Breaking News

రణరంగంగా మారిన స్ఫూర్తియాత్ర

 

– ఇరువర్గాల మధ్య ఘర్షణ

– చోద్యం చూసిన పోలీసులు

కామరెడ్డి, ఆగష్టు 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మునిసిపల్‌ ఆవరణలో శుక్రవారం టిజేఏసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ నిర్వహించిన అమరుల స్ఫూర్తియాత్రను తెరాస శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో మునిసిపల్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన అమరుల స్పూర్తియాత్ర సభాస్థలి రణరంగాన్ని తలపించింది. పోలీసుల తీరు విమర్శలకు తావిచ్చింది. అమరుల స్పూర్తియాత్రకు పోలీసుల నుంచి అనుమతి ఉంది. ఈ క్రమంలోనే మునిసిపల్‌ ఆవరణలో స్ఫూర్తియాత్రకు సంబంధించి ఏర్పాట్లు చేసుకున్నారు. మరికాసేపట్లో కోదండరాం కామారెడ్డి చేరుకుంటారన్న తరుణంలో ఒక్కసారిగా తెరాస శ్రేణులు ప్లకార్డులు చేబూని సభాస్థలికి చేరుకున్నారు. టిజాక్‌ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులతో వాగ్వాదానికి దిగారు. కోదండరాం డౌన్‌ డౌన్‌, కోదండరాం గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. ఆగ్రహావేశాలతో వారిపై దాడికి దిగారు. కుర్చీలు, టమాటాలు, కోడిగుడ్లను రువ్వారు. దీంతో సభాస్థలి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు తెరాస నాయకులను అదుపుచేయడంలో విఫలమయ్యారు. ఓ పక్క సభకు అనుమతి ఉండగా సభాస్థలి వద్దకు తెరాస నాయకులను ఎందుకు అనుమతించారు, ఎలా అనుమతించారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఒకవేళ అనుమతిస్తే వారు టమాటాలు, కోడిగుడ్లతో ముందస్తు ప్రణాళికతో రాగా పోలీసులు తనిఖీ చేయకుండా ఎలా లోపలికి పంపారనేది పోలీసులే గుట్టు విప్పాల్సిన ప్రశ్న.

ఇంత జరుగుతున్నా దెబ్బలు తిని రక్తమోడుతున్న విద్యార్థి నాయకులనే జీపులో తీసుకెళ్లారు తప్ప, నామమాత్రంగా కొందరు తెరాస నాయకులను తీసుకెళ్లి చేతులు దులుపుకున్నారు. ఇదంతా చూస్తున్న ప్రజలు నివ్వెరపోయారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉందని, ప్రశ్నించేందుకు వస్తే దాడులు చేయడం ఏంటని ప్రజా సంఘాల నాయకులు, వామపక్షాల నాయకులు, ప్రజలు దాడిని బాహాటంగానే ఖండించారు. పోలీసులు మాత్రం టిజాక్‌ ప్రతినిధులను, తెరాస నాయకులను సంఘటన అనంతరం అరెస్టు చేసి సొంత పూచికత్తుపై విడుదల చేశారు. ఈ అరెస్టులు అదుపులోకి తీసుకోవడాలు ముందే చేసి ఉంటే అసలు ఘర్షణ జరిగేది కాదు కదా అని ప్రజాసంఘాలు ప్రశ్నించాయి. దాడి జరుగుతుందని తెలిసి పోలీసులు ఎందుకు మౌనం పాటించారని ప్రశ్నలు సంధిస్తున్నారు. మరోపక్క గాయపడ్డ విద్యార్థి నాయకులు కొందరు ప్రయివేటు, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. టిజివిపి జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్‌తోపాటు సిపిఐ సీనియర్‌ నాయకుడు నర్సింహారెడ్డి, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి భానుప్రకాశ్‌, కోశాదికారి పృత్వీరాజ్‌తోపాటు మరికొందరు గాయపడ్డారు.

Check Also

అక్టోబరు 2 నాటికి జిల్లాను స్వచ్చజిల్లాగా ప్రకటించేలా చర్యలు

  కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్టోబరు 2వ తేదీ నాటికి జిల్లాను బహిరంగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *