
- ప్రేమ జంటల మద్య విభేదాలు
- పెటాకులవుతున్న ప్రేమ పెళ్లిళ్లు
- పరస్పర నమ్మకం కోల్పోవడంతో స్పర్థలు
- తల్లిదండ్రుల సహకారం లేక ఇబ్బందులు
- పెళ్లయిన ఏడాదికే విడిపోతున్న జంటలు
పీకల్లోతు ప్రేమలో పడతారు. కుల,మత, ప్రాంత, ఆర్థిక భేదాలను అస్సలు పట్టించుకోరు. ఒకరికొకరం ఉంటే చాలనుకుంటారు. పెద్దలను ఎదిరిస్తారు. ఫ్రెండ్స్‌ని ఆశ్రయిస్తారు. పోలీసుల సమక్షంలో దండలు మార్చుకుంటారు. ప్రేమికులు కాస్తా దంపతులయ్యాక అలకలు, అనుమానాలు, ఆగ్రహాలు పొడసూపుతాయి. ఏడాది తిరగకముందే ప్రేమ పెళ్లి .. పెటాకులకు దారితీస్తోంది.
కన్నవారికి కాదనుకుని పెళ్లి చేసుకుంటున్న ప్రేమ జంటల ముచ్చట మూణ్ణాళ్లే అవుతోంది. స్నేహితుల సహకారంతో, పోలీసుల సాయంతో మార్చుకున్న పూలదండలు వాడిపోయే లోపే దాంపత్య జీవితంలో ఓడిపోతున్నారు. పెళ్లయిన ఏడాదికే పెటాకులకు దారితీస్తున్న కేసులు మహానగరంలో ఎక్కువ అవుతున్నాయి. మహిళా పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసులే దీనికి నిదర్శనం.ఫిర్యాదుల్లో ప్రేమజంటలవే ఎక్కువ ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న జంటలు కొద్దిరోజుల్లోనే గొడవలకు దిగుతున్నారు. చిన్న చిన్న విషయాలను కూడా పెద్దవి చేసుకుని..తాము దండలు మార్చుకున్న పోలీ్‌సస్టేషన్ మెట్లెక్కుతున్నారు. నార్త్ జోన్ పరిధిలోని బేగంపేట పేట మహిళా పోలీస్ స్టేషన్లో జనవరి నెలలో 81 ఫిర్యాదు నమోదు కాగా, ఇందులో ప్రేమ పెళ్లి చేసుకున్న జంటల ఫిర్యాదులు 21 ఉన్నాయి. ఫిబ్రవరిలో నమోదైన 72 ఫిర్యాదుల్లో 25 ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నవారే. నగరంలోని మహిళా పోలీ్సస్టేషన్లలో రోజూ ఇటువంటి ఫిర్యాదులు నమోదవుతున్నాయి. వీటిలో తొంభైశాతం మంది విడిపోతుండగా కేవలం ఒక శాతం వారు కలిసి ఉండేందుకు ఇష్టపడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.
మహిళా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన కొన్ని ఫిర్యాదులు..
అతను ఆమెకు బస్టాప్‌లో పరిచయమయ్యాడు.. ప్రేమిస్తున్నానన్నాడు. పెద్ద ఉద్యోగం చేస్తున్నానని నమ్మించాడు. తీరా పెళ్లయ్యాక ఉద్యోగం లేదని తెలియడంతో బోయిన్ పల్లికి చెందిన ఓ మహిళ తాను మోసపోయానంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
- అబ్బాయి సాఫ్ట్వేర్… అమ్మాయి ప్రభుత్వ ఉద్యోగి … వారి పరిచయం ప్రేమగా మారి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. అనంతరం భర్త కుటుంబ సభ్యులు వేధించడం మొదలుపెట్టారు. భర్త పట్టించుకోక పోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
- ఒకే ఆఫీసులో పనిచేసే వారిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకు చాటింగ్ చేయొద్దు. ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావంటూ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. తనను టార్చర్ పెడుతున్నాడంటూ భార్య మహిళాపోలీ్సస్టేషన్లో ఫిర్యాదు చేసింది.
- ఫేస్బుక్లో పరిచయం.. కులాలు వేరు.. పెద్దలు వద్దన్నా రు.. అయినా కలిసి బతకాలనుకున్నారు.. కొద్ది రోజులకు ఆర్థిక ఇబ్బందులు రావడంతో భార్యను వదిలేసి వెళ్లిపోయాడు.. న్యాయం కోసం పోలీసుల వద్దకు వచ్చిందామె.
- ఆఫీసులో వారి పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరి మతాలు వేరుకావడంతో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లకు అబ్బాయి కుటుంబ సభ్యులు అమ్మాయిని వేధించడంతో భర్తకు చెప్పింది. అయినా భర్త పట్టించుకోక పోవడంతో న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే వారిని కౌన్సెలింగ్ కోసం భరోసా సెంటర్‌కు పంపించారు.
- ఒకే వీధిలో ఉండేవారు ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోయినా పెళ్లిచేసుకున్నారు. చిన్న ఉద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, పెద్దలు పట్టించుకోకపోవడంతో గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో తాగుడుకు బానిసైన భర్త వేధింపులు ఎక్కువయ్యాయి. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఉన్నత విద్యావంతులే అధికం
మహిళా పోలీస్ స్టేషన్‌కి వస్తున్న ప్రేమపెళ్లి జంటల ఫిర్యాదుల్లో ఉన్నత విద్యావంతులే అధికంగా ఉన్నారని కేసులు స్పష్టం చేస్తున్నాయి. ఐటీ ప్రొఫెషనల్స్, డాక్టర్లు ఉన్నతోద్యోగులు దాంపత్య జీవితంలో కలతలపై ఫిర్యాదులు ఇస్తున్నారు.
పెద్దల వల్లే..
పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న జంటల మధ్య విభేదాలు వస్తే..ఇరువైపుల కుటుంబ సభ్యులు పట్టించుకోవడంలేదు. మరికొందరు పెద్దలు సరిదిద్దాల్సిందిపోయి..వివాదాలను పెద్దవి చేస్తున్నారు. దీంతో దంపతులు విడిపోతున్నారు. కులమత, ఆర్థిక అంతరాలను ఎత్తిచూపుతూ విభేదాలకు పెద్దలు ఆజ్యం పోయడంతో విడాకులకు దారితీస్తున్నాయి.
అనుమానం..పెనుభూతం
ప్రేమపెళ్లి చేసుకున్న వాళ్లలో ఎక్కువ మంది మధ్య విభేదాలు కేవలం అనుమానం కారణంగానే వస్తున్నాయి. ఆఫీసులో కొలీగ్స్ క్లోజ్‌గా ఉండడంతో ఆరంభమయ్యే అనుమానం పెనుభూతమై విడిపోయే దాకా దారితీస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, వ్యసనాలు, కులాంతరాల వల్ల మరికొందరు దంపతుల మధ్య పొరపొచ్చాలు వస్తున్నాయి.
పోలీస్ పెద్దలు
ప్రేమించుకుని పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న ఈ జంటల మధ్య విభేదాలొస్తే.. ఇరువైపుల పెద్దలు పట్టించుకోరు. దీంతో తమవద్దకు వచ్చిన దంపతులను పోలీసులే పెద్దల్లా వ్యవహరించి వివాదం సద్దుమణిగేందుకు కృషి చేస్తున్నారు. భర్తలు వేధిస్తున్నారంటూ మహిళా పోలీసులను కలిసి బాధ వెళ్లబోసుకున్న వారికి ఇక్కడ సిబ్బంది మేమున్నామంటూ భరోసా ఇస్తారు. భార్య, భర్తలను ప్రత్యేక గదిలో కూర్చో బెట్టి మాట్లాడతారు. ఇరువురి సమస్యలు తెలుసుకుని కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తారు.
కులం కుంపట్లు
వాళ్లిద్దరివీ వేర్వేరు కులాలు. ఆఫీసులో పరిచయం ప్రేమగా మారింది. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. అమెరికా వెళ్లిపోయారు. బిడ్డ కడుపున పడటంతో కన్నవారింటికి వచ్చింది. ఇప్పుడు భర్త వద్దకు వెళ్లనంటూ మహిళా పోలీసులను ఆశ్రయించింది. ప్రేమకు లేని కులం పెళ్లయ్యేసరికి అడ్డొచ్చింది.
పెళ్లయ్యాక ప్రేమ మాయం
ఇద్దరూ ఒకే ఆఫీసులో పనిచేస్తారు. సాన్నిహిత్యం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. వేరుకాపురం పెట్టారు. ఆరునెలలు తిరక్కముందే ప్రేమించి పెళ్లాడిన భర్త మోజు తీరింది. మొహం చాటేశాడు. ప్రేమ పేరుతో తనను మోసగించాడని, తన కాపురం నిలబెట్టాలని పోలీసులను ఆశ్రయించిందామె.
భరోసా ఇస్తాం
ప్రేమ పెళ్లి చేసుకుని కలిసి ఉండలేమని భరోసా సెంటర్‌కు వచ్చే వారి సమస్యలను ముందుగా తెలుసుకుంటాం. గొడవకు కారణాలు అడుగుతాం. అన్నీ తెలుసుకున్నాక వారికి కౌన్సెలింగ్ ఇస్తాం. వివాదాలకు కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కారణమని తెలిస్తే వారినీ పిలిచి మాట్లాడతాం. మూడుసార్లు కౌన్సెలింగ్ ఇస్తాం. కొందరు రాజీ పడతారు. మరి కొందరు సమయం అడుగుతారు. ఇంకొందరు విడిపోతామని తేల్చేస్తారు. సికింద్రాబాద్‌లోని భరోసా సెంటర్‌కు రోజూ 5 నుంచి 10 జంటలు కౌన్సెలింగ్ కోసం వస్తాయి. కవిత, భరోసా సెంటర్ ఇన్చార్జి,
షీ టీమ్స్ ఏసీపీ
వివాహ వ్యవస్థను గౌరవించాలి
భారతీయ వివాహ వ్యవస్ధ చాలా గొప్పది. దానిని గౌరవించాలి. భార్యాభర్తల మధ్య ఏర్పడే చిన్న చిన్న వివాదాలను చర్చించుకొని పరిష్కరించుకోవాలి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ముందుకు సాగితే సంసారం సాఫీగా సాగుతుంది. మాదగ్గరకు వచ్చే వారికి కౌన్సెలింగ్ నిర్వహించి వారు కలిసుండేలా చూస్తాం. పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వారు ఏడాదిలోపే విడిపోతామంటూ వస్తున్నారు. ఇటీవల ఈ తరహా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. పెద్దలు కల్పించుకుని వీరిని ఒకటి చేసేందుకు కృషి చేయాలి. జానకమ్మ, ఇన్స్పెక్టర్,
బేగంపేట మహిళా పోలీ్‌సస్టేషన్
ప్రేమకు పెద్దల ఆశీర్వాదం ఉంటే..
ప్రేమించి పెళ్లి చేసుకొన్నవాళ్లు.. కొన్నాళ్లకు కలిసి ఉండలేమని మా వద్దకు వస్తుంటారు. ప్రేమ పెళ్లిళ్లకు పెద్దల సహకారం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, అనుమానం, ఇగోలతో సమస్యలు వస్తాయి. కొందరు కౌన్సెలింగ్‌కు వెళితే, మరికొందరు పోలీ్‌సస్టేషన్లను ఆశ్రయిస్తారు. ఇంకొందరు ఆత్మహత్యాయత్నాలకు కూడా పాల్పడుతుంటారు. ప్రేమించుకునేవారు ఇరువైపుల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం మంచిది. ఈ మధ్య పురుషులకు కూడా సపోర్టింగ్ సిస్టమ్స్ అందుబాటులో ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలను పెద్దగా చేసుకుని, ఉద్రేకాలకు గురై విడిపోవడం మంచిది కాదు.
డాక్టర్ ఆఫ్తాబ్, సైకియాట్రిస్ట్,
గ్లెనిగల్స్ గ్లోబల్ ఆస్పత్రి
వివాదాలకు కారణాలివే..
- ఆర్థిక సమస్యలు
- ప్రేమ తగ్గడం
- అనుమానం
- అసూయ
- ఇగో
- మాట పట్టింపులు
- లైంగిక వేధింపులు
- వరకట్నం
- కులమత భేదాలు
- ఆంక్షలు విధించుకోవడం
- తల్లిదండ్రుల ప్రమేయం
The following two tabs change content below.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- బోధన్ ప్రాంత ప్రజలు అలర్ట్ - April 19, 2021
- రెండు రోజుల్లో ఇద్దరి మృతి - April 19, 2021
- ఎక్కడివక్కడే… ఏమిటివి… - April 19, 2021