సామాజిక తెలంగాణకై ఉద్యమిద్దాం – ప్రొఫెసర్‌ ప్రభంజన్‌ యాదవ్‌

 

డిచ్‌పల్లి, సెప్టెంబరు 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో దళిత, బిసి, గిరిజన, మైనార్టీ ప్రజలకు మేలు జరగాలంటే అందరూ కలిసికట్టుగా సామాజిక తెలంగాణ సాధనకై పోరాడాలని ప్రొఫెసర్‌ ప్రభంజన్‌ కుమార్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. గురువారం రోజు తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల సెమినార్‌ హాల్‌లో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడారు. నిజమైన బంగారు తెలంగాణ నిర్మాణం జరగాలంటే అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ది ఫలాలు అందాలని వివరించారు. తెలంగాణ సాధనకై దళిత బహుజన వర్గాలు ముందుండి ఉద్యమం నడిపారని, అనేక త్యాగాలు చేశారని వారికి అధికారం మాత్రం అందడం లేదని విమర్శించారు. ఈనెల 4న హైదరాబాద్‌లో జరిగే సామాజిక తెలంగాణ సాదన ధూం… ధాం… సభకు భారీగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. సభకు అధ్యక్షత వహించిన వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జాన్సన్‌ దామెర మాట్లాడుతూ సామాజిక తెలంగాణ అనేది అభివృద్ది ఫలాలు అందరికీ జనాభా నిష్పత్తి ప్రకారం అందడమే అని ఆయన వివరించారు. దళిత, బహుజన, గిరిజన, మైనార్టీ వర్గాలన్ని ఏకం కావాల్సిన ఆవశ్యకత ఉందని డాక్టర్‌ జాన్సన్‌ తెలిపారు. బిసి సెల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.రమణాచారి మాట్లాడుతూ రైతులు కూలీలుగా తర్వాత వలస కూలీలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీ సెల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జమీల్‌ అహ్మద్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ప్రవీణాబాయి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌లు డాక్టర్‌ నాగరాజు, డాక్టర్‌ వాసం చంద్రశేఖర్‌, పిఆర్‌వో రాజారాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సభకు సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు.

Check Also

ఎల్‌ఆర్‌ఎస్‌పై అవగాహన కల్పించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంలో ఇచ్చిన టార్గెట్‌ పూర్తి కావాలని, పెట్టిన ప్రతి ...

Comment on the article