Breaking News

కొరియా దూకుడు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ ఏం చేస్తారా అని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఉత్తరకొరియా పాలకుడి మాదిరిగానే ఈయనకూ కావాల్సినంత తిక్క, దూకుడు ఉన్నాయి. సోమవారం ఉదయాన్నే ఉత్తరకొరియా ప్రయోగించిన నాలుగు ఖండాంతర క్షిపణుల్లో మూడు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి జపాన్‌ అధీనంలోని సముద్రప్రాంతంలో వచ్చిపడ్డాయి. ఒకేమారు ప్రయోగించిన ఈ మిసైళ్ళు జపాన్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్‌ (ఈఈజడ్‌)లోకి వచ్చిపడటం తనదేశానికి తీవ్రంగా హెచ్చిన విపత్తుకు సంకేతమని జపాన్‌ వ్యాఖ్యానించింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ రాగానే ఉత్తరకొరియా గతంలో ఒక మిసైల్‌ను ప్రయోగించి ఆయనకు స్వాగతం పలికింది. తాజాగా తాము ప్రయోగించిన మిసైల్స్‌ లక్ష్యం జపాన్‌లోని అమెరికా స్థావరాలేనని వ్యాఖ్యానించిన ఉత్తరకొరియాను ట్రంప్‌ ఎలా దారికి తేగలరన్నది ఆసక్తికలిగించే అంశం.

‘యుద్ధం తప్పదు, సిద్ధంగా ఉండండి’ అని తన రక్షణ బలగాలను కిమ్‌జాంగ్‌ వెంటనే ఆదేశించాడట. అమెరికా అత్యాధునిక క్షిపణి విధ్వంసక వ్యవస్థ ‘థాడ్‌’ (టెర్మినల్‌ హైఆల్టిట్యూట్‌ ఏరియా డిఫెన్స్‌) ఇప్పుడు దక్షిణకొరియాలో తిష్టవేసుకుంది. కొరకరాని కొయ్యగా తయారైన ఉత్తరకొరియాను అదుపు చేయాలంటే థాడ్‌ను మోహరించాల్సిందేనని గత ఏడాది జూలైలోనే ఒబామా నిర్ణయించారు. ఇప్పుడు పరిస్థితులు విషమించడంతో అది సోమవారం రాత్రికే హడావుడిగా చేరుకుంది. థాడ్‌ రాక చైనా ఆగ్రహాన్నీ, ఆందోళననీ మరింత పెంచింది. ఈ అత్యాధునిక వ్యవస్థ కేవలం ఉత్తరకొరియా నుంచి వస్తున్న క్షిపణులను ధ్వంసం చేయడానికే కాక, అమెరికాకు బహువిధాలుగా ఉపకరిస్తుందనీ, ఈ ప్రాంతంలో దాని ప్రాబల్యాన్ని మరింత పెంచుతుందనీ చైనా భయం. థాడ్‌ రాకను నిరసిస్తూ, అమెరికాను హెచ్చరిస్తూ చైనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కఠిన నిర్ణయాలు తప్పవని హెచ్చరించింది. ట్రంప్‌ అధ్యక్షుడైన తరువాత ఆచితూచి మాట్లాడుతూ వచ్చిన చైనా అమెరికాపై కఠిన వ్యాఖ్యలు చేసింది ఇప్పుడే. పనిలోపనిగా అది తన ఆగ్రహాన్ని దక్షిణకొరియా మీద కూడా చూపించింది. చైనీయుల దక్షిణకొరియా యాత్రలను నిషేధించింది. ‘థాడ్‌’ వ్యవస్థలోని అత్యంత కీలకభాగమైన రాడార్‌ ఏర్పాటుకు తన గోల్ఫ్‌కోర్సు భూమిని ఇచ్చినందుకు దక్షిణకొరియా కంపెనీ ‘లొట్టే’పై విరుచుకుపడింది. చైనావ్యాప్తంగా ఆరోగ్య, అగ్నిమాపకశాఖల వారు ఈ కంపెనీకు చెందిన మాల్స్‌మీద దాడులు చేసి వాటిని మూయించేశారు. క్షిపణిరాకను ముందుగా గుర్తించి, దాని విధ్వంసానికి మిగతా వ్యవస్థలను సిద్ధం చేసే ఈ రాడార్‌ తన రక్షణ రహస్యాలను పసిగట్టడానికి కూడా అమెరికాకు ఉపకరిస్తుందని చైనా అనుమానం. ఈ నిరసనతో పాటుగానే, అమెరికా ఉత్తరకొరియాల మధ్య ఉత్పన్నమైన ఉద్రిక్తస్థితిని చల్లార్చడానికి సిద్ధమని కూడా చైనా ప్రకటించింది. ఉత్తరకొరియా క్షిపణిప్రయోగాలను నిలిపివేస్తే, అందుకు బదులుగా దక్షిణకొరియా– అమెరికాలు తమ సంయుక్త సైనిక విన్యాసాలు ఆపివేయడం ఒక్కటే ఈ సమస్యకు తక్షణ పరిష్కారమని ప్రకటించింది. ‘ఒకే ట్రాక్‌మీద ఎదురెదురుగా దూసుకొస్తున్న ఈ రెండు రైళ్ళూ బ్రేకులు వేయడం లేదు, పరస్పరం దారివ్వడం లేదు’ అంటున్నారు చైనా విదేశాంగ మంత్రి. అందువల్ల తన మాట విని తక్షణ చర్యలతో ఉభయులూ దిగివస్తే, తదుపరి చర్చలతో శాంతి సాధించవచ్చునని చైనా సలహా.
ఇది జరిగేది కాదని అందరికీ తెలుసు. చైనా సహకారంతో మాత్రమే ఉత్తరకొరియాను లొంగదీయడం సాధ్యమని ఒబామా మాదిరిగానే ట్రంప్‌ కూడా విశ్వసించినట్టు ఆయన గత వ్యాఖ్యలు చెబుతున్నాయి. కానీ, ఇటీవలే ఉత్తరకొరియా శక్తిమంతమైన సాలిడ్‌ ఫ్యూయల్‌ రాకెట్‌ను పరీక్షించి, ఇది అమెరికాను బద్దలు చేసే ఖండాంతర క్షిపణి తయారీలో ముందడుగని ప్రకటించిన తరువాత ట్రంప్‌ ఇక ఊరుకోగలిగే పరిస్థితి లేదు. ‘అది జరిగేపని కాదు’ అని గతంలో తేలికగా ట్వీట్‌ చేసిపారేసిన పరిస్థితి ఇప్పుడు లేదు. ఉత్తరకొరియా చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు కనిపించడానికి చైనా ప్రయత్నిస్తున్నది. గత నెల క్షిపణిపరీక్ష అనంతరం ఆ దేశంనుంచి చైనా బొగ్గు దిగుమతులను పూర్తిగా నిషేధించింది. ఈ తరహా పరీక్షలు జరిగినప్పుడల్లా ఏవో నిర్ణయాలతో, ఆంక్షలతో చైనా తన నిరసన వెలిబుచ్చుతునే ఉన్నది. ఇవి కంటితుడుపు చర్యలేనా, తన తమ్ముడిని అదుపులోపెట్టగలిగి కూడా తన ప్రయోజనాలకోసం ఆ పనిచేయడం లేదా అన్నది వేరే అంశం. చైనానుంచి ఆశించగలిగే సహాయం ఎంతో అందరికీ తెలిసిందే. కానీ, ఉత్తరకొరియా ఇలా కొరకరాని కొయ్యలాగా వ్యవహరించడానికి అది ప్రధానంగా చెబుతున్న ఏకైక కారణం అమెరికా భయం. ఈ ప్రాంతంలో అమెరికా తన మిత్రదేశాలతో కలసివేస్తున్న ఎత్తుగడలు తన మనుగడకు ప్రమాదమని అది వాదిస్తున్నది. ఉత్తరకొరియా ధోరణి మారాలంటే ఏడేళ్లక్రితం నిలిచిపోయిన ఆరుదేశాల చర్చలు తిరిగి ఆరంభం కావాల్సిందేనని గత ఏడాది కూడా చైనా సూచించింది. 2005లో అమెరికా, చైనా, రష్యా, జపాన్‌, దక్షిణకొరియా, ఉత్తరకొరియాలు భాగస్వాములుగా ఆరంభమైన చర్చలు మూడేళ్ళ అనంతరం ఉత్తరకొరియా తనిఖీలకు నిరాకరించడంతో నిలిచిపోయాయి. అప్పటినుంచి ఆ దేశం వీరంగం వేస్తూనే ఉన్నది, ప్రపంచదేశాలు, ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు క్షిపణివిధ్వంసక వ్యవస్థను తక్షణమే మోహరించి చైనా, రష్యాల ఆగ్రహాన్ని చవిచూసిన ట్రంప్‌ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తారా, దౌత్యచర్చల ద్వారా బుజ్జగింపు మార్గాన్ని అనుసరిస్తారా అన్నది చూడాలి.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article