Breaking News

గాంధారిలో డివిజన్‌ మార్పుపై ఉద్రిక్తత

 

గాంధారి, డిసెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాందారి మండలాన్ని కామారెడ్డిలోనే కొనసాగించాలని చేపడుతున్న దీక్షల్లో భాగంగా బుధవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా జేఏసి నాయకులు బుధవారం మద్యాహ్నం జిల్లా కలెక్టర్‌ వాహనాన్ని అడ్డుకున్నారు. వాహనం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ జేఏసి నాయకులతో మాట్లాడుతూ జిల్లాల పునర్విభజనలో భాగంగా డివిజన్‌ల ఏర్పాటు జరిగిపోయిందని, ప్రిలిమినరీ నోటిఫికేసన్‌, ఫైనల్‌ నోటిఫికేషన్‌ అనంతరమే డివిజన్లలో మండలాల చేర్పు జరిగిందన్నారు. ఈ విధంగా అధికారుల వాహనాలు అడ్డగిస్తే సమస్య పరిష్కారం కాదని, లిఖితపూర్వకంగా రాసిస్తే అధికారులకు నివేదిస్తామన్నారు. దీంతో సంతృప్తి చెందని జేఏసి నాయకులు 87 రోజులుగా దీక్షలు చేపడుతున్నా అధికారులుగాని, ప్రజాప్రతినిదులుగాని స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం తన పని తాను చేసుకుపోయిందని, ఇక దీనిపై స్పందించేది ఏమి లేదని జిల్లా కలెక్టర్‌ స్పష్టం చేసి అక్కడినుంచి వెల్లిపోయారు. అనంతరం జేఏసి నాయకులు స్థానిక తెరాస ప్రజాప్రతినిదుల వాహనాలు అడ్డుకున్నారు.

వాహనాల ఎదుట బైఠాయించి అక్కడి నుంచి వెళ్లేది లేదని ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో వాగ్వాదం చోటుచేసుకుంది. తెరాస నాయకులుతమ వైఖరి తెలియజేయాలని జేఏసి నాయకులు భీష్మించడంతో చేసేదేమి లేక వారి వాహనాలు అక్కడే వదిలి వెనుదిరిగారు. ఈ సందర్భంగా తెరాస నాయకుల వాహనంలోని టైర్లలో గాలిని జేఏసి నాయకులు తీసివేయడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకరినొకరు తోపుకొని ఘర్షనకు దిగారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య మాటల యుద్దం కొనసాగింది. తెరాస నాయకులకు ప్రజలే తగిన బుద్ది చెబుతారని జేఏసి నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శాంతియుత పోరాటంచేయాలని తెరాస నాయకులు సమాధానం ఇచ్చారు. బుధవారం దీక్షలో మండలానికి చెందిన కూరగాయల వ్యాపారులు, మెడలో కూరగాయల దండలు వేసుకొని దీక్షలో పాల్గొన్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *