Breaking News

సినీఫక్కీలో పారిపోయేందుకు డేరా బాబా ప్లాన్!

న్యూఢిల్లీ: డేరా బాబా గుర్మీత్ సింగ్ పోలీసుల నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన మాట నిజమేనని తేలింది. అత్యాచారం కేసులో దోషిగా తేలడంతో సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనకు 20 యేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. తీర్పు వచ్చిన వెంటనే ఆయన సినీఫక్కీలో తప్పించుకునేందుకు ముందుగానే పథకం రచించినట్టు హర్యానా ఐజీ (ఐఆర్బీ) కేకే రావు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్థ కథనం ప్రచురించింది. పంచకుల కోర్టువద్ద పోలీసులు చుట్టుముట్టి ఉండకపోతే తన ప్రయివేటు సైన్యంతో కలిసి ఆయన ఉడాయించేవారేనని కేకే రావు పేర్కొన్నారు.
‘‘తీర్పు వెలువడగానే బాబా తన కారులోని ఎర్రటి బ్యాగులో దుస్తులు ఉన్నాయనీ… దాన్ని తన వద్దకు తీసుకురావాలని చెప్పారు. బ్యాగు తీసుకురావడానికి మేం వేరేవాళ్లను పంపించాం. బ్యాగు కోర్టు రూమ్‌కి చేరేసమయానికే… కోర్టు వెలుపల 2 కిలోమీటర్ల మేర హింస చెలరేగింది…’’ అని వెల్లడించారు. కోర్టుకు బయల్దేరే ముందే బాబా తన అనుచురులకు సూచనలు ఇచ్చారన్నారు. తాను ఎర్రటి బ్యాగు పట్టుకుంటే దోషిగా తేలినట్టేననీ… కోర్టు బయట అల్లర్లు సృష్టించి ఏదోవిధంగా పోలీసుల నుంచి తనను విడిపించాలని చెప్పారన్నారు. కాగా ఇదే ఎర్రటి బ్యాగును మోస్తూ కనిపించిన డిప్యూటీ అటార్నీ జనరల్ గురుదాస్ సింగ్ సల్వారాను హర్యనా ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే.
కోర్టు బయట టియర్ గ్యాస్ ప్రయోగించిన శబ్దం రావడంతోనే హింస మొదలైనట్టు బాబా గుర్తించారని… ఇంకా హింస పెచ్చరిల్లేలా కోర్టులోపలే చాలా సేపు కూర్చుని ఉండిపోయారన్నారు. తద్వారా మరింత సులభంగా తప్పించుకోవచ్చునని బాబా భావించినట్టు కేకే రావు తెలిపారు. ఏదో జరుగుతుందని ముందే పసిగట్టిన తాము హెలికాప్టర్ వరకు ఆయన కారులో కాకుండా డీసీపీ కారులో తీసుకెళ్లేందుకు వ్యూహం మార్చినట్టు ఐజీ పేర్కొన్నారు. పోలీసులంతా మానవహారంగా ఏర్పడి ఆయన్ను తరలించామన్నారు. ఈ నేపథ్యంలోనే బాబా భద్రతా సిబ్బంది కొందరు పోలీసులను కొట్టి ఆయన్ను విడిపించేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు.
హైడ్రామా ఇక్కడితో ముగియలేదనీ… పోలీసులు గుర్మీత్‌ను తరలిస్తుండగా బాబా ప్రయివేటు కమెండోలు కారుకు అడ్డంగా పడుకున్నారనీ.. మరికొందరు కారుపైకి ఎక్కి తమను అడ్డకునే ప్రయత్నం చేశారన్నారు. పోలీసులు వారిని నిలువరించేందుకు తీవ్రంగా ప్రతిఘటించాల్సి వచ్చినట్టు ఐజీ వెల్లడించారు. కొత్తకారు, కొత్త రూట్‌తో డేరాబాబా వ్యూహాన్ని తిప్పికొట్టామన్నారు. కాగా ఈ నెల 28న గుర్మీత్ సింగ్ భద్రతా సిబ్బంది, ప్రయివేటు కమెండోలు, హర్యానా పోలీసుల్లోని కొందరిపై హత్యాయత్నం, దేశద్రోహం, పోలీసు విధులకు భంగం కలిగించడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Check Also

బాసరకు పాదయాత్ర

  బీర్కూర్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసంత పంచమి సరస్వతిదేవి జన్మదినాన్ని పురస్కరించుకొని బీర్కూర్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *