Breaking News

తప్పని మార్పు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికన్‌ కాంగ్రెస్‌ సంయుక్త సమావేశంలో చేసిన ప్రసంగం అనేకులకు నచ్చింది. ఆయన మారిన మనిషని అనేకులు తీర్మానించారు. కనీసం ఈ ఒక్కరోజైనా ఆయనలో మార్పు కనిపించిందని మరికొందరు అనుకున్నారు. అధ్యక్షప్రసంగం అనంతరం మీడియా సంస్థలు చేసిన సర్వేలో ప్రతి పదిమంది అమెరికన్లలో ఏడుగురు తమకు ఆయన ప్రసంగం తెగనచ్చేసిందని చెప్పారట. ప్రసంగ మొదట్లోనే ఆయన కూచిభొట్ల శ్రీనివాస్‌ హత్యను ఖండించడమూ, అమెరికన్‌ కాంగ్రెస్‌ రెండు నిముషాలు మౌనం పాటించడం విశేషం. శ్రీనివాస్‌ హత్య విద్వేషపూరితమైనదనీ, ఇది జాతివివక్ష హత్యేనని అధ్యక్షుడు చట్టసభలో ప్రకటించడం తెలుగువారి మనసులకు సాంత్వన కలిగించే అంశం. జాతివిద్వేష దాడులను అమెరికా వ్యతిరేకిస్తున్నదనీ, సమైక్యతను చాటిచెప్పేందుకే తాను వచ్చానంటూ వ్యాఖ్యానించిన ట్రంప్‌ రాబోయేకాలంలో తదనుగుణంగా ఎలా వ్యవహరిస్తారో చూడాలి.
శ్రీనివాస్‌ హత్యను శ్వేతసౌధం ఈ ప్రసంగానికి ముందే ఖండించింది. ఇది విద్వేష హత్యలాగే ఉన్నదనీ, జాతి, మత ద్వేషాలను అధ్యక్షుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వైట్‌హౌస్‌ ప్రతినిధి వివరణ ఇచ్చారు. ఈ హత్యపై ట్రంప్‌ ఎందుకు నోరువిప్పడం లేదంటూ అనేక సంస్థలు, ప్రజాప్రతినిధులు, మాధ్యమాలు, హిల్లరీవంటి ప్రముఖులూ ఎడాపెడా దులిపేస్తుండటంతో, యూదులపై దాడులను కూడా జోడిస్తూ కన్సస్‌ ఘటనను ట్రంప్‌ ఖండించారు. వలసదారుల అమెరికా ప్రవేశంపై తాను ఏకపక్షంగా విధించిన నిబంధనలను సడలించి కొత్త ఇమ్మిగ్రేషన్‌ ఆదేశాన్ని తేవాలని కూడా ఆయన అనుకుంటున్నారు. న్యాయస్థానాల బారినుంచి తప్పించుకోవడమే దీని పరమావధి అయినప్పటికీ, అధ్యక్షుడి వైఖరిలో వచ్చిన కొద్దిమార్పును కూడా సూచిస్తున్నది.
ఇప్పటికే వీసాలు పొందివున్నవారికి ప్రయాణ నిషేధం నుంచి మినహాయింపు ఇవ్వడం, నిషేధ జాబితానుంచి ఇరాక్‌ను తొలగించడం, క్రైస్తవ శరణార్థుల ప్రవేశానికి మాత్రమే అవకాశమిచ్చే నిబంధనలను ఎత్తివేయడం వంటి ప్రతిపాదనలు ట్రంప్‌పై అమెరికా సమాజం సాధించిన విజయమే. ఆయన తన ప్రసంగంలో మెరిట్‌ ఆధారిత ఇమ్మిగ్రేషన్‌ ప్రస్తావన కూడా చేశారు. కెనడా, ఆస్ర్టేలియా వంటి దేశాలను ఉదహరిస్తూ, దేశానికి మేలుచేకూర్చిపెట్టే ఒక కొత్త ఆలోచనగా దీనిని ప్రతిపాదించారు. నైపుణ్యం తక్కువ ఉన్నవారు దేశంలోకి వచ్చిపడుతూ, స్థానికుల ఉద్యోగ ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్న నేపథ్యంలో, ప్రతిభగలవారిని మాత్రమే అనుమతించే ఈ విధానం వల్ల లక్షలాది స్థానిక ఉద్యోగాలను కాపాడుకోవచ్చునని ఆయన అంటున్నారు. ఈ మెరిట్‌ ఆధారిత ఇమ్మిగ్రేషన్‌ విధానం వల్ల అమెరికాకు ఒనగూరే ప్రయోజనాలను అటుంచితే, దీనివల్ల భారతీయులకు కొద్దోగొప్పో ప్రయోజనం చేకూరుతుందన్న ఆశ అయితే ఉన్నది.
ఈ విధానం లోతుపాతులు ఇంకా తెలియనప్పటికీ, భారతదేశంనుంచి వలసపోయేవారు ప్రధానంగా విద్యాధికులు, నైపుణ్యం కలవారే కనుక ఇది వారికి మేలుచేయవచ్చు. ట్రంప్‌ స్వయంగానో, కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన బిల్లుల ద్వారానో హెచ్‌వన్‌బీ వీసాలపై ఆంక్షలు ఏర్పడిన ప్రస్తుత తరుణంలో, కొత్త విధానం ఆశలు రేకెత్తిస్తున్నది. ఈ విధానంలో స్వయంపోషక శక్తి కలిగినవారే దేశంలోకి అడుగుపెడతారని, అందువల్ల ప్రభుత్వ సొమ్మువారిపై ఖర్చుచేయనక్కరలేదని ట్రంప్‌ అంటున్నారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయ కుటుంబాల సగటు వార్షికాదాయం లక్షడాలర్లు ఉంటున్న నేపథ్యంలో ఈ నిబంధన పెద్ద సమస్యకాదు. ఏయే ప్రాతిపాదికల ఆధారంగా ఏటా ఎన్ని వీసాలు మంజూరు అవుతాయో, మిగతా కుటుంబీకుల విషయంలో ఏ విధమైన ఆంక్షలు అమలవుతాయన్నది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. ఈ విధానం ద్వారా లాటిన్‌ అమెరికన్‌ దేశాలనుంచి సాగే వలసలను అడ్డుకోవడమే ట్రంప్‌ అసలు లక్ష్యమైతే, వారు ప్రధాన ఓటుబ్యాంకుగా ఉన్న డెమెక్రాట్లు ఇందుకు సరేననే అవకాశాలు లేవు.
అక్రమవలసదారులను కూడా దేశంలో ఉండనిచ్చేందుకు చట్టాలు తెస్తానని హామీ ఇస్తూనే, వలసదారుల అక్రమాల కారణంగా అమెరికా ఎంతటి దురవస్థకు చేరుకుందో ట్రంప్‌ చెప్పుకొచ్చారు. అమెరికన్‌ బాధితులకోసం ప్రత్యేక కార్యాలయం ఆరంభిస్తున్నానంటూ మీడియామీద విరుచుకుపడ్డారు. మెక్సికో గోడ నుంచి ఒబామా కేర్‌ వరకూ ఎన్నికల ప్రచార కాలంనుంచి మొన్నటివరకూ ఏ వాదనలైతే చేస్తూ వచ్చారో వాటినే ఇప్పుడూ ఏకరువుపెట్టారు. అయితే నెలరోజులుగా ‘నేను’ అంటూ వీరంగం వేసిన ట్రంప్‌ ‘మనం’ అనవలసివస్తుండటమే ఆయనలో కనిపించిన ప్రధానమైన మార్పు. తన ఏకపక్ష నిర్ణయాలకు మీడియా, న్యాయస్థానాలు, సమాజం నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతున్న నేపథ్యంలో, అమెరికన్‌ కాంగ్రెస్‌తో మెత్తగా వ్యవహరించక తప్పని పరిస్థితి ఆయనది. బిల్లులు నెగ్గాలన్నా, ప్రజలకు హామీ ఇచ్చినవాటిలో కొన్నయినా నెరవేర్చుకోవాలన్నా తాను కలసికట్టుగాసాగే వ్యక్తిలాగా కనిపించక తప్పదు. విభేదాలున్న అంశాలే కాక సునాయాసంగా ఆమోదం పొందగలిగే అంశాల్లోనూ తన వైఖరికారణంగా ఘర్షణ ఏర్పడుతున్న విషయం ఆయనకు తెలిసివచ్చివుంటుంది. ఈ కారణంగానే అనేకమంది అమెరికన్లకు ఆయన ప్రసంగం విన్నతరువాత ‘అధ్యక్షుడు’ మాదిరిగా కనిపించివుంటారు. ఒక తెల్లవాడు జాత్యాహంకారంతో ఒక తెలుగువాడిని విద్వేషపూరితంగా చంపివేసిన కాన్సస్‌ ఘటనను మనస్ఫూర్తిగా ఖండిస్తున్నానని ప్రకటించిన ట్రంప్‌లో మార్పునిజమోకాదో నిశ్చయించుకోవడానికి మరికొంతకాలం వేచిచూడక తప్పదు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article