Breaking News

ప్రభుత్వ బడి పిలుస్తోంది

మెరుగుపడుతున్న వసతులు, బోధన

ఆదరిస్తే పేదలకు ఎంతో ఉపశమనం

రెంజల్‌, జూన్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యపు శిథిలాల కింద చిక్కుకున్న జిల్లాలోని సర్కారు బడులు నేడు పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తున్నాయి. ఉపాధ్యాయుల్లో మారిన తీరు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు సమాజంలో వస్తున్న మార్పులతో సర్కార్‌ బడులు మళ్లీ విద్యా సుగంధాలను పంచేలా నిలుస్తున్నాయి. నిష్ణాతులైన ఉపాధ్యాయులు, ఉచిత సదుపాయాలు, బోధనలో మార్పులకు చిహ్నంగా నిలుస్తున్న డిజిటల్‌ తరగతులు, క్రీడలు ఆహ్లాదకరమైన వాతావరణంలో నేడు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల అభ్యున్నతికి కషి చేయాలన్న దక్పథంలోకి వచ్చాయి. ప్రభుత్వం కూడా ఒక్కో విద్యార్థిపై వేల రూపాయల మేర ఏటా వివిధ రూపాల్లో ఖర్చు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న వసతులపై ప్రత్యేక కథనం.

బోధనలో నైపుణ్యమే

ప్రభుత్వ బడుల్లో గతంతో పోలిస్తే బోధనలో విద్యార్థుల నైపుణ్యాలు మెరుగు పడుతున్నాయి. గత నాలుగేళ్లుగా నిజామాబాద్‌ జిల్లా విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ప్రైవేటుకు ధీటుగా సాధిస్తున్న ఫలితాలను నిదర్శనంగా తీసుకోవచ్చు. వివిధ పాఠ్యాంశాలల్లో మంచి అవగాహన కలిగి బోధన నైపుణ్యాల్లో నిపుణులైన ఉపాధ్యాయులు ఉన్నారు. చదువుల సామర్థ్యాల్లో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా త్రిఆర్‌ కార్యక్రమాన్ని పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులను నిర్వహించి వారిని చదువులో ముందుకు నడిపిస్తున్నారు.

మౌలిక వసతులు భేష్‌

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఇబ్బంది పడకుండా పాలకులు, అధికారులు పలు రకాల వసతులను గతానికి భిన్నంగా కల్పిస్తున్నారు. తరగతి గదిలో రోజంతా కూర్చున్న విద్యార్థులకు ఇక్కట్లు పడకుండా ప్రైవేటును పోలిన రీతిలో నిలిచేలా డ్యూయల్‌ డిస్కులను జిల్లాలోని అన్ని పాఠశాలలకు విద్యాశాఖ సరఫరా చేసింది. తాగునీటి వసతి, ఆటలాడే విశాలమైన క్రీడా మైదానాలు, ప్రభుత్వ పాఠశాలలో బాలల చెంత నిలుస్తున్నాయి. వసతులు, పాఠశాల నిర్వహణ, గ్రంథాలయం, సైన్స్‌ ల్యాబ్‌, ఆటల పరిసరాల కోసం ప్రభుత్వం నిధులు ఏటా మంజూరు చేస్తుండడంతో వాటి వినియోగంపై నిర్లప్తత లేకుండా పోతుంది.

ఆంగ్లమాద్యమం చదువులు

జిల్లాలోని తల్లిదండ్రుల్లో కొన్నేళ్లుగా వస్తున్న మార్పులకు అనుగుణంగా జిల్లాలోని ప్రభుత్వ బడులు కూడా ఆంగ్లమాధ్యమంలో తరగతులను నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు ఉపాధ్యాయులు నిర్వహించిన బడిబాట కార్యక్రమం ప్రయోజనంగా నిలిచినట్లు జిల్లా విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి.

సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం

సర్కారు బడుల్లో చదువుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థుల ఆకలి తీర్చేందుకు బడుల్లో సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు పౌష్టికాహారంగా వారానికి 3 కోడి గుడ్లు అందించడం కూరల్లో గతేడాది నుంచి నాణ్యత కూడా మెరుగు పడింది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు.

ఉచిత పుస్తకాలు, దుస్తులు

ప్రభుత్వ బడిలో చదివే అన్ని తరగతుల విద్యార్థులకు విద్యాశాఖ ఉచితంగా పుస్తకాలను అందజేస్తుంది. బడుల ప్రారంభం నాటికే పుస్తకాలు చేరే సౌలభ్యం ఏర్పడింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థులకు సరిపడేలా పాఠ్య పుస్తకాల పంపిణీ జరుగుతుంది. అలాగే ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు ఏటా రెండు జతల సమదుస్తులను ప్రభుత్వమే అందిస్తుంది.

ఉపాధ్యాయుల కషి మార్గదర్శకమే

పలు ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రవేశాల కోసం అంకిత భావాన్ని ప్రదర్శిస్తూ వినూత్న తరహాలో విద్యార్థుల ప్రవేశాల కోసం చేపడుతున్న చర్యలు మిగిలిన ఉపాధ్యాయులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.

Check Also

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాంటామని కామారెడ్డి జిల్లా ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *