Breaking News

కౌంటింగ్‌ ఏజెంట్ల నియామకానికి ముందుగా దరఖాస్తు చేసుకోవాలి

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు

నిజామాబాద్‌, మే 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంట్‌ నియోజకవర్గానికి కౌంటింగ్‌ ఏజెంట్ల నియామకానికి అభ్యర్థులు మూడు రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, జిల్లా ఎన్నికల అధికారి రామ్మోహన్‌ రావు తెలిపారు. శనివారం స్థానిక ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అనుమతి పొందిన ఏజెంట్లతో కౌంటింగ్‌ ప్రక్రియపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 23న కౌంటింగ్‌ నిర్వహించుటకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. పార్లమెంట్‌ పరిధిలో నిజామాబాద్‌లోని 5 అసెంబ్లీ స్థాయి నియోజకవర్గాలకు డిచ్‌పల్లి సిఎంసిలో, జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలకు జగిత్యాలలో లెక్కింపు జరుగుతుందన్నారు.

ఉదయం ఎనిమిది గంటలకు లెక్కింపు ప్రారంభం అవుతుందని ముందుగా వీటీపీఎస్‌ పోస్టల్‌ బ్యాలెట్‌లను లెక్కిస్తారన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 18 టేబుల్స్‌ ఏర్పాటు చేస్తామని అదనంగా మరో టేబుల్‌ ఆర్‌.వో. కోసం ఉంటుందన్నారు. ఇందుకుగాను పోటీ చేసే అభ్యర్థులు (18+3) ప్రతి టేబుల్‌కు ఒక కౌంటింగ్‌ ఏజెంట్‌ను ఆర్‌.ఓ. టేబుల్‌ కొరకు పోస్టల్‌ ఈటీపిబియస్‌ 3 చొప్పున ఏజెంట్లుగా నియమించుకోవచ్చన్నారు. ఇందుకుగాను అభ్యర్థులు పారం 18 ద్వారా ఏ.ఆర్‌.వో.కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నిజామాబాద్‌కు ప్రత్యేకంగా 36 టేబుళ్లు ఏర్పాటు చేసుకొనుటకు అనుమతించాల్సిందిగా ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు సమర్పించామని ఒకవేళ అనుమతి వస్తే ఆ విధంగా 36 టేబుళ్లు ఏర్పాటు చేస్తామన్నారు.

కౌంటింగ్‌ సందర్భంగా ప్రతి ఒక్కరు వోటింగ్‌ సీక్రెసీ అమలు చేయాలని అతిక్రమిస్తే చర్య తీసుకుంటామన్నారు. సెల్‌ ఫోన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించడం ఉండదన్నారు. అన్ని రౌండ్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ప్రతి నియోజకవర్గం పరిధిలో ర్యాండమ్‌గా 5 వివి పాట్లను ఒకదాని తరవాత ఒకటి లెక్కించడం జరుగుతుందని తెలిపారు. ఒకవేళ తేడా వస్తే వివి ప్యాట్లలో వచ్చిన ఓట్లనే ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అయితే 2013 నుండి నిర్వహించిన కౌంటింగ్‌ సందర్భంగా ఇప్పటివరకు ఒక్కటి కూడా తేడా రాలేదని తెలిపారు. ఒక వివిప్యాట్‌ కౌంటింగ్‌ సమయం ఒక గంట ఉంటుందని సుమారు ఐదు రౌండ్లకు సమానంగా ఉండవచ్చన్నారు. మొదటి ఫలితం రెండు గంటల పైగా పట్టవచ్చని రెండో రౌండు నుండి సమయం తగ్గుతుందన్నారు.

ఏజెంట్లను కౌంటింగ్‌ కేంద్రాలలో రొటేషన్‌ లో అనుమతించడం జరుగుతుందన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియ నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్లో 16 రౌండ్లు, జగిత్యాల, కోరుట్లలో 15, బాల్కొండ, బోధన్‌లో 14, ఆర్మూర్లో 13 రౌండ్లలో ఉంటుందన్నారు. అభ్యర్థులకు జూన్‌ 15న జిల్లా కో-ఆపరేటివ్‌ కార్యాలయంలో ఈ ఫైలింగ్‌పై సమావేశం ఉంటుందని, అదేవిధంగా జూన్‌ 18 లోపు ఖర్చులకు సంబంధించిన వివరాలను డిసీఓ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. సమావేశంలో పార్లమెంటు పరిధిలోని ఏఆర్‌ఓలు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌, గోపి రామ్‌, వేణు, జాన్‌ సామ్సన్‌, అభ్యర్థులు, పార్టీల ప్రతినిధులు, ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు

Check Also

ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల ప్రణాళికలో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *