.జి.విందా
కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌
సంగీతం: మణిశర్మ
కళ: ఎస్‌.రవీందర్‌
కథ: డేవిడ్‌ నాధన్‌
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్‌
మాటలు.. కథనం.. దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.
నిర్మాణ సంస్థ: శ్రీదేవి మూవీస్‌
విడుదల తేదీ: 17-06-2016

ఎంచుకొనే ప్రతి కథ విభిన్నంగా ఉండాలని తపించే కథానాయకుడు నాని. ‘భలే భలే మగాడివోయ్‌’.. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ లాంటి చిత్రాల తర్వాత వాటికి పూర్తి భిన్నమైన ఓ థ్రిల్లర్‌ కథపై మొగ్గుచూపుతూ ‘జెంటిల్‌మన్‌’ చేశాడు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కూడా ఎప్పటికప్పుడు కొత్త జోనర్‌తోనే సినిమాలు తీస్తుంటారు. ‘అష్టాచమ్మా’ తర్వాత నాని – మోహనకృష్ణ కలిసి సినిమా చేస్తున్నారనగానే ప్రేక్షకుల్లో బోలెడన్ని అంచనాలు. మరి అందుకు తగ్గట్టుగానే ‘జెంటిల్‌మన్‌’ ఉన్నాడా? అన్న విషయాన్ని చూడాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథేంటంటే..?: గౌతమ్‌ (నాని) ఓ సరదా కుర్రాడు. తొలి చూపులోనే కేథరిన్‌ (నివేదా థామస్‌) ప్రేమలో పడతాడు. కేథరిన్‌ కూడా గౌతమ్‌ని ప్రేమిస్తుంది. విఎఫ్‌ఎక్స్‌ నిపుణురాలైన కేథరిన్‌ తన ఉద్యోగం రీత్యా ఒక నెలలో తిరిగొస్తానని చెప్పి లండన్‌కి వెళుతుంది. తిరుగు ప్రయాణంలోనే ఐశ్వర్య (సురభి)ను కలుస్తుంది. ఆమెకు అప్పటికే పెళ్లి నిశ్చయమై ఉంటుంది. ఇద్దరూ ఒకరి ప్రేమకథని మరొకరు చెప్పుకొంటారు.

అయితే ఇద్దరూ ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే గౌతమ్‌ వెళ్లి ఐశ్వర్యని రిసీవ్‌ చేసుకొంటాడు. ఐశ్వర్య నాక్కాబోయేవాడు జై (నాని) అని చెప్పాను కదా.. ఇతనే అని కేథరిన్‌కి పరిచయం చేస్తుంది. మరి గౌతమ్‌కి కేథరిన్‌పై ప్రేమ ఉట్టిదేనా? నిజంగా ఐశ్వర్యని రిసీవ్‌ చేసుకొంది గౌతమేనా లేక ఆయన పోలికలతోనే ఉన్న మరో వ్యక్తినా? గౌతమ్‌కి.. జైకీ మధ్య ఏమైనా సంబంధముందా? తదితర విషయాల్ని తెరపైనే చూడాలి.

ఎలా ఉందంటే?: ఒక రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. సీరియస్‌గా సాగే సగటు థ్రిల్లర్‌ చిత్రాలకి భిన్నంగానే ఉంటుంది. తొలి సగభాగం రెండు ప్రేమకథలతో హాయిగా సాగిపోతుంది. కానీ కథ మాత్రం ముందుకు సాగదు. ఒకే పోలికలతో ఇద్దరిని చూపించడం.. అసలు వీళ్లు ఇద్దరా ఒకరా? అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో రేకెత్తించడం మినహా తొలి సగభాగంలో ముందుకు కదలదు. విరామం ముందు వచ్చే సన్నివేశాలతోనే అసలు కథ మొదలవుతుంది.

గౌతమ్‌ గురించి జైకి తెలుసనే విషయం బయట పడినప్పటి నుంచి ప్రేక్షకులు కథలో లీనమవుతారు. తొలి సగభాగం వచ్చే సన్నివేశాల్లో గౌతమ్‌.. కేథరిన్‌ల మధ్య ప్రేమకథ బానే ఉంటుంది కానీ.. ఐశ్వర్య-జైల ప్రేమకథే కాస్త నత్తనడకన సాగినట్టు అనిపిస్తుంటుంది. అక్కడక్కడ సున్నితమైన మాటలతో వినోదాన్ని పంచే ప్రయత్నం చేశారు కానీ.. వాటి మోతాదు ఇంకొంచెం ఎక్కువై ఉంటే కథలో వేగం పెరిగేదన్న భావన కలుగుతుంది. కొడైకెనాల్‌లో సన్నివేశాలన్నీ కూడా టైమ్‌పాస్‌ అన్నట్టుగానే సాగాయి. అయితే.. గౌతమ్‌ చనిపోయాడన్న మలుపుతో అక్కడిదాకా చప్పగా సాగిన కథ ఒక్కసారిగా ప్రేక్షకుల్ని ఉత్కంఠకి గురి చేస్తుంది.

గౌతమ్‌ నిజంగానే చనిపోయాడా అనే విషయం గురించి జర్నలిస్టు నిత్య (శ్రీముఖి).. కేథరిన్‌లు పరిశోధన జరిపే తీరు.. ఆ సన్నివేశాలన్నీ ఉత్కంఠని రేకెత్తిస్తాయి. ప్రచార చిత్రాల్లో హీరోనా? విలనా? అన్న ప్రశ్నకు తగ్గట్టుగానే నాని పాత్ర సాగుతుంది. అతనిలో అసలు కోణమేంటో చివరిదాకా తెలియదు. ఆ విషయాన్ని గుప్పెట్లో ఉంచుతూ కథని నడిపిన విధానంలోనే దర్శకుడి పనితనం తెలుస్తుంది.

మలి సగంలోనే కథంతా చెప్పాల్సి వచ్చినా దర్శకుడు అక్కడా కామెడీకి ప్రాధాన్యమిచ్చాడు. సుదర్శనం (వెన్నెల కిషోర్‌) పాత్ర కడుపుబ్బా నవ్విస్తుంది. క్లైమాక్స్‌కి ముందు వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. తొలిసగం కాస్త నెమ్మదించినట్లుగా అనిపిస్తుంది. అయితే.. తాను చెప్పాలనుకున్న కథను ఎక్కడా తడబాటుకు గురి కాకుండా చెప్పటం కనిపిస్తుంది.

ఎవరెలా?: నాని సినిమాల్లో ప్రతిసారీ అతని నటనే హైలైట్‌ అవుతుంటుంది. ఈసారి అతనికి దీటుగా నివేదా థామస్‌ నటించింది. కథంతా ఆమె కోణంలోనే సాగినట్టు అనిపిస్తుంటుంది. జై.. గౌతమ్‌ పాత్రల్లో చక్కగా ఇమిడిపోయారు. కానీ వేరియేషన్స్‌ కోసమని పెద్దగా కష్టపడాల్సిన అవసరమేమీ రాలేదు. కాకపోతే హీరోనా? విలనా? అనే ఆసక్తిని క్రియేట్‌ చేసేందుకు మిస్టీరియస్‌ పర్సన్‌గా నాని చక్కగా ఇమిడిపోయాడు.

గౌతమ్‌ చనిపోయాడని తెలిసినప్పుడు నివేదా థామస్‌ నటన తీరు ఆకట్టుకుంటుంది. సురభి పర్వాలేదనిపిస్తుంది. అవసరాల శ్రీనివాస్‌ ఎలాంటి పాత్రలో అయినా సరిపోతాడన్న విషయం ఈ సినిమా మరోసారి రుజువు చేస్తుంది. వెన్నెల కిషోర్‌.. సత్యం రాజేష్‌లు ఉన్నంతలో బాగానే నవ్వించారు. సాంకేతిక బృందం సమష్టిగా రాణించింది. మణిశర్మ సంగీతం.. పి.జి.విందా కెమెరా పనితనం బాగుంది. నేపథ్య సంగీతంతో మణిశర్మ చిత్రాన్ని మరో మెట్టు ఎక్కించారు. కథ వేరొకరిదైనా దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ఓన్‌ చేసుకొన్న విధానం బాగుంది. ఆయన మాటలు కూడా బాగానే పేలాయి. సినిమాలో నిర్మాణ విలువలు స్పష్టంగా కనిపిస్తాయి.

బలాలు
+ కథ.. కథనం
+ సంగీతం
+ నాని.. నివేదా థామస్‌.. అవసరాల శ్రీనివాస్‌

బలహీనతలు
– తొలి సగ భాగం

చివరిగా.. థ్రిల్‌కు గురి చేసే ప్రేమకథ ఈ ‘జెంటిల్‌మెన్‌’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Check Also

27న మాస్కుల‌ పంపిణీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *