సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

వేసవిలో తాగునీటి సమస్యలు లేకుండా చూడండి

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవిని పురస్కరించుకుని ఎక్కడ కూడా ప్రజలు తాగునీటి సమస్యలను ఎదుర్కోకుండా అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం తన చాంబర్లో అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్ని మండలాల్లోని గ్రామాలలో అక్కడక్కడ తాగునీటి సమస్య ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా సిరికొండ, ధర్పల్లి, బోధన్‌, రెంజల్‌, ఎడపల్లి, మాక్లూర్‌ మండలాల్లోని కొన్ని గ్రామాల్లో అక్కడక్కడ తన పర్యటనలో సమస్య ఉన్నట్లు తెలిసిందన్నారు. అదేవిధంగా కొత్త గ్రామ పంచాయతీల్లోని తండాల్లో కూడా అక్కడక్కడ సమస్యలున్నట్లు అర్థమవుతుందన్నారు.

అధికారులు గ్రామాల్లో పర్యటించి ఎక్కడకూడా సమస్యలు రాకుండా అవసరమైన అన్ని రకాల ప్రత్యామ్నాయాలను తీసుకొని నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడ కూడా ప్రజలు బిందెలతో బయటకు రాకుండా చూడాలని, నీరు దొరకడం లేదని ఫిర్యాదులు రావద్దని, ప్రజలు ఆందోళన పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాక వచ్చే జూలై మాసం వరకు తాగునీరు సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బోధన్‌ మున్సిపాలిటీ పరిధిలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున కిరాయ బోర్లు, ట్యాంకర్స్‌, ఫ్లషింగ్‌ ద్వారా నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టులో 0.64 టిఎంసి నీరు ఉన్నందున 0.50 టిఎంసి నీటిని అలీసాగర్‌ ద్వారా నిజామాబాద్‌ ప్రజలకు అదేవిధంగా బెల్లాల్‌ చెరువును నింపడం ద్వారా బోధన్‌ పట్టణ ప్రజలకు తాగునీరు అందించడానికి ప్రతిపాదనలు పంపినందున ఆ అనుమతి కోసం చర్యలు తీసుకోవాలన్నారు.

మిషన్‌ భగీరథ ద్వారా పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఈ పనులలో కొన్నిచోట్ల కుటుంబాలకు తాగునీరు అందుతుందని మరికొన్ని చోట్ల ట్యాంకుల వరకు చేరుతుందని, మరికొన్ని ప్రాంతాల్లో నల్లాల వరకు రావాల్సి ఉందని ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా పంచాయతీ అధికారి వారి సిబ్బంది ద్వారా ఎక్కడెక్కడ ఇంకా తాగునీటి సమస్య ఉందో తెలుసుకొని అధికారులకు వివరాలు అందించాలని తెలిపారు. సమావేశంలో మిషన్‌ భగీరథ సిఇ ప్రసాద్‌ రెడ్డి, ఎస్‌ఈ రాజేంద్ర కుమార్‌, నీటిపారుదల శాఖ ఎస్‌ఇ దామోదర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జాన్‌ సాంసన్‌, బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఇటుక బట్టీ కార్మికుల‌ను స్వస్థలాల‌కు తరలించారు…

నిజామాబాద్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్‌ సందర్భంగా జిల్లాలో చిక్కుకుపోయిన 319 మంది ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *