Breaking News

చుక్కలు చూపిస్తున్న ఓలా డ్రైవర్‌

  • ఓలాకు ఫోన్‌ చేసి.. మొబైల్‌ ఆఫ్‌ చేసి… రోజుకో సిమ్‌ మారుస్తూ ఒక్కోచోట నుంచి ఫోన్‌
  • సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులకే సవాల్‌
  • 9 రోజులవుతున్నా దొరకని శ్రీకాంత్‌ జాడ
న్యూఢిల్లీ, గద్వాల: పోలీసింగ్‌లో నంబర్‌వన్‌ అంటే ఢిల్లీ పోలీసులని చెబుతారు. అంతటి పోలీసులకే ఓ ఓలా డ్రైవర్‌ చుక్కలు చూపిస్తున్నాడు. ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. తూర్పు ఢిల్లీ జిల్లాలోని 90 శాతం మంది పోలీసులు కేవలం గద్వాలకు చెందిన డాక్టర్‌ శ్రీకాంత్‌ను కిడ్నాప్‌ చేసిన ఓలా డ్రైవర్‌ను పట్టుకునే పనిలోనే ఉన్నారంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయినా, తొమ్మిది రోజులుగా చిన్న క్లూ కూడా వారికి లభించలేదు. కిడ్నాపర్‌కు సంబంధించి చిన్న సమాచారం కూడా సంపాదించలేకపోయారు.
కిడ్నాపర్‌ ఫోన్లో పోలీసులతో మాట్లాడుతున్నాడు. కానీ, తన ఆనుపానులు మాత్రం వారికి చిక్కనివ్వడం లేదు. ‘కిడ్నాపర్‌ మాకంటే చాలా స్మార్ట్‌గా ఆలోచిస్తున్నాడు’ అని సాక్షాత్తూ ఈ కేసును పర్యవేక్షిస్తున్న తెలుగు పోలీసు అధికారి ఏసీపీ రాహుల్‌ వ్యాఖ్యానించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మొబైల్‌ సిగ్నల్‌, జీపీఎస్‌ వంటివేవీ దొరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని వివరించారు. శ్రీకాంత్‌కి ఏమీ కాకుండా ఉండేందుకే తాము ఆచితూచి అడుగు వేస్తున్నామన్నారు.
ఓలా డ్రైవర్‌.. క్రిమినల్‌ మైండ్‌
ప్రొఫెషనల్‌ క్రిమినల్‌ తరహాలో ఓలా డ్రైవర్‌ తీరు ఉందని పోలీసు ఉన్నతాధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు ఉదాహరణలనూ చెబుతున్నారు. ఒక్కో రోజు ఒక్కో ప్రాంతం నుంచి ఓలా సంస్థతో మాట్లాడుతున్నాడు. ఆ వెంటనే అందులోని సిమ్‌ తీసేస్తున్నాడు. నిందితుడు ఉన్న ప్రాంతాన్ని పోలీసులు గుర్తించేలోపే అక్కడి నుంచి పరారవుతున్నాడు. కాగా కిడ్నాప్‌ చేసిన ఓలా క్యాబ్‌ డ్రైవర్‌ ఊహాచిత్రాన్ని గీయించే ప్రయత్నం ఢిల్లీ పోలీసులు చేస్తున్నారు. కిడ్నాపర్‌ ప్రత్యక్షంగా తెలిసిన మరో ఓలా డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని అతని ఊహా చిత్రాన్ని గీయిస్తున్నారు.
ష్‌.. గప్‌ చుప్‌!
కిడ్నా్‌పకి గురైంది మొదలు నేటి వరకు ‘మీ అబ్బాయి క్షేమంగా ఉన్నాడు, కంగారు పడకండి’ అనే మాట తప్ప బాధితుడి బాబాయ్‌ నారాయణకుగానీ, తల్లిదండ్రులకు గానీ పోలీసులు ఎటువంటి అప్‌డేట్‌ ఇవ్వడం లేదు. కేసు కొలిక్కి రావడానికి మరో రెండు రోజులు పట్టొచ్చని పోలీసులు చెప్పినట్లు నారాయణగౌడ్‌ తెలిపారు. మరోవైపు, ఓలా ప్రతినిధులు కేసుని తీవ్రంగా ప్రభావితం చేస్తూ చిన్న విషయాన్ని కూడా బయటకు రానీయకుండా జాగ్రత్తపడుతున్నారు.

Check Also

కస్తూర్బా పాఠశాలను పరిశీలించిన డిఇడి విద్యార్థులు

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అహ్మద్‌ టిటిసి కళాశాలకు చెందిన డిఇడి విద్యార్థులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *