Breaking News

వైద్యులు సక్రమంగా విధులు నిర్వహించాలి

 

– రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో 85 శాతం ప్రజలు ప్రభుత్వ వైద్యంపై ఆధారపడి ఉన్నారని, ఈ విషయాన్ని గమనించి వైద్యులు బాధ్యతగా వ్యవహరించి పేద ప్రజలకు సేవలందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు. ప్రతి వైద్యుడు సక్రమంగా విధులు నిర్వహించాలని, వైద్యం నిరాకరణ, నిర్లక్ష్యం వంటి వార్తాకథనాలు పత్రికల్లో చూసినపుడు బాధ కలుగుతుందని, ఇంత పెద్ద వ్యవస్థ కలిగిఉండి గ్రామస్తాయిలో పేదలకు వైద్యసేవలు అందకపోవడం బాధాకరమని, ఈ విషయంలో ప్రతి ఒక్కరు గుండెమీద చేయివేసుకొని ఆత్మవిమర్శ చేసుకోవాలని మంత్రి పేర్కొన్నారు.

ప్రయివేటు ఆసుపత్రుల్లో పరిస్థితి మెరుగుపడుతుంటే ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం ఇంకా సేవలో వెనకబడి ఉన్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు నాణ్యమైన వైద్యం కోసం తమ ఆస్తులు అమ్ముకున్న సందర్భాలున్నాయని, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ జూన్‌ 2న ప్రమాణస్వీకార ఉపన్యాసంలో రాష్ట్రంలోని 85 శాతం మంది పేదల సంక్షేమమే ధ్యేయమని తెలిపారని మంత్రి గుర్తుచేశారు.

గతనెలలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీల సంఖ్య 1320 కాగా అందులో 60 శాతం సాధారణ ప్రసవాలు, అదే ప్రయివేటు ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 92 అయితే ఇందులో 90 శాతం శస్త్రచికిత్సలే నని వివరించారు. ముందుగా అధికారులు, నాయకులు తమ కుటుంబీకులను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసుకునేలా ప్రోత్సహిస్తే ఇతరులకు మార్గదర్శకంగా ఉంటుందని మంత్రి సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి, జిల్లా ఉన్నతాధికారులు, ఆశావర్కర్లు, హెల్తు సూపర్‌వైజర్‌లు, అంగన్‌వాడి సూపర్‌వైజర్లు, సిడిపివోలు పాల్గొన్నారు.

Check Also

ప్రభుత్వ సూచన మేరకు రైతులు పంటలు వేయాలి

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి సూచన ప్రకారం రాబోయే వానాకాలంలో వ్యవసాయ అధికారులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *