Breaking News

స్థాయిని మరిచి అబద్దాలాడిన మోడి

బాన్సువాడ, నవంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి వచ్చి నిజామాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి మోడి విద్యుత్తు విషయంలో తన స్థాయిని మరిచి అబద్దాలాడారని ఆపద్దర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విరుచుకుపడ్డారు. బుధవారం బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన బహిరంగ సభలో కెసిఆర్‌ ప్రసంగించారు. బాన్సువాడ అంగడిబజార్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో నియోజకవర్గ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తు అందిస్తున్నామని వివరించారు. రైతుల సంక్షేమం కోసం రైతుబంధు పథకం ప్రవేశపెట్టి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లగలిగామని తెలిపారు. ఓట్ల కోసం ప్రధానమంత్రి దిగజారుడు మాటలు మాట్లాడారని విమర్శించారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి గెలుపు ఖాయమేనని, ప్రజల కోసం ఆయన అహర్నిశలు పాటుపడతారని పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేసే ఇలాంటి నాయకుని గెలిపించుకోవడం ఎంతో అవసరమని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రెండు పడక గదుల ఇళ్లపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, గతంలో అధికారంలో ఉండి వారు చేసిందేమిటో ప్రజల ముందు చెప్పాలని అన్నారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేదల కోసం ఇళ్ల నిర్మాణం కోసం కృషి చేయడం అభినందనీయమన్నారు. ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రతిపక్షాలు కల్లిబొల్లి మాటలు వల్లిస్తున్నాయని విమర్శించారు. ఎలక్ట్రిసిటి అథారిటి ఆఫ్‌ ఇండియా వెల్లడించిన గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం తలసరి విద్యుత్తు వాడకంలో తెలంగాణ ముందంజలో ఉన్నట్టు తేలిందని చెప్పారు. తమ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసమే పాటుపడిందని వివరించారు. రాబోయే ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. గిరిజనుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైందని ఆగమాగం కాకుండా ఆలోచించి మంచి నాయకుని ఎన్నుకోవాలని ఉద్బోదించారు.

కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌, ఎంపి బి.బి.పాటిల్‌, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, దేశాయ్‌పేట్‌ సొసైటీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి, నాయకులు సురేందర్‌రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Check Also

చిన్నమల్లారెడ్డిలో పోలీసుల కవాతు

కామారెడ్డి, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక, పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *