Breaking News

రీకౌంటింగ్‌లో ట్రంప్‌దే గెలుపు

వాషింగ్టన్: అమెరికాలో ఇప్పుడంతా ట్రంప్ హవా నడుస్తోంది. ప్రపంచమంతా ట్రంప్ వైఖరిని సైలెంట్‌గా గమనిస్తోంది. ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాల పట్ల కాబోయే అధ్యక్షుడి వైఖరి ఏంటో ప్రజలకు స్పష్టమవుతోంది. విజయం అసాధ్యం అని ట్రంప్‌పై దుమ్మెత్తి పోసిన వాళ్లే.. ఇప్పుడు చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ట్రంప్ గెలుపును జీర్ణించుకోలేకో.. నమ్మకం లేకనో.. గ్రీన్ పార్టీ తరపున ప్రెసిడెంట్‌గా పోటీ చేసిన జెల్ల్ స్టెయిన్.. ఫలితాల రీకౌంటింగ్‌కు పిటిషన్ వేశారు. దీంతో పెనస్లేవియా, విస్కన్సిన్, మిచిగాన్ రాష్ట్రాల్లో రీకౌంటింగ్ జరిగింది. ఈ రీకౌంటింగ్‌లో అద్భుతం జరిగి.. హిల్లరీ గెలుస్తారని డెమొక్రాట్స్ భావించారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ రీకౌంటింగ్ ఫలితాలు వెలువడ్డాయి. విస్కన్సిన్, పెనస్లేవియా రాష్ట్రాల రీకౌంటింగ్‌లో ట్రంప్ విజయబావుటా ఎగరవేశారు. విస్కన్సిన్‌లో 162 ఓట్లు మాత్రమే హిల్లరీ ఖాతాకు చేరాయి. 22వేల ఓట్ల తేడాతో ట్రంప్ గెలిచారు. రీకౌంటింగ్ వల్ల ఫలితాల్లో 0.06శాతం మాత్రమే తేడా జరిగిందని అధికారులు వెల్లడించారు.

ఇక పెనస్లేవియా రాష్ట్రంలోనూ ట్రంప్‌నే విజయం వరించింది. ఒకటి కంటే తక్కువ శాతం తేడానే ఎన్నికల ఫలితాల్లో మార్పు కనిపించింది. దీంతో రిపబ్లికన్ల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. రీకౌంటింగ్ కూడా హిల్లరీని గెలిపించలేకపోవడంతో.. డిసెంబర్ 19న జరిగే ఎలక్ట్రోరల్ కాలేజీ ఎన్నికల పైనే డెమోక్రటిక్ అభిమానుల దృష్టి ఉంది. ఆ ఎన్నికల్లో ట్రంప్‌కు వ్యతిరేకంగా అత్యధిక సంఖ్యలో ఎలక్టార్స్ ఓటు వేసి, హిల్లరీని గెలిపిస్తే అమెరికాలో అద్భుతం జరిగినట్లేనని వారంతా భావిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఎవరికైనా ఓటు వేసి తమ ప్రెసిడెంట్‌ను అధికారికంగా ప్రకటించే ఈ ఎన్నికలో హిల్లరీకి రిపబ్లికన్లు ఓటు వేసినా వారి పదవికి వచ్చిన ప్రమాదమేమీ లేదని, పార్టీ నియమనిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ స్వల్ప మొత్తంలో జరిమానా కట్టాల్సి ఉంటుందని వారు మాట్లాడుకుంటున్నారు. మరి అమెరికాలో డెమోక్రాట్లు అనుకున్న అద్భుతం జరుగుతుందా..? లేదా..? అనేది డిసెంబర్ 19నే తేలాల్సి ఉంది.

Check Also

రెండు ల‌క్షల‌ ఎకరాల‌కు సాగునీరు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్యాకేజీ 20 – 21 ద్వారా నాలుగు నియోజకవర్గాల‌లోని ...

Comment on the article