Breaking News

ఉప్పు నుంచి వాట్సప్ దాకా అన్నీ అబద్ధాలే…

న్యూఢిల్లీ: ఉప్పు నుంచి వాట్సప్ దాకా… ఆర్బీఐ మొదలు ప్రధాని వరకు ఈ ఏడాది షికార్లు చేయని పుకార్లు లేవు. వాట్సప్ సహా ఇతర సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టి చివరికి ప్రసార మాధ్యమాల్లోకి వచ్చి మీడియాలో హల్‌చల్ సృష్టించాయి. యునెస్కో, ఆర్బీఐ వంటి సంస్థలతో పాటు ఇంటర్నెట్ దిగ్గజాలైన ఫేస్‌బుక్, గూగుల్ వంటి బడా కంపెనీలు పుకార్ల ధాటికి దిగివచ్చి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. సోషల్ మీడియా కంపెనీలకు అతిపెద్ద మార్కెట్‌లలో భారత్ కూడా ఒకటి. మనదేశంలో 16 కోట్ల మంది వాట్సప్ వినియోగదారులుండగా… ఫేజ్ బుక్‌లో 14 కోట్ల మంది, 2.2 కోట్ల మంది ట్విట్టర్ వినియోగదారులు ఉన్నారు. దీంతో ఎలాంటి వదంతి పుట్టినా ఝమ్మంటూ వ్యాపించి దేశం నలుమూలలకు చేరుతుంది. ఈ ఏడాది అలా వ్యాపించిన కొన్ని రూమర్లను అందరూ దాదాపు నిజమని నమ్మేశారు కూడా. 2016లో విపరీతంగా ప్రచారమైన కొన్ని రూమర్లు మీకోసం…
– ‘‘ ప్రపంచంలో ఉత్తమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని యునెస్కో కొద్ది నిమిషాల క్రితమే ప్రకటించింది. మనమంతా ప్రధానికి అభినందనలు తెలుపుదాం.. దయచేసి దీన్ని అందరికీ షేర్ చేయండి..’’ (ప్రముఖులు సైతం ఈ పుకారు నమ్మేసి షేర్ చేశారు. అలాంటి ప్రకటన ఏదీ రాలేదని తెలుసుకుని నిరాశకు గురయ్యారు)
– ‘‘ జనగణమన గీతం ప్రపంచంలోనే ఉత్తమ జాతీయ గీతంగా యునెస్కో ప్రకటించింది’’ (2008లోనే ఇలాంటి పుకారు వచ్చినా… తాము ప్రత్యేకించి ఏదేశ గేయాన్ని ఉత్తమ గేయంగా ప్రకటించలేదని వివరణ ఇచ్చింది)
– ‘‘కొత్త రూ.2వేల నోటు ప్రపంచంలోనే ఉత్తమ కరెన్సీ నోటుగా యునెస్కో ప్రకటించింది. యునెస్కో సాంస్కృతిక విభాగం హెడ్ డాక్టర్ సురభ్ ముఖర్జీ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు’’. (వేలాదిమంది వాట్సాప్ యూజర్లు దీన్ని నిజమని నమ్మి షేర్ చేసుకున్నట్టు బీబీసీ సైతం రిపోర్ట్ చేసింది)
– ‘‘నల్ల ధనాన్ని గుర్తించేలా కొత్త రూ.2 వేల కరెన్సీ నోట్లలో జీపీఎస్ చిప్ అమర్చారు’’ ( దీంతో ఆర్బీఐ కొత్త నోట్లలో సాధారణ ఫీచర్లనే వాడామని, చిప్‌లు అమర్చలేదని స్వయంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది)
– ‘‘కొత్త నోట్ల ముద్రణలో రేడియో ధార్మిక పదార్థాలను వాడారు. పెద్దమొత్తంలో రూ. 2 వేలు, రూ.500 నోట్లు ఎక్కడ ఉన్నా వెంటనే అధికారులకు తెలిసిపోతుంది.’’ (ఇది కూడా గాలివార్తేనని ఆర్బీఐ అధికారులు చెప్పారు)
– ‘‘ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తమ కార్యకలాపాల కోసం వాట్సాప్‌లోని ప్రొఫైల్ ఫోటోలను వాడుకుంటారు. వెంటనే వాటిని డిలీట్ చేయాలంటూ స్వయంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఏకే మిట్టల్ చెప్పారు. భద్రతా ప్రమాణాలు మెరుగుపర్చేదాకా 20 నుంచి 25 రోజుల పాటు అలా చేయాలని వాట్సాప్ సీఈవో కోరారు.’’ (నెటిజన్లను తీవ్ర ఆందోళనకు గురిచేసిన ఈ పుకారు కొద్ది రోజుల్లోనే వాస్తవం కాదని తేలిపోయింది. అసటు ఢిల్లీ సీపీ పేరు ఏకే వర్మ కావడంతో తప్పుడు వార్తేనని అంతా ఊపిరిపీల్చుకున్నారు.)
– ‘‘పది రూపాయల కాయిన్ చెల్లదని ఆర్బీఐ ప్రకటించింది’’ (దీనిపైగా ఆర్బీఐ స్వయంగా వివరణ ఇచ్చి పది రూపాయల కాయిన్ తీసుకోనివారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది)
– ‘‘జయలలితకు కూతురు ఉంది. ఆమె రహస్యంగా అమెరికాలో నివాసం ఉంటోంది’’ (దీనిపై ఓ ఫోటో కూడా చక్కర్లు కొట్టడంతో… సదరు యువతి కుటుంబ సభ్యులు స్వయంగా వివరణ ఇచ్చారు.)
– ‘‘దేశంలో తీవ్రంగా ఉప్పు కొరత నెలకొంది’’. (దేశం చుట్టూ 7,517 కిలోమీటర్ల మేర సముద్రతీరం ఉన్నా ఉప్పకొరత వచ్చిందంటూ పుకారు రావడంతో ఒక్కసారిగా ఉప్పు రేట్లు ఆకాశాన్నంటాయి. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, హైదరబాద్‌లపై తీవ్రప్రభావం పడింది)
– ‘‘తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం దేశప్రజలు, సంస్థలపై మర్రిచెట్టులా నిలిచిందనీ… ఇతరులను ఎదగనివ్వలేదని బీబీసీ ఇండియా బ్యూరో చీఫ్ మార్క్ టూలే వెల్లడించారు‘‘ (ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని పొగుడుతూ టూలే ఈ వ్యాఖ్యలు చేశారంటూ వచ్చిన వార్తలు పచ్చి అబద్ధమనీ.. తాను ఎలాంటి ప్రకటన చేయలేదని మార్క్ టూలే వివరణ ఇచ్చారు)

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *