Breaking News

రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు అర్థరహితం

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణ అభివృద్దిపై అర్థరహిత వ్యాఖ్యలు చేశారని నిజామాబాద్‌ ఎంపి కవిత విమర్శించారు. శుక్రవారం నిజామాబాద్‌ ఎంపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాహుల్‌గాంధీ వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, తెలంగాణ అభివృద్దిపై రాహుల్‌గాంధీకి కనీస అవగాహన లేదని అన్నారు. గురువారం ఆర్మూర్‌ బహిరంగసభలో స్క్రిప్ట్‌ రైటర్లు రాసిన దాన్ని రాహుల్‌గాంధీ చదువుతూ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని, రాహుల్‌గాంధీకి చిత్తశుద్ది ఉంటే పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎంపి హోదాలో ప్రధానికి లేఖ రాయాలని సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ హయాంలో శ్రీరాంసాగర్‌ ఎగువ ప్రాంతంలో మహరాష్ట్ర ప్రభుత్వంనిర్మించిన అక్రమ 11 ప్రాజెక్టులను ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పేరిట తెరాస అవినీతికి పాల్పడుతుందని అనడం శోచనీయమని, బావితరాలకు నీటి ఇబ్బందులు ఎదుర్కొవద్దనే ఉద్దేశంతో ఆపద్దర్మ ముఖ్యమంత్రి ఎంతోముందుచూపుతో మిషన్‌కాకతీయ, మిషన్‌ భగీరథ పనులు చేపట్టారని అన్నారు. సింగరేణి కార్మికుల ఐటి మినహాయింపు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌, పసుపుబోర్డు ఏర్పాటు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా డిమాండ్‌పై రాహుల్‌గాంధీ పార్లమెంటులో తెరాస ఎంపిలకు మద్దతు ఇవ్వాలని అప్పుడే తెలంగాణ ప్రజలు మాట నమ్ముతారని అన్నారు. విలేకరుల సమావేశంలో నిజామాబాద్‌ అర్బన్‌ అభ్యర్థి బిగాల గణేశ్‌ గుప్త, నగర మేయర్‌ ఆకుల సుజాత, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Check Also

జూన్‌ 1 నుండి ప్రత్యేక పారిశుద్య కార్యక్రమం

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా జూన్‌ 1 వ తేదీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *