Breaking News

బొడ్డంటే భయమా.. గుడ్డంటే భయమా?

వెర్రి వెయ్యి విధాలంటారుగానీ.. భయం పదివేల విధాలు. అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు కూడా. కొందరికి దెయ్యమంటే భయం.. కొందరికి భార్యంటే భయం. ఇంకొందరికి భర్తంటే భయం. ఎత్తయిన ప్రదేశానికి వెళ్లినప్పుడు కిందపడిపోతామని.. నీళ్లల్లో ప్రయాణించేటప్పుడు పడి మునిగిపోతామేమోనని భయాలుండటం సహజమే. కానీ.. బొడ్డుకి, కోడిగుడ్డుకి కూడా భయపడేవాళ్లుంటారు తెలుసా? ఆ వింత భయాలకు అందమైన పేర్లు కూడా ఉన్నాయి కావాలంటే చూడండి.
కైరోఫోబియా: చేతులంటే భయం. సాధారణంగా చేతులు విరిగినవాళ్లకి, ఆర్థరైటిస్‌ బాధితులకు ఈ ఫోబియా వస్తుందట.
గ్లోబోఫోబియా: బెలూన్లంటే భయం. వీళ్లనిగానీ పుట్టినరోజు పార్టీలకు తీసుకెళ్తే అనుక్షణం భయమే. ఇందులోనూ మళ్లీ రెండు రకాలవాళ్లుంటారండోయ్. కొందరికి బెలూన్‌ని చూస్తేనే భయం. కొందరికి బెలూన్లు పగుల్తాయేమోనన్న భయం. ఈ ఫోబియా ఉన్న ఓ సెలబ్రిటీ.. ఓప్రా విన్ ఫ్రే.
జెనూఫోబియా: మోకాళ్లంటే భయం. పక్కవాళ్ల మోకాళ్లంటేనే కాదు.. తమ సొంత మోకాళ్లన్నా భయపడేవారుంటారు.
Hippopotomonstrosesquippedali ophobia: తెలుగులో రాయడానికి అత్యంత కష్టమైన పదమిది. ఈ పదానికి అర్థమేంటంటే.. పొడవైన పదాలంటే భయం అని. (ఆ పదాన్ని చదవలేకపోతున్నారా.. ఇదుగో ఇలా చదవాలి: హిప్పొపోటమాన్‌స్ట్రాసెస్‌క్విపిడాలియో ఫోబియా)
అబ్లూటోఫోబియా: ఈ ఫోబియా ఉన్నవారికి స్నానం చేయాలన్నా, దుస్తులు ఉతకాలన్నా, ఇల్లు శుభ్రం చేయాలన్నా భయం. ఒక్కమాటలో చెప్పాలంటే.. అశుభ్ర స్వరూపాలన్నమాట.
ప్యూపాఫోబియా: బొమ్మలంటే భయం.
అరాకీబ్యుటిరోఫోబియా: పీనట్ బటర్, చలిమిడిలాంటివి తిన్నప్పుడు అవి అంగిలికి (నోటి పై భాగంలో) అతుక్కుపోతాయేమోనన్న భయం.
అలెక్టొరోఫోబియా: కోళ్లంటే భయం.. బతికినవైనా, చచ్చినవైనా. అదృష్టమేంటంటే.. వండిన కోళ్లంటే మాత్రం వీళ్లకి భయం ఉండదు. గుడ్లంటే(egg) భయాన్ని కూడా ఇందులోకి చేరుస్తారు. కానీ, దానికి ఓవాఫోబియా అనే వేరే పదం ఉంది.
పెంతెరాఫోబియా: ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫోబియా. ఎందుకంటే చాలా మందికి ఉండే భయమిది. అత్తగారంటే భయం అని దీనికి అర్థం.
ఒంఫలోఫోబియా: బొడ్డంటే భయాన్ని ఒంఫలోఫోబియా అంటారు. ఈ భయం ఉన్నవారు తమ సొంతదైనా, ఇతరులదైనా.. బొడ్డు చూడటానికి, తాకడానికి భయపడరు. మరీ ముఖ్యంగా వీరిని భయపెట్టాలంటే దెయ్యం సినిమాలు చూపించక్కర్లా. తెలుగు సినిమాలు చూపిస్తే చాలు.
పొగనోఫోబియా: గడ్డాలంటే భయం. ఈ మధ్య అమెరికన్లకు మరీ ఎక్కువైందిది.
చోలెఫోబియా: న్యూస్‌పేపర్లంటే భయం. ఇంగ్లండ్‌కు చెందిన డయానె అనే మహిళకు ఈ ఫోబియా ఉండేది. దీనికి కారణం.. చిన్నప్పుడు ఆమె తండ్రి న్యూస్‌పేపర్‌ను గొట్టంలా మడిచి ఆమె తల మీద కొట్టేవాడట. అప్పట్నుంచీ ఆమెకు ఆ భయం అలా ఉండిపోయింది.

Check Also

కొత్త వ్యక్తులు వస్తే పోలీసుల‌కు సమాచారం ఇవ్వండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మనం కరోనా అనే కనిపించని శత్రువుతో పోరాడుతున్నామని అనుక్షణం ...

Comment on the article