Breaking News

తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర శాశ్వతం

నిజామాబాద్‌, జూన్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉద్యమంలో ఎన్‌జీవోలు, ఉద్యోగులు నిర్వహించిన పాత్ర ఎప్పటికీ శాశ్వతమని రాష్ట్ర రవాణా, రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని టీఎన్జీవోస్‌ భవనంలో రక్తదాన శిబిరాన్ని టీఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. మంత్రి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముందుగా జిల్లా ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

టీఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో ఎక్కువ యూనిట్లు రక్తదానం చేసిన సందర్భంగా టిఎన్‌జివోస్‌ ఇప్పటికే గవర్నర్‌ చేత అవార్డు అందుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో ఉద్యోగులు, అధికారులు, సంఘాల ప్రతినిధులు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ వెనుకంజ వేయకుండా ఉద్యమంలో ముందు వరుసలో నిలిచి తెలంగాణ సాధనలో అత్యంత ప్రధాన పాత్ర పోషించారన్నారు. వారి పాత్ర ఎప్పటికీ మరువలేనిదన్నారు. ఉద్యోగుల సంక్షేమంలో ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా సానుకూలంగా ఉన్నారని రాష్ట్రం సిద్ధించగానే 43% ఫిట్‌మెంట్‌ మంజూరు చేశారని తెలిపారు.

ఉద్యోగుల సమస్యలపై సరైన సమయంలో ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారని వారి సమస్యలను పరిష్కరిస్తారని తనకు నమ్మకముందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మాట్లాడుతూ ఉద్యోగులు బంగారు తెలంగాణ సాధనలో భాగంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా ఆరోగ్య తెలంగాణలో భాగంగా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన రోగులకు రక్తాన్ని అందించడంలో ఉద్యోగుల సంఘం ముందంజలో ఉన్నదని అందుకు వారిని అభినందిస్తున్నానని తెలిపారు.

కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బిగాల గణేష్‌ గుప్త, మేయర్‌ సుజాత, ఆర్‌డిఓ వెంకటేశ్వర్లు, టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు కిషన్‌, సంఘ సభ్యులు, ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

‘ఆల‌న’ ప్రారంభం

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లాలో అసంక్రమిక ...

Comment on the article