మగాళ్లకు ఊరట వరకట్నం, గృహహింస కేసుల్లో.. నిజముంటేనే అరెస్టులు!

  • 498-ఎ దుర్వినియోగం ఆపాలి
  • ఆరోపణల్లో అసత్యాలే ఎక్కువ
  • నిర్దోషుల హక్కులను కాపాడాలి
  • కమిటీ నివేదిక ఇచ్చాకే చర్యలు
  • బెయిల్‌పై వెంటనే నిర్ణయించాలి
  • సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
 ‘నన్ను కట్నం కోసం వేధిస్తున్నారు’ అని మహిళ ఫిర్యాదు చేయగానే ముందూ వెనుకా చూడకుండా భర్త, అత్త, మామ, ఆడబిడ్డలను అరెస్టు చేయడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫిర్యాదులో ప్రస్తావించిన అంశాల్లో నిజాలను ప్రాథమికంగా నిర్ధారించిన తర్వాతే అరెస్టు చేయాలని స్పష్టం చేసింది. దీనికోసం ప్రతి జిల్లాలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. గృహ హింస నిరోధక చట్టం (498ఏ ఐపీసీ) కట్టడిపై కీలక సూచనలు చేసింది. ‘‘ఆయా ఆరోపణల్లో చాలావరకు నిజాలు ఉండటంలేదు.
ముందూ వెనకా చూడకుండా అరెస్టులు చేస్తే భవిష్యత్తులో వారు మళ్లీ కలిసే అవకాశాలను దెబ్బతీసినట్లవుతుంది’’ అని జస్టిస్‌ ఆదర్శ కుమార్‌ గోయల్‌, జస్టిస్‌ యూయూ లలిత్‌ల ధర్మాసనం పేర్కొంది. ‘‘498ఏ ఐపీసీని ఎందుకు తెచ్చారు, దాని స్ఫూర్తి ఏమిటనేది మాకు బాగా తెలుసు. అలాగని ఏ నేరం చేయని వారి హక్కులను ఉల్లంఘించలేం. ఇలాంటి కేసుల్లో అనవసర అరెస్టులు, అత్యుత్సాహంతో దర్యాప్తును నివారించేలా పలు సూచనలు చేసినా సమస్య తీవ్రత తగ్గలేదు’’ అని ధర్మాసనం పేర్కొంది.
ఇకపై ఇలా చేయండి..
జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యం లో ప్రతి జిల్లాలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ‘కుటుంబ సంక్షేమ కమిటీ’లు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ‘‘ముగ్గురు సభ్యులతో ఈ కమిటీలు ఏర్పాటు చే యాలి. ఇందులో న్యాయ సేవకు లు, సామాజిక కార్యకర్తలు, రిటైర్డ్‌ అధికారులు, అధికారుల జీవిత భాగస్వాముల వంటి వారిని నియమించాలి. గృహ హింసపై పోలీసులకు లేదా మేజిస్ట్రేట్‌కు అందిన ఫిర్యాదులను ఈ కమిటీ పరిశీలనకు పంపించాలి.
ఫిర్యాదు అందిన నెలలోపు కమిటీ సభ్యులు దానిని పరిశీలించి ఆరోపణలపై అభిప్రాయం చెప్పాలి. కమిటీ నివేదిక వచ్చేదాకా అరెస్టు చేయకూడదు’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కమిటీ సభ్యులకు ప్రాథమిక శిక్షణ కూడా ఇవ్వాలని సూచించింది. వీరికి గౌరవ వేతనం ఇవ్వొచ్చని తెలిపింది. అలాగే, ఇలాం టి కేసుల దర్యాప్తును ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఒకే అధికారికి అప్పగించాలని తెలిపింది. ‘‘ఫిర్యాదుదారుడు, నిందితులు రాజీకి వస్తే జిల్లా జడ్జి లేదా సెషన్స్‌ జడ్జి లేదా సీనియర్‌ న్యాయాధికారి ద్వారా నియమితులైన వారు తుది నిర్ణయం తీసుకోవచ్చు. కేసు ఉపసంహరణకు అనుమతించవచ్చు’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Check Also

సిఎంకు పోస్టుకార్డులు రాస్తు నిరసన

  కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేదరి కులస్తులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం సంఘం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *