Breaking News

రైతులకు రుణాల విషయంలో అన్ని బ్యాంకులు ఒకే విధానాన్ని అవలంబించాలి

 

– మంత్రి పోచారం

నిజామాబాద్‌, జూన్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం అన్ని బ్యాంకులు రైతుల విషయంలో ఒకేవిధమైన పద్దతిని అవలంబించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బ్యాంకు అధికారులను కోరారు. సోమవారం స్తానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు అధికారులకు రాష్ట్ర స్తాయిలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బ్యాంకు రునాలను, వడ్డిని ప్రభుత్వమే చెల్లించనుందని తెలిపారు. అయితే అందుకనుగుణంగా కాకుండా కొన్ని బ్యాంకులు రైతుల రుణాల నుంచి వడ్డిని వసూలు చేయడం బాధాకరమన్నారు. లక్షలోపు రుణాలకు వడ్డిని ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఈ దిశగా ఇప్పటికి రూ. 200 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లించిందని, కేవలం 20 కోట్లు రూపాయలు మాత్రమే చెల్లించవలసి ఉందన్నారు. లక్షపైన రుణాలకు కేవలం సంవత్సరానికి 4 శాతం వడ్డిని మాత్రమే తీసుకోవాలని ఆయన తెలిపారు. రైతులకు మంజూరు చేసే రుణాల రెన్యువల్‌కు ప్రభుత్వం చెల్లించే రుణమాఫీకి ముడిపెట్టవద్దని సూచించారు.

జిల్లాలో 4.73 లక్షల పట్టేదారులకుగాను 3.79 లక్షల పట్టాదార్లకు మాత్రమే రుణాలు అందుతున్నాయని, మిగతా 94 వేల మంది పట్టాదార్లు ఇతరత్రా రుణాల వైపు వెళుతున్నారని, తద్వారా వారు ప్రయివేటు వ్యాపారులతో ఇబ్బందులకు, అధిక వడ్డిలకు గురవుతున్నారని తెలిపారు. వీరికి కూడా బ్యాంకు రుణాలు అందించడానికి వ్యవసాయాధికారులు, బ్యాంకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో ముఖ్యంగా జుక్కల్‌, బిచ్కుంద మండలాలకు చెందిన పత్తి రైతులు 14 జూన్‌లోగా బీమాకై డిడి కట్టి ఉంటే వాటిని ఆమోదించేలా చూడాలని తెలిపారు.

సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా మాట్లాడుతూ పంటలకు బీమా వర్తింపచేయడానికి ప్రభుత్వం సంతోషకరమైన చర్య తీసుకుందని, ఈ దిశగా గ్రామం యూనిట్‌గా వర్తింపజేయడానికి అసెంబ్లీలో చర్చ జరగడం రెండేళ్లుగా రైతుల నిరీక్షణకు ఫలితం లభించిందన్నారు. తద్వారా నిజామాబాద్‌ను కేంద్ర ప్రభుత్వం పైలెట్‌ జిల్లాగా గుర్తించిందన్నారు.

సమావేశంలో జడ్పి ఛైర్మన్‌ దఫేదార్‌ రాజు, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, హన్మంత్‌ షిండే, అదనపు జేసి రాజారాం, జడ్పి సిఇవో మోహన్‌లాల్‌, ఇన్సురెన్సు అదికారిణి రాజేశ్వరి, ఇన్‌చార్జి ఎల్‌డిఎం వెంకటేశ్వర్లు, బ్యాంకుల జిల్లాస్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో దుప్పట్ల పంపిణీ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇందూర్‌ ఆద్వర్యంలో శుక్రవారం రాత్రి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *