Breaking News

రివ్యూ.. దంగల్‌

చిత్రం పేరు: దంగల్‌(హిందీ)
నటీనటులు: ఆమిర్‌ఖాన్‌.. సాక్షి తన్వార్‌.. ఫాతిమా సనా షేక్‌.. సన్యా మల్హోత్రా.. అపర్‌శక్తి ఖుర్రానా.. వివన్‌ భటేనా
దర్శకత్వం: నితీష్‌ తివారీ
నిర్మాణం: ఆమిర్‌ఖాన్‌ ప్రొడక్షన్స్‌
సంగీతం: ప్రీతం చక్రవర్తి
విడుదల తేదీ: 23-12-2016

ఆమిర్‌ఖాన్‌ అంటేనే విలక్షణ నటుడన్న పేరుంది. చేసే ప్రతీ సినిమాలోనూ తను ఆ ప్రత్యేకతను చాటుకుంటారు. అందుకే ఆయన సినిమా వస్తోందంటే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. 2014లో ఆమిర్‌ నటించిన ‘పీకే’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. గ్రహాంతర వాసిగా ఆయన నటన ప్రేక్షకులను విశేషంగా అలరించింది. తాజాగా ప్రముఖ భారతీయ మల్లయోధుడు.. ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహవీర్‌సింగ్‌ ఫోగట్‌ జీవిత కథతో తెరకెక్కిన ‘దంగల్‌’ చిత్రంలో నటించారు ఆమిర్‌ఖాన్‌. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ చిత్రం శుక్రవారం థియేటర్లలో అడుగుపెట్టింది. మరి రెండేళ్ల విరామం తర్వాత వెండితెరపై ప్రత్యక్షమైన ఆమిర్‌.. సినీ అభిమానులను ఏ మేరకు ఆకట్టుకున్నారో చూద్దాం..

కథేంటి?: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు పతకాలు తెచ్చిపెట్టిన మహిళా రెజ్లర్లు గీతా ఫోగట్‌.. బబితా కుమారీల విజయ ప్రస్థానమే ప్రధానాంశంగా సాగే చిత్రం ఇది. మహవీర్‌ సింగ్‌ ఫోగట్‌(ఆమిర్‌ఖాన్‌) హరియాణాలోని భివానీ జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన మల్లయోధుడు. రెజ్లింగ్‌లో భారత దేశానికి బంగారు పతకాన్ని అందించాలన్నది ఆయన కల. కానీ.. అది నెరవేరదు. దాంతో తన పుత్ర సంతానంతోనైనా ఆ ఘనత సాధించాలని అనుకుంటాడు. శోభా కౌర్‌(సాక్షి తన్వార్‌)ని వివాహం చేసుకుంటాడు. అయితే ఆ దంపతులకు పుట్టిన నలుగురు సంతానం ఆడపిల్లలే. అమ్మాయిలు రెజ్లింగ్‌లో రాణించలేరన్నది అప్పట్లో అందరిలోనూ నాటుకుపోయిన నమ్మకం. కానీ.. అనుకోకుండా ఓ రోజు స్కూల్‌లో జరిగిన గొడవలో తన కూతుళ్లు గీతా ఫోగట్‌(ఫాతిమా), బబిత కుమారీ(సాన్యా మల్హోత్ర)లు ఇద్దరూ అబ్బాయిల్ని చితకబాదుతారు. దాంతో ఆ తండ్రికి తన కూతుళ్ల శక్తి సామర్థ్యాలపై నమ్మకం కలుగుతుంది. కుమారుడితో నెరవేర్చుకోవాలనుకున్న తన కలను కూతుళ్లతో సాధించాలని సంకల్పిస్తాడు. మల్లయుద్ధంలో వారికి కఠోర శిక్షణ ఇస్తాడు. శిక్షణ సంస్థలపై ఆధారపడకుండా.. స్వయంగా అన్నీ నేర్పిస్తాడు. మరి ప్రపంచ దిగ్గజ క్రీడాకారులతో తలపడే స్థాయిలో తన కూతుళ్లను మహవీర్‌ ఎలా తీర్చిదిద్దుతాడు? అంతర్జాతీయ స్థాయిలో దేశానికి వాళ్లు ఎలాంటి విజయాలను అందించారు? అతని చిరకాల కల నెరవేరిందా? అన్న విషయాలను తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే..: మహవీర్‌ సింగ్‌ ఫోగట్‌ తన కలను సాకారం చేసుకునేందుకు కూతుళ్లకు శిక్షణ ఇచ్చే తీరు అందరినీ కట్టిపడేస్తుంది. శిక్షణ సంస్థలకు పంపించకుండా ఇంటిదగ్గరే ఆ తండ్రి చేయించే కఠోర కసరత్తులను చూస్తే భావోద్వేగాలు తన్నుకొస్తాయి. మల్లయుద్ధంలో అమ్మాయిలు రాణించలేరన్న నమ్మకాన్ని పటాపంచలు చేసే తీరు ఎంతోమందిని ఆలోచింపజేస్తుంది. ఆశయ సాధనకోసం పరితపించే ఆ తండ్రీకూతుళ్ల పట్టుదలనూ, పోరాట పటిమనూ తెరపై చక్కగా ఆవిష్కరించాడు దర్శకుడు. క్రీడల్లో అబ్బాయిలకంటే ఆడపిల్లలు ఏమాత్రం తక్కువ కాదన్న సందేశాన్ని ఇవ్వడంలోనూ సక్సెస్‌ అయ్యాడు. నిర్మాణ విలువలు అడుగడుగునా కనిపిస్తాయి. ద్వితీయార్ధంలో తండ్రీకూతుళ్ల మధ్య జరిగే మల్లయుద్ధ పోరు ఆసక్తిని కలిగిస్తుంది. కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. నిజ జీవితంలో కామన్వెల్త్‌ క్రీడల్లో బబితా కుమారి కూడా పతకాన్ని సాధించింది. కానీ కేవలం గీతా ఫోగట్‌ ఆటను చూపించడంతోనే దర్శకుడు సరిపెట్టేశాడు. బబితాకుమారి ఆటను కూడా తెరపై చూపించి ఉంటే బాగుండేది.

ఎవరెలా?: ఆమిర్‌ నటనకు ఏ మాత్రం వంకపెట్టలేం. ఈ సినిమా కోసం ఆయన చేసిన కఠోర కసరత్తుల ఫలితం తెరపై అచ్చుగుద్దినట్లు కనిపిస్తుంది. యువ మల్లయోధుడిగా.. మధ్య వయస్కుడిగా.. రెండు పాత్రల్లో ఆమిర్‌ చక్కగా ఒదిగిపోయారు. మహవీర్‌సింగ్‌ కూతుళ్లు గీతా ఫోగట్‌గా ఫాతిమా.. బబితా కుమారీ పాత్రలో సాన్యా మల్హోత్ర చక్కని ప్రతిభ కనబరిచారు. ఇప్పటి వరకూ టీవీ తెరపై మెరిసిన సాక్షి తన్వార్‌.. తొలిసారి వెండితెరపై కనిపించారు. మహవీర్‌ సింగ్‌కి భార్య పాత్రలో సున్నిత మనస్కురాలిగా ప్రేక్షకుల్ని మెప్పించారు. ఆమె పాత్ర పరిధి కూడా తక్కువే. సాంకేతికంగా స్క్రీన్‌ప్లే.. కెమెరా పనితనం బాగున్నాయి. నేపథ్య సంగీతం సినిమాకి అదనపు బలాన్ని చేకూర్చింది.

బలాలు
+ కథ.. కథనం
+ నటీనటులు
+ నేపథ్య సంగీతం

బలహీనతలు
– ద్వితీయార్ధంలో నిదానంగా సాగే కొన్ని సన్నివేశాలు

చివరగా.. అందరూ మెచ్చే ‘దంగల్‌’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Check Also

సమ్మెకు పిడిఎస్‌యు మద్దతు

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ, నవంబర్‌ 26న జరిగే ...

Comment on the article