Breaking News

బెల్ట్‌ తీయరా..?

రెంజల్‌, ఏప్రిల్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నూతన ఎక్సైజ్‌ పాలసీని ప్రవేశపెట్టినప్పటికి ఆచరణలో విఫలమవుతుంది. మద్యం వ్యాపారంలో పాత పద్దతులే పునరావతమవుతున్నాయి. కొత్త మార్పులు ఏమి కానరావడం లేదు. వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘించి డివిజన్‌లో మద్యం దందా జోరుగా కొనసాగిస్తున్నారు. సిండికేటుగా మారి ముందుబాబుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఎక్సైజ్‌ అధికారులు మాముళ్ళమత్తులో జోరుగా వ్యాపారులకు గొడుగు పడుతున్నారు. అధికారుల అండదండలతో అనధికార బెల్టుషాపులు యధేచ్చగా వెలుస్తున్నాయి. ఫలితంగా కోట్ల రూపాయల అక్రమ దందా నడుస్తోంది.

డివిజనల్‌ పరిధిలో ఇదీ పరిస్థితి…

ప్రస్తుతం ఎన్నికల సీజన్‌ కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో మద్యం ఏరులైపారుతోంది. నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు జరపరాదని ఎన్నికల కమిషన్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆ ఛాయలు డివిజన్‌ పరిధిలోనీ ఏ గ్రామంలోనూ కనిపించడం లేదు. బెల్టు షాపులకు అనధికారికంగా నిర్వహించిన వేలం పాటలో లక్షలు వెచ్చించి బెల్టు షాపులను దక్కించుకుంటున్నారు. ఈ తతంగమంతా బాహాటంగానే జరుగుతున్న ఎక్సైజ్‌ అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదు మద్యం షాపులను గ్రామాల్లోని వీడీసీ కమిటీలే ప్రోత్సహిస్తున్నాయి. ఒక్కోక్క గ్రామంలో మద్యం షాప్‌కు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వ్యాపారులు గ్రామాభివద్ధికి డబ్బులు కట్టి తమ దందాను నిర్భయంగా కొనసాగిస్తున్నారు. దీంతో సాయంత్రం వేళ గ్రామాల్లో మద్యం ప్రియులు కిక్కుతో గొడవలకు దిగుతున్న సందర్భాలున్నాయి. ఎక్సైజ్‌ అధికారులు తమ ఆదాయం కోసం ఇష్టమొచ్చిన రీతిలో మద్యం అమ్మకాలు ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

విస్తరిస్తున్న వ్యాపార సామ్రాజ్యం…

బోధన్‌ డివిజన్‌ పరిధిలోని మండలాలు గ్రామీణ ప్రాంతాల్లో మద్యం వ్యాపారం మరింత విస్తరించి మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. ఇప్పటికే డివిజన్‌ పరిధిలో ఉన్న మద్యం వ్యాపారులు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని నియోజకవర్గం అంతా విస్తరింపజేశారు. గ్రామాల్లో బెల్టుషాపులను పెట్టించడం వారికి మద్యాన్ని పంపిణీ చేసి లక్షలాది రూపాయలు దండుకోవడం అంతా నిబంధనలకు విరుద్ధమే అయినప్పటికీ ఎక్సైజ్‌ యంత్రాంగంలో ఏమాత్రము కదలిక లేదు. నవిపేట్‌ రెంజల్‌, ఎడపల్లి మండలాల్లో యథేచ్ఛగా అక్రమ మద్యం వ్యాపారం సాగుతున్న వీరి నిఘా ఉండడం లేదు. అలాగే దాబాల్లో ఇష్టారీతిన అక్రమ సిట్టింగులకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి అక్రమ మద్యం వ్యాపారాన్ని అరికట్టాల్సిన అవసరముంది.

నిబంధనలు బేఖాతర్‌…

మద్యం దుకాణాల వద్ద లూజు అమ్మకాలు జరపకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ ఎవరు పాటించడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్‌రూమ్‌లు ఏర్పాటు చేసుకొని అమ్మకాలు చేపడుతున్నారు. ప్రతి దుకాణం ముందు ధరల పట్టిక ఏర్పాటు చేయాలి, కానీ కొన్ని దుకాణాల వద్ద వాటిని ఏర్పాటు చేయడం లేదు ఒకవేళ ఏర్పాటుచేసిన వాటిని పాటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అధికారుల చేతివాటం…

అధిక ధరలకు విక్రయాలు.. బెల్టు షాపుల ఏర్పాటు.. వ్యాపారుల సిండికేటు జోరుగా మామూళ్లు ఇవ్వడం వంటి చర్యలు ప్రతి ఏటా జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ సంస్కరణలు పకడ్బందీగా అమలు చేయాల్సిన అధికారులు మామూళ్లకు అలవాటు పడడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. ఫలితంగా వ్యాపారులు అడుగడుగునా బెల్టుషాపులు నిర్వహిస్తూ గరిష్ట చిల్లర ధరలకు వక్రభాష్యం పడుతున్నారన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.

20శాతం అదనపు వసూళ్లు…

అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుతో యజమానులు ఇష్టారీతిన వ్యవరిస్తున్నారు. ఎమ్మార్పీ ధరకంటే 10 నుంచి 20 శాతం బెల్టుషాపులకు విక్రయించి వాటి ద్వారా మందుబాబులపై అదనపు బాదుడు బాదుతున్నారు. ఎమ్మార్పీ ధరకంటే బెల్టుషాపుల నిర్వాహకులు ఒక సీసాపై రూ.10 అదనంగా వసూలు చేయడంతో ఒక్కొక్క బెల్టుషాపు నుంచి నెలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు అదనపు ఆదాయం వస్తున్నట్లు తెలిసింది. వైన్స్‌ల్లో సాధారణంగా ఒక లైట్‌ బీరు ప్రభుత్వ ధర రూ.100 ఉంటే బెల్టుషాపు వారికి రూ.110కి విక్రయిస్తుండగా, వారు మందు బాబులకు రూ.130కి విక్రయిస్తున్నట్లు బెల్టుషాపు యజమానులే బహిరంగంగా చెప్పడం గమనార్హం.

నామమాత్రపు కేసులు…

బెల్టుషాపులపై దాడులు చేస్తున్నారంటే ఒక్క విజిలెన్స్‌ అధికారులు మాత్రమే ఎక్సైజ్‌ అధికారులు జరిపిన దాడులు నమోదు చేసిన కేసులు నామమాత్రమే విజిలెన్స్‌ అధికారులు వస్తున్నారనే విషయం క్షణాల్లో వైన్స్‌ షాపుల యజమానులకు తెలుస్తుందంటే కమ్యూనికేషన్‌ ఎవరి నుంచి లికావుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత విజిలెన్స్‌ అధికారులు బెల్టుషాపుల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా విచ్చలవిడిగా వెలుస్తున్న బెల్టుషాపులను సీజ్‌ చేసి నిర్వహకులపై తగుచర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

The following two tabs change content below.

Check Also

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాంటామని కామారెడ్డి జిల్లా ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *