Breaking News

ప్రమాదం తెచ్చిన మార్పు

– బషీరాబాద్‌ గ్రామానికి మానవత్వమే రక్షణ కవచం

– వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు అందిస్తున్న వైనం

– కొత్త సంప్రదాయానికి నాంది పలికిన యువకులు

నిజామాబాద్‌ టౌన్‌ (స్పెషల్ ఫీచర్ ), జూలై 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంచి మనసుల నుంచే మానవత్వం పరిమళిస్తుంది, ఆ పరిమళం చుట్టుపక్కల వారందరికి సువాసనను వెదజల్లుతుంది. ఇది ఓ సినీ కవి చెప్పిన మాట. ఇది నిజామాబాద్‌ జిల్లాలో కనిపించింది. కమ్మర్‌పల్లి మండలం బషీరాబాద్‌ గ్రామం ఒక కొత్త ఆలోచనకు కార్యరూపం దాల్చింది. ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తూ నెమ్మదిగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇపుడు ఆ గ్రామం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకొనే విధంగా చర్చ జరుగుతోంది.

వివరాల్లోకి వెళితే.. బషీరాబాద్‌ గ్రామానికి చెందిన హరికృష్ణ, రాకేశ్‌ అనే యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇద్దరి తలలకు బలమైన గాయాలవడంతో మృతి చెందినవారే. దీంతో గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ క్రమంలో గ్రామస్తులంతా సమావేశమై ఇక మీదట అందరు ఖచ్చితంగా హెల్మెట్లు కొనుక్కొని ప్రయాణం చేసేటపుడు తప్పకుండా ధరించాలని తీర్మానించారు.

అయినప్పటికి గ్రామస్తులందరు ఈ విషయంపై అంతగా శ్రద్ద కనబర్చలేదు. అదే సమయంలో గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ (దుబాయ్‌) బాశెట్టి నాగేశ్‌ అనే యువకుడు ఒక వినూత్న ఆలోచన ప్రతిపాదించాడు.

గ్రామానికి చెందిన కొంతమందిని సంప్రదించి కొంత మొత్తాన్ని విరాళంగా సేకరించి హెల్మెట్లను గ్రామంలోని కస్తూరి గంగారాం కిరాణ దుకాణంలో అందుబాటులో ఉంచారు. ద్విచక్ర వాహనంపై ఇతర గ్రామాలకు వెళ్లే వారికి ఉచితంగా ఒప్పందం చేసుకొని హెల్మెట్లు ఇచ్చి తిరిగి గ్రామానికి చేరుకున్న తర్వాత అదే దుకాణంలో అప్పగించాలని ఒక ప్రణాళిక రూపకల్పన చేశారు.

ఈ ఆలోచనకు ఆసక్తి కనబర్చిన శంకర్‌, గంగారెడ్డి, కృష్ణ పంతులు ఆయనకు మద్దతు పలికారు. ఆలోచనకు అవసరమయ్యే ఆర్థిక వనరులపై చర్చించారు. గ్రామస్తులను అడిగే బదులు తామే హెల్మెట్లు కొనడానికి అయ్యే ఖర్చును భరించి ఉచితంగా గ్రామస్తులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. గ్రామస్తుల సురక్షిత ప్రయాణానికి సహాయం అందించాలని నిర్ణయించారు.

మొదట్లో 20 హెల్మెట్లతో 2015 సెప్టెంబర్ 25న ప్రారంభమై ఉచిత పంపిణీ పథకం ఇపుడు వంద హెల్మెట్లకు చేరుకుంది. బషీరాబాద్‌ గ్రామస్తులే కాక చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఉచిత హెల్మెట్ల పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు.

ఇప్పటి వరకు 2248 సార్లు హెల్మెట్లను వాహన చోదకులు ఉపయోగించుకున్నారు.

హెల్మెట్లు కావాల్సిన వారు కస్తూరి గంగారాం కిరాణ దుకాణానికి వచ్చి తమ మొబైల్‌ నెంబరు, వాహన నెంబరు రాసి గ్రామానికి చేరుకున్న తర్వాత దుకాణంలో ముట్టజెపుతున్నారు. హెల్మెట్ల వాడకంపై కమ్మర్‌పల్లి పోలీసులు,  గ్రామాభివృద్ధి కమీటీ, గ్రామ యువత, ప్రజా ప్రతినిధులు అందరు విస్తృతంగా గ్రామస్తుల్లో అవగాహన కల్పించడం ద్వారా కూడా చాలా మంది కొత్తగా హెల్మెట్లు కొనుక్కున్నారు.

ఈ పథకానికి ఆర్థిక సహాయం అందిస్తున్న బాశెట్టి నాగేశ్‌, శంకర్‌, గంగాధర్‌, గంగారెడ్డి, కృష్ణ పంతులు ను సర్పంచ్‌ జమున దేవేందర్‌ అభినందించారు. ఇందులో నగేశ్‌, శంకర్‌ ప్రస్తుతం విదేశాల్లో ఉండగా, గంగారెడ్డి, కృష్ణ పంతులు, గంగాధర్‌ స్థానికంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. 

బషీరాబాద్‌ గ్రామస్తుల ఆలోచన అందరికి ఆదర్శం. అందరికి అనుసరణీయం. 

Check Also

ఆసుపత్రి మూసివేత

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో నిష్కల్‌ న్యూరో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ...

Comment on the article