Breaking News

అమెరికా వీసా బాంబు?

ఉద్యోగులు, విద్యార్థులే ట్రంప్‌ టార్గెట్‌
– ‘చట్టబద్ధ వీసా’ల పైనా
– అమెరికా అధ్యక్షుడి గురి
– వీసా నిబంధనల సమీక్ష,
– అమలు తీరుపై తనిఖీలు
– కొత్త నిబంధనలతో
– ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ సిద్ధం

ఉన్నత చదువులు, మంచి ఉద్యోగం, మంచి జీవితం.. కారణమేదైనా తొలి చూపు అమెరికావైపే.. ఎన్నో ఆశలతో అమెరికా వైపు చూసే వారందరి కలలపై ఆ దేశ కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బాంబు వేయనున్నారు. రాబోయే వారిపైనే కాదు.. ఇప్పటికే చట్టబద్ధంగా హెచ్‌1బీ, ఎల్‌1, ఎఫ్‌1 వీసాలపై వచ్చిన విదేశీయులపైనా ట్రంప్‌ దెబ్బ పడనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఏడు ముస్లిం దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశించకుండా నిషేధిస్తూ ట్రంప్‌ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికాలో విదేశీ ఉద్యోగులు, విద్యార్థుల్లోనూ భారతీయులే అధికంగా ఉన్నారు. సంబంధిత వీసా నిబంధనలను సమీక్షించటంతోపాటు ఆయా వీసాలపై వచ్చిన వారు చట్ట నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నారా లేదా అని తనిఖీ చేయాలని అంతర్గత భద్రత, కార్మికశాఖలను ఆదేశిస్తూ ఎగ్జిక్యూటివ్‌ ఉత్తర్వును ట్రంప్‌ ప్రభుత్వం సిద్ధం చేసింది.
పెరగనున్న ‘పర్యవేక్షణ’..
‘చట్టబద్ధమైన వలసలను పరిమితం చేయడం– విదేశీ కార్మిక వీసా పథకం బలోపేతం ద్వారా అమెరికా ఉద్యోగాలు, కార్మికులకు రక్షణ కల్పించడం’ అనే శీర్షికతో ఉన్న ఈ ఉత్తర్వుపై ట్రంప్‌ సంతకం చేస్తే.. విదేశీ విద్యార్థులపై అమెరికా ‘పర్యవేక్షణ’ పెరుగుతుంది. ఎల్‌1 వీసా దారులు పనిచేసే క్షేత్రాలను అమెరికా అంతర్గత భద్రత అధికారులు తనిఖీ చేసే వీలుంటుంది. హెచ్‌1బీ వీసా ఉన్న వారి జీవిత భాగస్వాములు (భర్త లేదా భార్య) అమెరికాలో ఉద్యోగం చేసేందుకు అనుమతిస్తూ ఒబామా సర్కారు తీసుకున్న నిర్ణయం రద్దవుతుంది. అంతేకాదు అమెరికాలోని భారతీయ సంస్థలు, భారత ఉద్యోగులూ ఇక్కట్లలో పడతారు. హెచ్‌1బీ వీసా పొందడం చాలా చాలా కష్టమవడంతో పాటు ఖరీదు కూడా అవుతుంది.

ప్రాక్టికల్‌ శిక్షణ కాలపరిధి తగ్గింపు..
అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న వారిలో చైనీయుల తర్వాత భారతీయులే అత్యధికులు. చదువు పూర్తయిన తర్వాత ‘వర్కింగ్‌ వీసా’అవకాశాలు మెరుగ్గా ఉండటంతో భారతీయులు అమెరికా విశ్వవిద్యాలయాలకు ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా స్టెమ్‌ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథమేటిక్స్‌) విద్యార్థులు ఐచ్ఛిక ప్రాక్టికల్‌ శిక్షణ (ఓపీటీ)ను గరిష్టంగా మూడేళ్ల వరకు పొడిగించుకునే అవకాశం ఉంది. ఈ వెసులుబాటును భారతీయ విద్యార్థులు గరిష్టంగా వినియోగించుకుంటారు. అయితే.. ఓపీటీ పొడిగింపు, కాల పరిధిని తగ్గించాలని ట్రంప్‌ సర్కారు భావిస్తోంది. అదే జరిగితే.. ప్రస్తుతం అమెరికాలో ఉన్న 1,65,918 మంది విద్యార్థుల భవిష్యత్తు ఆశలు ఆవిరవుతాయి.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *