Breaking News

కౌంటింగ్‌ కేంద్రంలోకి గుర్తింపు కార్డు తప్పనిసరి

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు

నిజామాబాద్‌, మే 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అభ్యర్థులు కానీ వారి ఏజెంట్స్‌ కాని గుర్తింపు కార్డు ఉంటేనే కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌, నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి రామ్మోహన్‌ రావు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌ ప్రగతిభవన్‌ సమావేశ మందిరంలో పార్లమెంట్‌ నియోజకవర్గ పోటీ చేస్తున్న అభ్యర్థుల ఏజెంట్లతో ఎన్నికల కౌంటింగ్‌పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభ్యర్థులకు కానీ వారి అనుమతి పొందిన ఏజెంట్లు కానీ జిల్లా ఎన్నికల యంత్రాంగం జారీ చేసిన గుర్తింపు కార్డు ఉంటేనే లోనికి అనుమతించడం జరుగుతుందని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో నోటా తో పాటు మరో 185 మంది అభ్యర్థులు ఉన్నందున 36 టేబుల్స్‌ ద్వారా కౌంటింగ్‌ నిర్వహించడానికి ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇచ్చిందన్నారు.

ఏజెంట్లు కు కేటాయించిన టేబుల్‌ వద్దనే కౌంటింగ్‌ ప్రక్రియను పరిశీలించవలసి ఉంటుందన్నారు. కౌంటింగ్‌ తేదీ 23న ఉదయం ఆరు గంటలకే స్ట్రాంగ్‌ రూములను తెరుస్తామని తెలిపారు. తిరిగి ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత వాటికి సీలు వేయడం జరుగుతుందన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అభ్యర్థులకు కానీ ఏజెంట్లకు, సిబ్బందికి కాని సెల్‌ఫోన్లు అనుమతించడం జరగదన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల్లోకి జాతీయ పార్టీలకు ప్రాధాన్యతనిస్తూ ఇతర ఏజెంట్లకు రొటేషన్‌ పద్ధతిలో అనుమతించడం జరుగుతుందన్నారు. ఒక సమయంలో ఏజెంట్‌ లేదా అభ్యర్థి మాత్రమే లోపల ఉంటారని తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్‌ ప్రారంభిస్తామని తెలిపారు.

అభ్యర్థుల ఖర్చులకు సంబంధించి జూన్‌ 15 లోగా ఈ ఫైలింగ్‌ చేసుకోవాలని, నోడల్‌ అధికారి ద్వారా ఖర్చులపై శిక్షణకు సంబంధించి మీటింగ్‌ ఏర్పాటు చేస్తారన్నారు. ఖర్చుల రీ కాన్సిలేషన్‌ జూన్‌ 18న నిర్వహిస్తారని లెక్కల సమర్పణకు జూన్‌ 21 చివరితేదీ అన్నారు. ఇట్టి విషయాలను అభ్యర్థులు వారి ఏజెంట్లు గమనించాలని కలెక్టర్‌ తెలిపారు. ఖర్చులకు సంబంధించి ఇతర వివరాలకు జిల్లా సహకార శాఖ సహాయ రిజిస్ట్రార్‌ రాజేశ్వర్‌ను సంప్రదించాలని, లేదా మొబైల్‌లో 9110317720 సంప్రదించవచ్చని తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, ఖర్చుల నోడల్‌ అధికారి, డిసిఓ సింహాచలం, పోటీ చేస్తున్న అభ్యర్థులు వారి ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల ప్రణాళికలో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *