Breaking News

పెండ్లి కుమార్తెను చేసినప్పుడు పార్వతీదేవి యొక్క కళ

పెండ్లి కుమార్తెను చేసినప్పుడు పార్వతీదేవి యొక్క కళ ఆమె సంతరించుకున్నది అని ఎలా చెప్తామో పెండ్లి కుమారుని చేసినప్పుడు పెండ్లి కుమారునకు కూడా పరమశివుని కళ ఆవాహన అవుతుంది. పెండ్లి కుమారుని చేసినప్పుడు ఆ సుముహూర్తానికి మంగళస్నానం చేయిస్తారు. తిలక ధారణ చేయించి వైదికమైనటువంటి వస్త్రాలంకారం చేసి పిల్లవాడిని కూర్చోబెట్టి పెండ్లి కుమారుని చేసినప్పుడు తప్పకుండా చేయవలసింది కులదేవతారాధన చేయాలి. ఎందుకంటే తన ఇంటికి లక్ష్మీదేవి వస్తోంది భార్య రూపంలో. తన ఐశ్వర్యం పెంపొందాలి. తను పితృఋణం నుండి విముక్తుడు అవడానికి సంతానం పొందాలి. యజ్ఞయాగాది క్రతువులు చేయాలి. ఆమె సహధర్మచారిణి. కేవలం కామపత్ని కాదు. ఆమె చేయి తాను పట్టుకుని ధర్మపథంలో ప్రయాణం చేసి తాను భగవంతుడిని చేరుకునే ప్రయత్నం చేస్తూ తనతో పాటు ఆమెను కూడా నడిపించగలిగిన దక్షత పొందాలి. ఇవన్నీ ఎవరి వల్ల సాధ్యం అంటే కులదేవత అని ఇంట్లో పరంపరాగతంగా సింహాసనంలో పూజింపబడుతున్న మూర్తి ఉంటారు. ఆయన ఎవరో ఆయన దగ్గరకు వెళ్ళి కూర్చుని షోడశోపచారాలతో పెండ్లి కొడుకు పూజ చేయాలి. భవిష్యోత్తర పురాణంలో వేంకటేశ్వర స్వామిని పెండ్లి కొడుకును చేసినప్పుడు కూడా వశిష్ఠ మహర్షి వచ్చి అడుగుతారు నీ కులదేవత ఎవరు అని. ఆయన నా కులదేవత శమీ వృక్షం అని చెప్పారు. శమీ వృక్షం అంటే పార్వతీదేవి.

పార్వతీ దేవి ఈలోకంలో శమీ వృక్షంగా ఉంటుంది. అప్పుడు పాండవ తీర్థం దగ్గరికి వెళ్ళి శమీ వృక్షాన్ని తీసుకు వచ్చి వేంకటేశ్వర స్వామి వారు కులదేవతార్చన చేసి ఆ శమీ వృక్షాన్ని పట్టుకు వెళ్ళి ఆదివరాహ స్వామి దేవాలయంలో ఉంచి తనతో పాటు పెళ్ళికి తరలిరమ్మని అడిగారు. ఆదివరాహ మూర్తి అన్నారు మీరు వెళ్ళి రండి, నేను ఇక్కడ ఉంటాను. మీ కులదేవత శమీ వృక్షం కూడా దేవాలయ ప్రాంగణంలో ఇక్కడే ఉంటుంది అని శమీ వృక్షపు శాఖని ఆ దేవాలయంలో ఉంచారు. అందుకే పెండ్లి కుమారుని చేసిన తర్వాత పెండ్లి కుమారుడు తప్పకుండా చేయవలసిన కర్తవ్యమ్ ఏమిటంటే తన తండ్రిగారు ఏ కులదేవతను సింహాసనంలో ఆరాధన చేస్తారో ఆ సింహాసనం దగ్గర కూర్చుని షోడశోపచారాలతో పూజ చేసి తత్ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకుని నోట్లో వేసుకుని చక్కగా తానుకూడా వివాహ వేదిక మీదకు వెళ్ళే లోపల తల్లిదండ్రులు, పెదతండ్రులు, పినతండ్రులు, అన్నలు, గురువు, పెద్దలు, వంటి వారికి నమస్కరించి వాళ్ళ యొక్క ఆశీర్వచనాలను పొందాలి. కులదేవతకు సంబంధించిన స్తోత్రములు ఏవి ఉంటాయో ఆ స్తోత్రములను సాధ్యం అయినంతవరకు పారాయణ చేస్తూ ఉండాలి. ఎందుకంటే వేదిక మీదకి వెళ్ళిన తరువాత అభ్యున్నతి అంతా కూడా పురుషుడి వైపు నుంచే అడుగుతారు. ఎందుకంటే ఆయనయే ఆమెకు సర్వస్వం. ఆయన అభ్యున్నతియే కుటుంబానికి అంతటికీ అభ్యున్నతి. అందుకే కులదేవత స్తోత్రములు పారాయణ చేయాలి. శక్తి కలిగిన వారైతే ఇంటికి వచ్చిన పెద్దలకు వస్త్రదానం చేయడం, ఎవరెవరికి ఎటువంటి వస్తువులు ఆయా ఋతువులు, ఆయా కాలాన్ని అనుసరించి దానం చేయగలిగినటువంటి వాటిని దానం చేయాలి. వసంతఋతువు అనుకోండి విసనకర్ర లాంటివి దానం చేస్తారు. ఇంటికి పెద్దలు వస్తే తన చేత్తో పానకం లాంటివి పట్టుకెళ్ళి పెద్దలకు ఇచ్చి అక్షతలు ఇచ్చి నమస్కరించి ఆశీర్వచనాన్ని పొందాలి. ఇటువంటి పనులు చేసిన కారణం చేత పరమేశ్వరుని కళ నిలబడి ఆయన అభ్యున్నతిని పొందడానికి కావలసినటువంటి పరిస్థితిని సంతరించుకుంటాడు. అందుకే పెండ్లి కుమారుని చేసినప్పుడు పెండ్లి కుమారుడు చేయవలసిన నియమాలుగా ఇవి చెప్పబడ్డాయి. ఊరికే పెండ్లి కుమారుని చేయడం అంటే అది ఫోటోలు, వీడియోలు వరకు పరిమితం అయిన విశేషంగా శాస్త్రాలు చెప్పలేదు.

Check Also

కనుమరుగవుతున్న పండుగలు

16.01.1   నిజామాబాద్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంక్రాంతి వచ్చిందే తుమ్మెద… సరదాలు తెచ్చిందే ...

Comment on the article