Breaking News

ప్రజల సహకారంతోనే పర్యావరణ పరిరక్షణ

జూన్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల సహకారంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. జూన్‌ 5 న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, అటవీ శాఖ, జన విజ్ఞాన వేదిక, ఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ నుండి బస్టాండ్‌ ద్వారా బాల్‌ భవన్‌ వరకు అవగాహన ర్యాలీ ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ ర్యాలీని ప్రారంభించిన అనంతరం బాలభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచీకరణ, నగరీకరణ, జనాభా పెరుగుదల, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పర్యావరణానికి పలు కారణాలు ముప్పుగా పరిణమిస్తున్నాయన్నారు. కొన్ని సంవత్సరాలుగా విపరీతంగా పెరుగుతున్న టెంపరేచర్‌లు ఇందుకు ఉదాహరణ అన్నారు.

వీటితోపాటు ప్లాస్టిక్‌ వాడకం ద్వారా కూడా పలు దుష్ఫరిణామాలు ఏర్పడుతున్నాయన్నారు. వీటిని అధిగమించడానికి కేవలం జరిమానాలు విధించి ర్యాలీలు నిర్వహిస్తే సరిపోదన్నారు. జరిగే నష్టాన్ని, వైపరీత్యాలను అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు ముందుకు వస్తేనే సాధ్యమవుతుందన్నారు. చెత్తను ఇంటి పరిసరాల్లో పార వేయకుండా ఇంటి ముందుకు వచ్చే చెత్త వాహనాలలో వేయాలని తెలిపారు. ఇందుకోసం మనల్ని మనం మార్చుకోవలసి ఉంటుందని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్లాస్టిక్‌ వాడకం బాగా పెరుగుతుందని దీని ద్వారా కూడా పలు దుష్పరిమాణాలు ఎదురవుతున్నాయన్నారు. ప్లాస్టిక్‌ నాశనం కాదని, ప్రకతిలో కలిసిపోదని, కొన్ని వేల సంవత్సరాల పాటు దీని ప్రభావం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, పశువులు ప్లాస్టిక్‌ సంచులను తినడం ద్వారా చనిపోతున్నాయని, అంతేకాక క్యాన్సర్‌కు కారణంగా కూడా అవుతుందనే చేదు నిజాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.

చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ అమలు చేయడానికి అధికారులు ఉన్నప్పటికీ ప్రజల నుండి సహకారం ఉన్నప్పుడే కార్యక్రమమైనా విజయవంతమవుతుందని తెలిపారు. ఇందుకుగాను ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వాహనాల వాడకం పెరగడం వల్ల వాయు కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోతున్నదని తద్వారా మనుషులు పలు రకాలుగా వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. పంట పొలాల్లో పంటలు కోసిన అనంతరం ఆ భూముల్లో మిగిలిన వ్యర్ధాలను తగులబెట్టడం కూడా భూమితోపాటు పర్యావరణానికి నష్ట కారకమని, రైతులు శాస్త్రజ్ఞుల సూచనలను పాటించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. వీలైనంతవరకు వాహనం వాడకాన్ని తగ్గించాలని తద్వారా వచ్చే వాయు కాలుష్యాన్ని కొంతవరకైనా నివారించడానికి వీలవుతుందన్నారు.

ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద ఏర్పాటుచేసిన సమయాన్ని బట్టి వాహనాన్ని ఆపి వేయడం ద్వారా ఇంధనం ఆదా కావడంతోపాటు దాని ద్వారా వెలువడే కాలుష్యాన్ని కూడా తగ్గించిన వారమవుతామని తెలిపారు. ఈ సంవత్సరం నినాదం వాయు కాలుష్యాన్ని నిర్మూలిద్దామనే దానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు. పరిశ్రమల వల్ల కాలుష్యం ఏర్పడకుండా ఏ చర్యలు తీసుకోవాలో ఆ నిబంధనలను పరిశ్రమలు పాటించాలని తెలిపారు. లేదంటే యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోదని ఆయన హెచ్చరించారు. మొక్కలు నాటడం, చెట్లను పరిరక్షించడం ద్వారా పర్యావరణాన్ని రక్షించడం వీలవుతుందని వచ్చే వర్షాకాలంలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా మొక్కలను నాటి వాటిని పరీక్షించడానికి ముందుకు రావాలని ఆయన కోరారు.

పర్యావరణాన్ని పరిరక్షించడంలో ముఖ్యంగా విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, యువత ముందుండాలని, కాలుష్యం వల్ల ఏర్పడే విపరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని యువత ద్వారానే ఇది విజయవంతమవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన పోటీలలో విజయం పొందిన బాల్‌భవన్‌ విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు, మొక్కలను అందించారు. కార్యక్రమాల్లో మున్సిపల్‌ కమిషనర్‌ జాన్‌ సామ్సన్‌, ఎఫ్‌డివోలు రాములు, వెంకటేశ్వరరావు, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఈఈ బిక్షపతి, ఏఈఈ మానస, జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు రామ్మోహన్‌రావు, మేఘన డెంటల్‌ కాలేజ్‌ విద్యార్థులు, అటవీ శాఖ సిబ్బంది, పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

రాజ్యాంగానికి అనుగుణంగా జీవనం సాగించాలి

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం లింగంపేట్‌లో జరిగిన సమావేశంలో సర్పంచ్‌కు కాంస్టిట్యూషన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *