
నన్ను కాపాడి ఇండియాకు చేర్చండి సార్..: సౌదీలో తెలుగు మహిళ
దుబాయ్‌కి పంపుతామని చెప్పి ఏజెంట్ల చేతిలో మోసపోయి సౌదీలో బందీ అయిన ఓ అభాగ్యురాలి ధీనగాథ ఇది. ఆమె సౌదీ నుంచి ఫోన్లో ఆంధ్రజ్యోతితో తన గోడు వెళ్లబోసుకుంది. ఆమె గోడు వింటే ఎవరికైనా కన్నీటి పర్యంతం కాక తప్పదు. ఆమె ధీనగాథ ఇలా… సౌదీ నుంచి ఫోన్లో హలో సార్, నమస్తే సార్, నా పేరు సుబ్బలక్ష్మి సార్. మాది మాధవరం-1, గ్రామం, సిద్ధవటం మండలం, కడప జిల్లా. ఇది నా పాస్‌పోర్టు సార్. నన్ను దుబాయ్కని తీసుకొచ్చి సౌదీలో పెట్టిన్రు సార్. నా పరిస్థితి బాగాలేదు సార్. సేట్ దగ్గర డబ్బు తీసుకొని నన్ను సౌదీకి పంపించినారు సార్. నా పరిస్థితి బాగాలేదు సార్. మోసం చేసి నన్ను ఇక్కడ సౌదీలో పెట్టినారు సార్. నా పాస్‌పోర్టు చూడండి సార్. మా ఇంటి అడ్రసు, మేముండే ఇంటి నెంబరు ఇదీ. ఏజెంట్ మక్తబ్ నెంబర్ సార్ ఇది – 09892304331. ఈ ఏజెంట్ బ్యాంకు నెంబర్, జాకీరుల్లా ఐసీఐసీ0001071, 09029398943, 09930972047. నా పరిస్థితి చూడండి సార్ మీకు పుణ్యం ఉంటాది సార్.
దుబాయకని తీసుకొచ్చి సౌదీలో పెట్టినారు సార్. నాకు మెడికల్‌గా బాగా లేదంట సార్. ఇదిగో ఇది నా మెడికల్ రిపోర్ట్ కూడా చూపించా సార్. రక్తంలో ఫాల్ట్. నా గుండెల్లో బాగాలేదంట, ఎక్స్‌రేలో వచ్చింది సార్. ఇక్కడ రూములో పెట్టినారు. నాకు తినేదానికి లేకుండా, తాగేదానికి లేకుండా, బాత్రూములో పెట్టి. ఏజెంటు వెంకటేషు, జిలాన్, వలీ వీళ్ళు ముగ్గురూ సార్ నన్ను తీసుకొచ్చింది. నన్ను చూసి అందరూ దూరం పోతున్నారు సార్. ముక్కులకు గుడ్డకట్టి నా రోగం వాళ్ళకొస్తాదనీ, రూములో పెట్టినారు సార్. దయచేసి నన్ను కాపాడండి సార్, మీకు పుణ్యం ఉంటాది. రెండు లక్షలు డబ్బులు తీసుకున్నారంట సార్. ఏజెంట్ చేతికి ఇవ్వలేదంట. రెండు లక్షలిస్తే నన్ను ఇండియాకు పంపిస్తానంటున్నారు సేట్. మీకు దండం పెడతా, మీ కాళ్ళు పట్టుకుంటా సార్ కాపాడండి సార్. నన్ను కాపాడండి సార్, ఇండియాకు చేర్చండి సార్. ఏజెంట్లు వెంకటేషు, జిలాన్, వలీ ఫోను చేసి అడిగితే ఏమైనా చేసుకోపో మాకు సంబంధం లేదంటున్నారు. మా భర్త ఫోను చేసి అడిగితే నెవ్వవరో మాకు తెలియదు అంటున్నారు సార్.
నాకు న్యాయం చేసి కాపాడండి సార్. తిండీ నీళ్ళు లేకుండా, బాత్ రూంలో నీళ్ళు తాగతున్నా, ప్లేటు కడుక్కొని తింటున్నాను. పోలీసులూ, ఎస్‌ఐలూ కాపాడండి… తండ్రీ మీకు పుణ్యం ఉంటాది సార్. నా బిడ్డలు దిక్కులేనోళ్ళు అయిపోతారు సార్. నన్ను ఏజెంటు మోసం చేసి ఇక్కడ పెట్టిండు సార్. నన్ను కాపాడండి. సిద్ధపటం మండలంలో కేసు పెడితే పోలీసోళ్ళు రమ్మంటే ఏజెంటు పోలేదంట సార్. మా భర్తకు ఏజెంటు పలకడం లేదు సార్. సేఠుకు రెండు లక్షలు కడితే నాకు టికెట్టు తీసి పంపిస్తాడు సార్. ఈ బాధ నేను పడలేను, గుండెల్లో నొప్పి, కడుపులో నొప్పి నేను తట్టుకోలేకుండా. వారం నుంచి జ్వరమూ తిండి లేదు. నన్ను చూసేవాళ్ళెవరూ లేరు. దిక్కులేనిదాన్నైయి పోయాను. నా భర్తకు బాగలేదు, యాక్సిడెంట్ అయి అప్పులు తీర్చుకోలేక ఇట్లా వచ్చినా. ముగ్గురు పిల్లోళ్ళు. ఒక కుంటి పిల్లోడున్నాడు. కాపాడండి మీరు మీ బిడ్డలు చల్లగా ఉంటారు రక్షించండి సార్. చిన్న చిన్న పిల్లలున్నారు. నా పిల్లలు దిక్కులేనోళ్ళయినారు.
నా భర్తకు మూడు సార్లు ఆపరేషన్లయినాయి. వలీ ఫోను చేసి ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నాడు. ఇది నా మొగుడి నెంబరు .. 99666 35604 ఫోను చేసి కనుక్కోండి సార్. దయచేసి రక్షించండి. నన్ను ఇండియాకు నా బిడ్డల దగ్గరికి చేర్చండి. నేను ఇక్కడుంటే చచ్చిపోతాను సార్. ఇంత డబ్బు తీసుకొని ఇవ్వడం లేదు. నాలుగు నెలల నుంచి రూములో పెట్టినారు. నా పాస్‌పోర్టు, మెడికల్ రిపోర్టు, బ్యాంకు నుంచి డబ్బు ఇచ్చిన నెంబర్ పేపర్లు ఇవే. ఏజెంటు చేత డబ్బు కట్టివ్వండి సార్. నేను ఇంటికొస్తా సార్. ఏజెంటును పట్టుకోని లెక్క కట్టియ్యండి సార్. చేతులు జోడించి అడుగుతున్నా. ఏజెంట్లు వెంకటేషు, జిలాన్, వలీ నన్ను అన్యాయం చేసినారు. నా మీద దయ ఉంటే కాపాడి ఇండియాకు చేర్చండి సార్. అని ధీనంగా వేడుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి..
సిద్దవటం మండలం మాధవరం-1లోని లక్ష్మీపురానికి చెందిన పేరూరు సుబ్బలక్షుమ్మ తన భర్త పెంచలయ్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో జీవనం సాగిస్తుండేది. కూలి పని చేసే పెంచలయ్య గతంలో ప్రమాదానికి గురై ఏ పనీ చేసేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో కుటుంబ పోషణ భారం సుబ్బలక్షుమ్మ మీద పడింది. పిల్లలను భర్తను పోషించుకునేందుకు విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇదే సమ యంలో మాధవరానికి చెందిన వెంకటేష్, గౌస్‌పీర్ అలియాస్ ఫకృద్దీన్ ఆమెను కలిసి దుబా య్‌లో మంచి ఉద్యోగం ఉందని బాగా సంపాదించుకోవచ్చ ని నమ్మబలికారు. ఎర్రగుంట్లకు చెందిన వలి అనే ఏజెంటు ద్వారా దుబాయ్‌కి పంపుతామని అందుకు రూ. 80 వేలు చెల్లించాలని చెప్పారు. వారి మాటలు నమ్మిన సుబ్బలక్షుమ్మ డబ్బులు చెల్లించింది.
గత సంవత్సరం డిసెంబర్ చివరిలో ఈ ఏజెంట్లు ఆమెను దుబాయ్‌కు అని చెప్పి సౌదీ అరేబియాకు పంపారు. అక్కడ ఓ సేట్ ఇంటిలో వంటమనిషిగా ఆమెను నియమించేందుకు ఒప్పందం చేసుకుని సేట్ నుంచి ముందస్తుగా డబ్బు తీసుకున్నారు. చదువురాని సుబ్బలక్షుమ్మ దుబాయ్ కాకుండా సౌదీ అరేబియాకు పంపినా తెలుసుకోలేక నేరుగా ఉన్న అడ్రస్ ద్వారా ఆ సేట్ ఇంటికి వెళ్ళింది. అయితే ఆ సేట్ తన వద్ద ఏజెంటు తీసుకున్న రూ. 2.50 లక్షలు చెల్లిస్తే తిరిగి ఇండియాకు పంపిస్తానని, అంత వరకూ ఇక్కడే ఉండాలని హుకూం జారీ చేశారు. అంతే కాకుండా ఆమెను ఓ గదిలో బందీగా చేశారు.
మూడు, నాలుగు నెలలు ఎటువంటి సమాచారం లేకపోవడంతో పెంచలయ్య పలువురితో ఈ విషయం చెప్పుకుంటూ వచ్చా డు. చివరకు సుబ్బల క్షుమ్మే వాట్సాప్ ద్వారా తన ఇబ్బం దులను భర్తకు చేర వేసింది. దీంతో ఆయన సిద్దవటం పోలీసులను ఆశ్రయిం చారు. అనంతరం ఎస్పీని కలిసి వివరాలు వెల్లడించడంతో వెంటనే కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో సిద్దవటం ఎస్ఐ అరుణ్‌రెడ్డి కేసు నమోదు చేశారు. ఒంటిమిట్ట సీఐ ఆదేశాల మేర ఏజెంట్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈలోగా ఆ సేట్‌కు డబ్బు పంపి ఆమెకు విముక్తి కలిగించారు. ఆమె ఆదివారం సౌదీ నుంచి ఇండియాకు బయలు దేరింది. సోమవారం తెల్లవారు జామున భారత్‌కు చేరుకోవచ్చని తెలిసింది. కాగా హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎస్ఐ అరుణ్‌రెడ్డి, సిబ్బంది సహా పెంచలయ్య కూడా వెళ్లారు.
ఏజెంట్ల కోసం గాలిస్తున్నాం
సౌదీలో బందీ అయిన సుబ్బలక్షుమ్మకు విముక్తి కలిగించామని, మోసం చేసిన ఏజెంట్ల కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఒంటిమిట్ట ఇన్స్పెక్టర్ రవికుమార్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. సుబ్బలక్షుమ్మను హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి తీసుకొచ్చేందుకు సిద్దవటం ఎస్ఐ, ఇద్దరు సిబ్బంది వెళ్లారన్నారు.
The following two tabs change content below.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- బోధన్ ప్రాంత ప్రజలు అలర్ట్ - April 19, 2021
- రెండు రోజుల్లో ఇద్దరి మృతి - April 19, 2021
- ఎక్కడివక్కడే… ఏమిటివి… - April 19, 2021