Breaking News

అధికారుల పనితీరుపై దద్దరిల్లిన మునిసిపల్‌ కౌన్సిల్‌

 

– కమీషనర్‌ అధికారులను సరెండర్‌ చేస్తామని హెచ్చరిక

కామారెడ్డి, నవంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అధ్యక్షతన మంగళవారం జరిగిన కామారెడ్డి పాలకవర్గ సమావేశంలో అధికారుల పనితీరుపై సభ్యులు ధ్వజమెత్తారు. అధికారులు తమ పనితీరుమార్చుకోకుంటే ప్రబుత్వానికి సరెండర్‌ చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ అధికారులు పొందుపరుస్తున్న ఎజెండాలో ప్రగతి పనులకు సంబంధించి ధరలలో చాలా వ్యత్యాసాలున్నాయన్నారు. వేల రూపాయల్లో అయ్యే పనులను లక్షల్లో ఖర్చు చూపిస్తూ తప్పుడు ఎజెండాలు తయారుచేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిసారి ఇలాగే జరుగుతుందని కమీషనర్‌కు చెప్పినా స్పందన కరువవుతుందని పేర్కొన్నారు.

ఇంజనీర్లు గంగాదర్‌, భూమేశ్వర్లు బాధ్యతా రాహిత్యంగా పనిచేస్తున్నారని, ఇంజనీరింగ్‌ విభాగం అవినీతి మయమైందని దుయ్యబట్టారు. పాలకులంటే విలువలేకుండా పోయిందని, తాము ఏం చెప్పినా చేయడం లేదని, వార్డుల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆగ్రహం వెల్లగక్కారు. కౌన్సిలర్లు కృష్ణాగౌడ్‌, ముప్పారపు ఆనంద్‌, రామ్మోహన్‌లు అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. పారిశుద్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందని, వార్డుల్లో చెత్త ఎత్తేందుకు ఆటోలు రాకపోవడంతో చెత్త పేరుకుపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సానిటరీ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు పద్దతి మార్చుకొని పనిచేయాలని, పారిశుద్య నిర్వహణపై మరింత దృష్టి సారించాలన్నారు. కమీసనర్‌ విజయలక్ష్మిపై సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మీ మాటను కిందిస్థాయి సిబ్బంది వింటున్నారా, మీకు వారు ఏమాత్రం గౌరవమిస్తున్నారని నిలదీశారు. కమీషనర్‌తో పాటు ఇద్దరు ఇంజనీర్లను తీరు మార్చుకోకపోతే ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తామని హెచ్చరించారు. కౌన్సిలర్లు సంగి మోహన్‌, సిద్దమ్మలు ఛైర్మన్‌ పోడియం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. పట్టణంలో తాగునీటి సరఫరా వ్యవస్థ అధ్వాన్నంగా ఉందన్నారు. పైప్‌లైన్లు పగిలిపోయాయని చెబుతూ మరమ్మతుల పేరిట 25 వేలు తీసుకుంటూ ప్రజలకు నీరు మాత్రం సరఫరా చేయడం లేదని అన్నారు. గోదావరి జలాల పరిస్థితి సైతం ఇలాగే మారిందని ఆక్రోశం వెల్లగక్కారు. వెంటనే తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎజెండాలో282 అంశాలను పొందుపరచగా, కొన్నింటిని మాత్రమే పెండింగ్‌లో ఉంచి సభ్యులు మిగతా వాటికి ఆమోద ముద్ర వేయడం గమనార్హం. కార్యక్రమంలో వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీ, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Check Also

వారిని కఠినంగా శిక్షించాలి

కామారెడ్డి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం న‌ల్ల‌మడుగు గ్రామంలో అంబేద్కర్‌ ...

Comment on the article