వర్ని, జూలై 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరోగ్య సంరక్షణ అంశాలపై ప్రాథమిక అవగాహన లేకుండా 25 సంవత్సరాల సర్వీసు కలిగిన వర్ని పిహెచ్సి హెల్త్ సూపర్వైజర్ సావిత్రిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగితా రాణా ప్రకటించారు. డ్రై డే, ఐరన్ పోలిక్ మాత్రలు ప్రాధాన్యతపై అడిగిన ప్రశ్నలకు సంబంధం లేని సమాధానాలు ఇచ్చిన హెల్త్ సూపర్వైజర్ సావిత్రికి సంబంధించిన జూలై నెల పర్యటన డైరీని తనికీచేసి నివేదించాలని ఐకెపి ఎపిఎంను కలెక్టర్ ఆదేశించారు. పై అంశాలపై ఏఎన్ఎంలకు ఉన్న అవగాహన సూపర్వైజర్లకు లేదని అన్నారు.
పర్యటన డైరీలో తేడాలుంటే సస్పెండ్ చేస్తానని అన్నారు. తక్షణమే హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలకు అవగాహన తరగతులు నిర్వహించాలని డిఎం అండ్ హెచ్వోను హెచ్చరించారు. ఇటువంటి ఉద్యోగుల చేతుల్లో ప్రజల ఆరోగ్యం ఉండడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే హెల్త్ సూపర్వైజర్లను టర్మినెట్ చేయనున్నట్టు కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా డిఎం అండ్ హెచ్వో డాక్టర్ వెంకట్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నివారణకై క్షేత్ర స్థాయి ఉద్యోగుల్లో సమన్వయాన్ని పెంచేందుకు అన్ని మండలాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పైపులైన్ల లీకేజీలను అరికట్టుట, క్లోరినేషన్ చేసిన నీటిని సరఫరా చేయాలని పంచాయతీ కార్యదర్శులను కోరారు. కాచి వడపోసిన నీటినే తాగేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సీజనల్ వ్యాధుల బారిన పడిన వారి వివరాలు ఏ సమయంలోనైనా తనకు మెసేజ్ ద్వారా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

Latest posts by NizamabadNews OnlineDesk (see all)
- డయల్ 100కు 2271 ఫోన్ కాల్స్ - October 10, 2018
- ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - October 10, 2018
- బహుజనులు ఐక్యం కావాలి - October 10, 2018