Breaking News
విలేకరులతో మాట్లాడుతున్న ఎంపి కవిత

తెరాస.. తెలంగాణ ప్రజల టీం

నిజామాబాద్‌, మార్చ్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర సమితి ఏ జాతీయ పార్టీకి బీటీమ్‌ కాదని కేవలం తెలంగాణ ప్రజలకు బిటీమ్‌ అని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం ఎంపీ క్యాంప్‌ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. దేశ ప్రజలు జాతీయ పార్టీలు వద్దు.. లోకల్‌ పార్టీలు ముద్దు అనుకుంటున్నారని, టీఆర్‌ఎస్‌ పార్టీకి తెలంగాణ సమస్యలు, ప్రజలు ముఖ్యమని, అదే జాతీయ పార్టీలకు ఎన్నో అంశాలు ఉంటాయన్నారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు టీఆర్‌ఎస్‌కు తెలంగాణ అంశాలు ముఖ్యమేనన్నారు. బిజెపి విభజన హామీలపై కొట్లాడామని, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఐఎఎస్‌ , ఐపిఎస్‌ అధికారులు తక్కువగా ఉంటే ఆ సంఖ్య పెంచమని కేంద్రం చుట్టూ తిరిగామని అన్నారు.

హక్కు భుక్తంగా రావాల్సిన ఎయిమ్స్‌ను ఢిల్లీ చుట్టూ తిరిగి సాధించుకున్నామని ఎంపి అన్నారు. నిజామాబాద్‌ రైల్వేలైన్‌కు నిధులు సాధించి పూర్తి చేశామని, బిజెపి, కాంగ్రెస్‌ దొందూ దిందే, ఒకే నాణేనికి బొమ్మా, బొరుసు లాంటివని, ఆ పార్టీలు, వాళ్ళు చేసిందేమీ లేదు కాబట్టి వారి వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి మందిరం, మసీద్‌, బోఫోర్స్‌, రాఫెల్‌ అంశాలను తెరపైకి తీసుకు వస్తున్నారని ఎంపి ధ్వజమెత్తారు. మమ్మల్ని ఢిల్లీకి ఆశీర్వదించి పంపిస్తే తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడామని గుర్తుచేశారు. ఇప్పుడు 16 టీఆర్‌ఎస్‌ 1 ఎంఐఎం అభ్యర్థులను గెలిపిస్తే సైనికుల్లా పనిచేస్తామని కవిత తెలిపారు. గతంలో ఇద్దరు జేడీఎస్‌ ఎంపీలు గెలిస్తే, ఒకరు ప్రధాని అయ్యారని, ఇద్దరు ఎంపీలతో తెలంగాణ సాధించామన్నారు.

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని, మన కేసిఆర్‌ లీడర్‌ దేశాన్ని సరైన మార్గంలో నడిపించడమే కాక మంచి మార్గంలో నడుపుతారని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసిఆర్‌కు విజన్‌, దార్శనికత ఉందని, అది దేశానికే దిశానిర్దేశం చేస్తుందన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ పెట్టిందే దేశ ప్రజల కోసమని వివరించారు. కాంగ్రెస్‌ వాళ్లు మా పార్టీ బిజెపి కి బి – టీమ్‌ అంటున్నారని, బిజెపి వాళ్ళు కాంగ్రెస్‌ కు బి – టీమ్‌ అంటున్నారని, కానీ మేం తెలంగాణ ప్రజలకు బి – టీమ్‌ అని కవిత స్పష్టం చేశారు. షి టీమ్స్‌, మిషన్‌ భగీరథ, బంధు, రైతు బీమా లాంటి పథకాలు దేశానికే ఆదర్శమని, ఏడెనిమిది రాష్ట్రాలు రైతు బందు అమలు చేస్తున్నాయని, కిసాన్‌ సమ్మాన్‌ను ఎన్నికల ముందు ప్రకటించడం రైతులను మోసం చేయడమేనన్నారు. రైతు బంధు అమలుకు ముందే మనం భూ రికార్డుల ప్రక్షాళన చేశామని, బిజెపి రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో భూముల వివరాలు సరిగా లేవని ఎంపి కవిత అన్నారు.

రాహుల్‌ గాందీ పేదలకు నెలకింత అని ఇస్తారట. నానమ్మ పేదరిక నిర్మూలనకు కషి చేస్తే ఆయన దానికి భిన్నంగా ఆలోచన చేస్తున్నారని, నానమ్మ గరీభి హటావో నినాదం చేశారని గుర్తుచేశారు. రాజకీయ చైతన్యం కలిగిన తెలంగాణ ప్రజలు మన ఇంటి పార్టీ, మన తెలంగాణ పార్టీ అయిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని, సైనికుల్లా ప్రజల పక్షాన పోరాడుతామని కవిత అన్నారు. 19 న నిజామాబాద్‌లో జరిగే సీఎం బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు తరలి వస్తారని, ఎండ తీవ్రత దష్ట్యా సాయంత్రం సభ నిర్వహిస్తున్నామని, అన్నీ ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మెల్సీ వీజి గౌడ్‌, మేయర్‌ ఆకుల సుజాత, టీఆర్‌ఎస్‌ నాయకులు ఈగ గంగారెడ్డి, దాదన్నగారి విఠల్‌ రావు, ఏఎఎస్‌ పోశెట్టి పాల్గొన్నారు.

Check Also

సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ

రెంజల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతులకు సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *