Breaking News

ఆన్‌లైన్‌లో నయా వ్యాపార అవకాశాలు

ఇపుడంతా ఆన్‌లైన్‌ మయయే. ఇంట్లో/స్మార్ట్‌ఫోన్‌లో నెట్‌ కనెక్షన్‌ ఉంటే చాలు. కాలు బయట పెట్టకుండానే కావలసిన వస్తు, సేవలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ నేపథ్యంలో తక్కువ పెట్టుబడితో మీకూ ఏదైనా ఆన్‌లైన్‌ బిజినెస్‌ చేయాలని ఉందా? అయితే ఈ ఐడియాలపై ఒక్కసారి దృష్టి పెట్టండి.

ఆహార వ్యాపారం

దేశంలోని ప్రధాన నగరాల్లో ఆన్‌లైన్‌ ఆహార వ్యాపారం క్రమంగా ఊపందుకుంటోంది. ఉద్యోగాలు చేసే చాలా మందికి ఇంట్లో వండుకునే తీరిక ఉండడం లేదు. దీంతో ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చి కోరిన టైమ్‌కి పసందైన వంటకాలు ఇంటికే తెప్పించుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. వీకెండ్స్‌లో బయటికి వెళ్లి ఏ రెస్టారెంట్‌లోనో భారీగా సొమ్ము తగలేసే బదులు మంచి ఆన్‌లైన్‌ ఫుడ్‌ బజార్‌ నుంచి చౌకగా పసందైన వంటకాలు తెప్పించుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ ఆన్‌లైన్‌ ఆహార వ్యాపారం కోసం పెద్దగా పెట్టుబడి కూడా అవసరం ఉండదు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌, సూరత నగరాల్లో సేవలు అందిస్తున్న డెల్ఫూ.కామ్‌లా సిటీలోని మంచి హోటల్స్‌, రెస్టారెంట్లతో టై అప్‌ పెట్టుకుని ఈ బిజినెస్‌ ప్రారంభించవచ్చు. లేదా మీకే మంచి పాకశాస్త్ర నైపుణ్యం ఉంటే సొంత కిచెన్‌ నుంచీ ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు. కాకపోతే మీ కిచెన్‌లో సరైన శుభ్రత పాటిస్తున్నారనేందుకు గుర్తుగా ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఎఐ) నుంచి ముందుగా లైసెన్సు తీసుకోవాలి. చక్కగా వెబ్‌సైట్‌ డిజైన్‌ చేయించుకుని ఆన్‌లైన్‌లోనే ఆర్డర్లు తీసుకుని కావలసిన వంటకాలు రుచిగా, శుచిగా డెలివరీ చేయగలిగితే ఈ వ్యాపారంలో మంచి లాభాలు కళ్లజూడవచ్చు. ఫుడ్‌పాండా.కామ్‌, హైదరాబాద్‌కు చెందిన కిచెన్‌ఫుడ్స్‌.కామ్‌ కూడా ఆన్‌లైన్‌లో మంచి ఆహార వ్యాపారం చేస్తున్నాయి. నెట్‌ వేగంగా వ్యాపిస్తున్నందున మున్ముందు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లోనూ ఈ వ్యాపారం ఊపందుకుంటుందని అంచనా.

టాక్సీ బుకింగ్‌..

నెట్‌ పుణ్యమాని ఆన్‌లైన్‌ క్యాబ్‌ బుకింగ్‌ సేవలకూ ఇటీవల డిమాండ్‌ పెరుగుతోంది. ప్రధాన నగరాల్లో ఉబెర్‌, ఓలా సంస్థలు ఎంతగా ఎదిగినా మంచి సర్వీస్‌ అందజేయగలిగితే చిన్న చిన్న ఆన్‌లైన్‌ టాక్సీ బుకింగ్‌ సంస్థలకూ మంచి వ్యాపార అవకాశాలున్నాయి. కాకపోతే కస్టమర్‌ కోరిన చోటికి సకాలంలో కోరిన టాక్సీ లేదా కారు పంపించాలి. ఈ వ్యాపారంలో సమయ పాలనతోపాటు ఎక్కువ కార్లు ఉన్న వ్యక్తులు, సంస్థలతో మంచి సంబంధాలు కూడా అవసరం. ఆన్‌లైన్‌ టాక్సీ బుకింగ్‌ వ్యాపారానికి బుక్‌మైక్యాబ్‌.కామ్‌ చక్కటి ఉదాహరణ. ఈ సంస్థ హైదరాబాద్‌తో పాటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో తన సేవలు అందిస్తోంది. హైదరాబాద్‌లో ఇప్పటికే జీక్యాబ్స్‌, డాట్‌క్యాబ్స్‌, ఈజీక్యాబ్స్‌ పేరుతో పలు అన్‌లైన్‌ బుకింగ్‌ సంస్థలు వెలిశాయి. ఈ సంస్థలు ఎయిర్‌పోర్టు డ్రాపింగ్‌ మొదలుకుని యానివర్సిరీ, బర్త్‌డే, మ్యారేజ్‌ వంటి సందర్భాలకూ కావలసిన ప్రత్యేక సేవలు అందిస్తున్నాయి. కొద్ది పాటి పెట్టుబడితో చిన్న చిన్న నగరాలు, పట్టణాల్లోనూ ఇలాంటి సర్వీసులు ప్రారభించవచ్చు.

గ్రంధాలయం

నెట్‌ ఎంతగా వ్యాపించినా పుస్తకాలు చదివే వారికి ఇప్పటికీ కొదవ లేదు. మీకు మంచి పుస్తక పరిజ్ఞానం ఉంటే ఆన్‌లైన్‌ బుక్‌ లైబ్రరీ వ్యాపారం ప్రారంభించవచ్చు. ఎక్కువ మందికి నచ్చే పుస్తకాలను ఎప్పటికపుడు కొని వెబ్‌సైట్‌లో ప్రదర్శనకు పెట్టాలి. ఆన్‌లైన్‌లో సభ్యులను చేర్చుకుని పుస్తకానికి ఇంత లేదా నెలకు ఇంత అని చందా కట్టించుకుని వారికి ఆ పుస్తకాలు అవసరాన్ని బట్టి ఇంటి దగ్గరే అందించాలి. ఈజీలిబ్స్‌, జస్ట్‌బుక్స్‌సిఎల్‌సి వంటి సంస్థలు ఇప్పటికే హైదరాబాద్‌తోపాటు పలు నగరాల్లో ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా సభ్యులకు పుస్తకాలను అద్దెకు ఇస్తున్నాయి.

అద్దెకు బొమ్మలు

ఆన్‌లైన్‌లోనూ పిల్లల ఆట వస్తువులను అద్దెకు ఇవ్వవచ్చు. బొమ్మలు, పిల్లల ఆట వస్తువుల మీద ఆసక్తి ఉన్న వారికి ఈ వ్యాపారం బాగా సూటవుతుంది. చేయాల్సిందిల్లా పెద్ద సంఖ్యలో బొమ్మలు, ఇతర ఆట వస్తువులు కొనుగోలు చేసి వాటిని ఆన్‌లైన్‌లో పెట్టాలి. సభ్యులుగా చేరిన వారికి వాటిని అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం పొందవచ్చు. ఇందుకోసం నెల నెలా, మూడు నెలలకు ఒకసారి లేదా ఏడాదికి ఒకసారి సబ్‌స్ర్కిప్షన్‌ వసూలు చేసుకోవచ్చు. పిల్లల వయసుకు తగ్గట్టు బొమ్మలు అద్దెకు ఇవ్వడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. రెంటాయి్‌స.ఇన్‌, టాయి్‌స-ఆన్‌-రెంట్‌.కామ్‌ వంటి ఆన్‌లైన్‌ టాయ్‌ రెంటింగ్‌ కంపెనీలు ఇప్పటికే హైదరాబాద్‌తో సహా పలు నగరాల్లో ఈ తరహా సేవలు అందిస్తున్నాయు.

బస్‌ టిక్కెట్‌ బుకింగ్‌..

ఆన్‌లైన్‌ బస్‌ టిక్కెట్ల బుకింగ్‌ వ్యాపారానికి మంచి భవిష్యత ఉంది. ఈ రంగంలో ఇప్పటికే అభిబ్‌స.కామ్‌, రెడ్‌బ్‌స.కామ్‌ పాతుకుపోయాయి. రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలతో పాటు, వివిధ నగరాల మధ్య బస్‌ సర్వీసులు నడిపే సంస్థలు ఇప్పటికే తమ సొంత ఆన్‌లైన్‌ టిక్కెట్ల బుకింగ్‌ వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నాయి. అయినా బస్‌ ఆపరేటర్లు, ట్రావెల్‌ ఏజెన్సీలతో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తులు కొద్దిపాటి పెట్టుబడితో ఆన్‌లైన్‌ బస్‌ టిక్కెట్ల బుకింగ్‌ వ్యాపారం ప్రారంభించవచ్చు.
ఇవేకాదు.. ఆన్‌లైన్‌లో ప్రారంభించడానికి మీ దగ్గర ఏదైనా మంచి బిజినెస్‌ ఐడియా ఉంటే పెట్టుబడుల మద్దతు నిచ్చే సంస్థలూ అనేకం ఉన్నాయి.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article